వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీ కోసం ఈనెల 2న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలో 62 వీఆర్ఓ పోస్టులకు 76,179మంది, 177 వీఆర్ఏ పోస్టులకు 4519 మంది అభ్యర్థుల మార్కులను వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు 200 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : శనివారం విడుదలైన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ) ఉద్యోగాల ఫలితాల్లో ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన ఎలగందుల శ్రీకాంత్ 98 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ఖానాపురంలో ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో రెగ్యులర్‌గా చదువుకోకుండా హైదరాబాద్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసుకుంటూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ(బీఏ) పూర్తిచేశారు.
2012 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయి తే ఆప్షన్‌గా ఫైర్‌మెన్‌గా ఉద్యోగం పొందారు. శ్రీకాంత్ ప్రస్తుతం జనగామలో ఫైర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే శ్రీకాంత్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన వీఆర్వో పరీక్ష రాసి జిల్లా టాపర్‌గా నిలిచారు. ‘గ్రూప్-1 ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.అరుుతే గ్రూపు-2 కోసం ప్రిపేర్ అవుతున్న దశలో వీఆర్వో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో దీనికి దరఖాస్తు చేశాను. గ్రూపు-2కు ప్రిపేర్ కావడం కూడా తనకు ఈవీఆర్వో పరీక్షకు ఉపయోగపడింది.
పోలీస్ కానిస్టేబుల్‌కు ఎంపికైనప్పుడు తనకు సివిల్, ఫైర్స్టేషన్లలో ఉద్యోగాలకు అవకాశం రాగా ఫైర్‌మెన్ ఉద్యోగిగా ఆప్షన్ తీసుకొని పనిచేస్తున్నాను. వీఆర్వో రాతపరీక్షకు హాజరై 99 మార్కులకు గాను 98 మార్కులతో టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఫైర్‌మెన్ నుంచి వీఆర్వోగా విధుల్లో చేరుతాను. అయితే ఇది కూడా చిరుద్యోగమే అయినా ఫైర్ మెన్ కంటే కొంత ప్రశాంతంగా ఉంటుంది. వీఆర్వో ఉద్యోగంతోనే సరిపుచ్చుకోవాలని లేదు. గ్రూప్-1 ఉద్యోగాన్ని సాధించాలనే తపన ఉంది. ఆ దిశగా ప్రిపరేషన్ కొనసాగిస్తాను’ అని శ్రీకాంత్ చెప్పారు.