ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాంచంద్రునాయక్
డోర్నకల్, న్యూస్‌లైన్ : మాజీ ఐఏఎస్ అధికారి తేజావత్ రాంచంద్రునాయక్ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యూరు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆయనను నియమించారు. కురవి మండలం సీరోలు శివారు రూప్లాతండాకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి రాంచంద్రునాయక్ మూడు నెలల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మొదటి నుంచీ తెలంగాణవాది అయిన రాంచంద్రునాయక్ టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ మేనిఫెస్టో కమిటీలో సభ్యునిగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాంచంద్రునాయక్.. కేంద్రం, రాష్ట్రానికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.
రైతు కుటుంబానికి చెందిన రాంచంద్రునాయక్ ఐఏఎస్ అధికారిగా కీలక పదవులు నిర్వహించారు. మొదట ఐపీఎస్‌గా సెలక్ట్ అయినా శిక్షణ పొందే సమయంలో ఐఏఎస్‌గా సెలెక్ట్ అయ్యారు. సీరోలులో ప్రాథమిక విద్య, మహబూబాబాద్‌లో ఇంటర్మీడియట్ చదివారు. 1971 నుండి 1975 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ సిస్టం పూర్తి చేశారు.
అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసిన తరువాత 1983లో బీహార్ కేడర్ ఐపీఎస్‌కు ఎంపికై.. ఈ ప్రాంతం నుంచి ఐపీఎస్ సాధించిన మొదటి గిరిజనుడిగా రికార్డు సృష్టించారు. ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐఏఎస్‌గా ఒరిస్సా కేడర్‌కు ఎంపికయ్యారు. 1991-92లో ఒరిస్సాలోని నవరంగపూర్ జిల్లా కలెక్టర్‌గా, 1992-93లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ భారత ప్రభుత్వ కార్యదర్శిగా, డిఫెన్స్ కార్యదర్శిగా, ఒరిస్సా గవర్నర్ కార్యదర్శిగా రెండు సార్లు పనిచేశారు.
అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్గోమాంగో వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఒరిస్సా రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ 2013 ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ఐఏఎస్‌గా కేంద్రంలో పలు కీలక పదవులు నిర్వహించిన రాంచంద్రునాయక్‌కు గుర్తింపునిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు.