కొత్త కలెక్టర్.. సత్యనారాయణ రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కొత్త కలెక్టర్‌గా పరుపాటి సత్యనారాయణరెడ్డి (2003 బ్యాచ్ ఐఏఎస్ అధికారి) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కలెక్టర్‌గా పనిచేసిన టి.చిరంజీవులు స్థానంలో ఆయన వచ్చారు. చిరంజీవులును బదిలీ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు కలెక్టరేట్లో సత్యనారాయణరెడ్డి కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాత కలెక్టర్ చిరంజీవులు ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
ఇదీ..సత్యనారాయణరెడ్డి ప్రస్థానం
కరీంనగర్ జిల్లా ఓదేలు మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన పి. సత్యనారాయణరెడ్డి 1987లో గ్రూపు-1 సర్వీసుల్లో చేరి వాణిజ్య పన్నుల శాఖలో మొదటి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా, ఆ శాఖ జాయింట్ కమిషనర్‌గా, అసిస్టెంట్ కమిషనర్‌గా వివిధ హోదాల్లో 2007 వరకు పనిచేశారు. ఈయనకు వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నప్పుడు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. నల్లగొండ, మహబూబ్‌నగర్ డివిజన్లో ఆయన 1999 నుంచి 2001 వరకు వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. 2007లో ఐఏఎస్ అధికారిగా కన్ఫర్మ్ అయిన తర్వాత జాయింట్ కలెక్టర్‌గా విశాఖ జిల్లాలో 2009 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏపీ ఫుడ్ కార్పొరేషన్ ఎండీగా రెండేళ్ల పాటు పనిచేశారు. ప్రస్తుతం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) వైస్‌చైర్మన్ అండ్ఎండీగా పనిచేస్తున్నారు. కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ మన జిల్లాకే వచ్చారు.
జిల్లా కలె క్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణరెడ్డి పలువురు జిల్లా ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పూలబొకేలతో స్వాగతం పలికారు. కలెక్టర్‌కు స్వాగతం చెప్పేందుకు వచ్చిన వారితో కలెక్టరేట్ కిటకిటలాడింది. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. అయితే, సత్యనారాయణరెడ్డి 2007లో ఐఏఎస్ అధికారిగా నియమితులైనా ఆయనకు నాలుగేళ్ల సర్వీసును కలిపి ఆయనను 2003 బ్యాచ్ అధికారిగా ప్రభుత్వం గుర్తించింది. విధి నిర్వహణలో చురుకైన అధికారిగా పేరున్న సత్యనారాయణరెడ్డి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది.
తనదైన ముద్ర వేసుకున్న చిరంజీవులు
జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన దాదాపు ఏడాదిన్నర కాలంలో చిరంజీవులు తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ఒకేసారి వచ్చిపడిన నాలుగు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారాయన. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని పోలింగ్ శాతాన్ని 74 నుంచి 80.48శాతానికి చేర్చారు. సామాజికాంశాల్లో కొంత వెనుకబాటును గుర్తించిన ఆయన మన కోసం మనం అనే విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టి నిరక్షరాస్యత, బాలకార్మిక నిర్మూలన, తాగునీరు - పారిశుద్ధ్యం, ఆరోగ్యం - పౌష్టికాహారం, జెండర్ మరియు బాలికా సంరక్షణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. రెండు లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించి 1.10లక్షల మంది పరీక్ష ఉత్తీర్ణులయ్యేలా కృషి జరిపారు. 3,600 మంది బాలకార్మికులను గుర్తించి 2,400 మందిని స్కూళ్లలో చేర్పించారు.
గ్రామ సందర్శనం..
అదే విధంగా గ్రామసంద ర్శనం అనే మరో కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించే వ్యవస్థను బలోపేతం చేశారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు జిల్లాలో 1100 మొత్తం ఉండగా, ప్రస్తుతం జిల్లాలో 86వేల మరుగుదొడ్లున్నాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాను నంబర్‌వన్ స్థానానికి చేర్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ కూలీలకు భవన నిర్మాణకూలీల చట్టం కింద బీమా సౌకర్యాన్ని కల్పించారు. మాతాశిశుసంరక్షణ పథకం అమలుపైనా ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. 37 పీహెచ్సీలలో కలిపి నెలకు 100లోపు ఉన్న ఆస్పత్రి ప్రసవాలు ఆయన హాయాంలో 225 వరకు చేరాయి. మొత్తంమీద 16 నెలల 12 రోజులు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అటు అధికారగణంలోనూ, ఇటు ప్రజల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇద్దరూ ‘సత్యనారాయణలే’
అయితే, యాదృచ్చికమే అయినా జిల్లాలో ఇప్పుడు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లిద్దరూ సత్యనారాయణలే కావడం గమనార్హం. ఇటీవలే జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి సత్యనారాాయణ బాధ్యతలు చేపట్టగా, ఇప్పుడు మరో ఐఏఎస్ అధికారి సత్యనారాయణ రెడ్డి కలెక్టర్‌గా వచ్చారు. ఇద్దరు ‘సత్యనారాయణ’ల నేతృత్వంలో జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్లాలని ఆశిద్దాం.
వరుసగా ఐదుగురు కలెక్టర్లకు మొదటి పోస్టింగ్ జిల్లాలోనే..
ఇంకో విశేషమేమిటంటే... నల్లగొండ జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన అధికారులందరూ కలెక్టర్‌గా తమ తొలి పోస్టింగ్‌తో వస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణరెడ్డి, తాజా మాజీ కలెక్టర్ చిరంజీవులు, అంతకు ముందు పనిచేసిన ముక్తేశ్వరరావు, రిజ్వీ, పురుషోత్తంరెడ్డి... ఇలా వరుసగా ఐదుగురికి కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ జిల్లాలోనే ఇవ్వడం గమనార్హం.