‘భార్యే అలా చేస్తే ఆ బాధ చెప్పలేం..’
బెంగళూరు: ఫ్రాన్స్‌కు చెందిన రాయబారికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఐదేళ్ల పోరాటం తర్వాత తనపై నమోదైన ఆరోపణలు అవాస్తవాలు అని బెంగళూరు కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన ఊపరిపీల్చుకున్నాడు. సుదీర్ఘపోరాట ఫలితంగా తనకు న్యాయం జరిగిందంటూ ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ పాస్కల్ మజురియర్ అనే ఫ్రాన్స్ రాయబారిపై ఆయన భార్య స్వయంగా కేసు పెట్టింది. 2012లో ఆయనపై ఈ మేరకు ఆరోపణలు నమోదయ్యాయి. బెంగళూరులోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో పాస్కల్ డిప్యూటీ చీఫ్‌గా పనిచేసేవాడు.
అయితే నాలుగేళ్ల తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన భార్య స్వయంగా కేసు పెట్టింది. దీంతో ఆయనను పోలీసులు 2012లో జూన్ 19న అరెస్టు చేశారు. అనంతరం నాలుగు నెలలపాటు జైలులో ఉన్న పాస్కల్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం తన పిల్లలను కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తన తండ్రి మనవళ్లను, మనవాలిని చూసేందుకు వెళుతున్నా అవకాశం ఇవ్వడం లేదని తీవ్రంగా పోరాటం చేశారు. ఏ తప్పు చేయకపోయినా తన భార్య అనవసరం తనపై ఆరోపణలు చేసిందని, కావాలనే తనను నిందించిందంటూ వాపోయాడు.
తాను ఏ తప్పు చేయలేదంటూ పలుమార్లు మీడియా ముందు తన బాధను వ్యక్తం చేశాడు. ఈ కేసు విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయాలని మోదీకి విజ్ఞప్తి కూడా చేశారు. కోర్టు తీర్పు అనంతరం పాస్కల్ మీడియాతో మాట్లాడుతూ..‘ఇది నేను చేసిన సుదీర్ఘ పోరాటం. చివరికి న్యాయం జరిగినందున చాలా సంతోషంగా ఉంది. కట్టుకున్న భార్యే నిన్ను చులకన చేసి బయటేసిందని అర్థమైనప్పుడు అది ఎంత తీవ్రమైన గాయమో చెప్పలేం. కానీ, దేవుడు నాకు పోరాడేందుకు కావాల్సిన శక్తినిచ్చాడు. ఇలాంటి ఆరోపణల వచ్చినప్పుడు చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అసలు ప్రస్తుతం నా నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న నా భార్యే అసలైన నేరస్ధురాలు’ అని చెప్పారు.