మోడీ వద్దకు ఫ్రెంచ్ కాన్సులేట్ వ్యవహారం!
న్యూఢిల్లీ:కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రెంచ్ కాన్సులేట్ పాస్కల్ మజురియర్ వ్యవహారం కాస్తా ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు చేరింది. బెంగళూర్ లోని ఫ్రెంచ్ రాయబారి కార్యాలయంలో కాన్సులేట్ గా విధులు నిర్వర్తించిన మజురియర్ తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని సస్పండ్ చేసి.. అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే బెయిల్ పై వచ్చిన అతను గత రెండు రోజుల క్రితం నరేంద్ర మోడీకి సుదీర్ఘమైన లేఖ రాశారు. ' నాతో విడిగా ఉంటున్న నా భార్య తప్పుడు కేసులు బనాయించింది. ప్రస్తుతం నా ముగ్గురు పిల్లలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. మా పిల్లలు వారి యొక్క జాతీయ భాషను మరిచిపోతున్నారు. మా సంస్కృతి, కుటుంబ చరిత్ర కూడా వారికి చేరడం లేదు' అని తన లేఖలో పేర్కొన్నారు. 'నా పై విధించిన ఆంక్షలు నా కీర్తిని నాశనం చేయడమే కాదు, నా ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని' అని మోడీకి వివరించారు. తనకు తొందరగా న్యాయం జరగాలంటూ ఆ ప్రెంచ్ అధికారి స్పష్టం చేశారు.
గత 13 సంవత్సరాల నుంచి ఫ్రెంచ్ విదేశీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముజురియర్.. ఆ ముగ్గురు పిల్లలు తన రక్తం అని, వారిని తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ జనవరి నెలలో తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో భారతీయ పినల్ కోడ్ 376 ప్రకారం కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. అనంతరం అతను బెయిల్ విడుదలైయ్యాడు. భారతీయ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందంటున్న ఫ్రెంచ్ అధికారి.. తనతో పాటు కూతురికి కూడా న్యాయం జరగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.