గత జన్మలో వాడే నన్ను చంపాడు..
ఆడుతూ..పాడుతూ.. చలాకీగా తిరిగే మన హీరోని విలన్ అన్యాయంగా చంపేస్తాడు. దీంతో అతనిపై పగబట్టిన మన హీరో పునర్జన్మ ఎత్తి విలన్ని చంపేస్తాడు. ఇలా గత జన్మలను ఆధారంగా చేసుకుని వచ్చిన మగధీర, ఈగ లాంటి తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషల్లో అనేక చిత్రాలు మనం చూసే ఉంటాం. గత జన్మలో జరిగిన సంఘటనలు పునర్జన్మలో గుర్తుకు రావడం నిజంగా ఉన్నాయంటారా..? అయితే పక్కనున్న చిత్రంలోని మూడేళ్ల బాలుడికే గత జన్మ గుర్తుకువచ్చింది.. ఇతడే మన హీరో.
ఈ జన్మలో సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దులోని గోలన్ హైట్స్ అనే ప్రాంతంలో పుట్టాడు.ఈ బాలుడికి మాటలు రాగానే తన కుటుంబసభ్యులకు తన గత జన్మ గురించి చెప్పాడు. గత జన్మలో తనను ఓ వ్యక్తి గొడ్డలితో తలపై నరికి చంపేశాడని చెప్పడమే కాదు.. అప్పుడు గొడ్డలితో నరికిన చోట ఉన్న ఎర్రటి గుర్తులను కూడా వారికి చూపించాడు. అలాగే తాను గత జన్మలో నివసించిన గ్రామం, తన పేరు అన్ని విషయాలు వారికి తెలిపాడు. ఇక్కడే అసలు సమయం రానే వచ్చింది. అచ్చం సినిమాల్లో జరిగిన విధంగానే మన హీరోకి తనను నరికి చంపిన విలన్ ఎదురుపడ్డాడు. ఇంకేముంది వెంటనే వాడిని గుర్తుపట్టేశాడు మన హీరో. అలాగే వాడి పూర్తి పేరు చెప్పి.. ఇతడే తనను గత జన్మలో చంపేశాడని.. తన శరీరాన్ని చంపిన ప్రదేశాన్ని కూడా చూపించాడు.
బాలుడు చెప్పిన ప్రదేశంలో తవ్వి చూడగా.. అక్కడ బాలుడి అస్థి పంజరంతోపాటు చంపేందుకు ఉపయోగించిన గొడ్డలి లభించాయి. ఇంకేముంది విలన్ తానే బాలుడిని గత జన్మలో చంపేశానని ఒప్పుకున్నాడు. ఇదంతా జర్మన్ థెరపిస్ట్ ట్రూట్జ్ హార్డో ‘చిల్డ్రన్ హూ హావ్ లివడ్ బిఫోర్: రీఇంకర్నేషన్ టుడే’ అనే పుస్తకంలో రాశాడు. ఇతను ప్రస్తుత జన్మలో గత జన్మలు గుర్తుకు వచ్చిన అనేకమందిపై ఈ పుస్తకంలో రాయగా.. అందులో ఒకటే ఈ బాలుడికి సంబంధించిన కథ.