PATANCHERU constituency
-
సరుకులు కొనడానికి వెళ్లి..
పటాన్‌చెరుటౌన్: ఇంటి సరుకులు కొనుగోలు చేయడానికి బైక్‌పై వెళ్లిన ఇద్దరు యువకులను టిప్పర్ ఢీకొట్టడంతో మృతి చెందారు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకొంది. ఘటనకు సంబంధించి ఎస్సై రామానాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం దేవర్ల లంక గ్రామానికి చెందిన సతీష్ కుమార్(28) బతుకు దెరువు కోసం వచ్చి ఇస్నాపూర్ హనుమాన్ నగర్ కాలనీలో భార్యతో కలసి నివాసం ఉంటూ పాశంమైలారం పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఫిట్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సతీష్‌కుమార్, అతడి స్నేహితుడు ఖమ్మం జిల్లా నుంచి బతుకుదేరువు కోసం వచ్చిన ఇస్నాపూర్‌లో ఉంటున్న వేణు గోపాల్ రాజు(27)తో కలసి బైక్‌పై డిమార్ట్‌లో సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. సరుకులు కొనుగోలు చేసుకొని తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా ఇస్నాపూర్ ఎస్బీఐ వద్ద బైకును యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో పటాన్చెరు వైపు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న టిప్పర్ అతివేగంగా బైక్‌ను ఢీకొంది. అనంతరం టిప్పర్ వారి మీదగా వెళ్లింది. దీంతో తీవ్రగాయాలైన ఇద్దరిని స్థానికులు చికిత్స కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు సతీష్ కుమార్ భార్య హేమసాయి ప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భూదందాకు దన్ను
బొల్లారంలో రూ.26 కోట్ల భూ కుంభ కోణం సాక్షి ప్రతినిధి సంగారెడ్డి: బొల్లారం పారిశ్రామిక వాడలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల పేరిట జరిగిన భూ దందాలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంతో సంబంధమున్న కొంత మంది నేతలు రూ.26 కోట్లకు పైగా సొమ్ములు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల నుంచి నిరాటంకంగా కొనసాగుతున్న ఈ అవినీతి భూ భాగోతం... నారాయణరావు భూ కుంభకోణాన్ని గుర్తుకు తెస్తోంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే నేతలకు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితం పటాన్చెరు నియోజకవర్గంలో వందలు, వేల ఎకరాలు కబ్జా చేసి సుమారు 20 ఏళ్ల పాటు నారాయణరావు నడిపిన అవినీతి భూ భాగోతం మరోసారి పునరావృతమవుతోంది. అప్పట్లో ఆ కుంభకోణంపై సభా సంఘం నియమించిన సంఘటన మరువక ముందే కాసులు కురిపించే బొల్లారం పారిశ్రామిక వాడలో మరో భూ మాయాజాలం వెలుగులోకి వచ్చింది. జిన్నారం మండలం బొల్లారంలో పదేళ్ల క్రితం 284 సర్వే నంబర్లో సుమారు 35 ఎకరాల భూమిని నిరుపేదల ఇళ్లకోసం ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం 1,075 మంది లబ్ధిదారులను గుర్తించింది. అయితే కొంతమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు ఒక గ్రూప్‌గా ఏర్పడి భూ దందాకు తెరలేపారు. 308 మందిలబ్ధిదారులకు పట్టాలిచ్చి, మిగతావాటిని తమ వద్దనే పెట్టుకొని డిమాండ్ కనుగుణంగా రూ.1 లక్ష నుంచి 2 లక్షల వరకు అమ్ముకున్నారు. రిజిస్ట్రేషన్ల మాయజాలం... కోట్ల రూపాయల కుంభకోణం సర్వేనంబర్ 284లో ఉన్న 35 ఎకరాల భూమి ఉండగా, ఇందులో కాలనీ డెవలప్మెంట్, రోడ్లు, పార్కుల కోసం స్థలాన్ని తీసివేయగా ఒక్కో ఎకరానికి ఎంతలేదన్న 3 వేల గజాల భూమి మిగులుతుంది. ఈ లెక్కన 35 ఎకరాల్లో 1.05 వేల గజాల భూమిని ప్లాట్లుగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒక్కో వ్యక్తికి 60 గజాల భూమి ఇవ్వాలి. ఈ లెక్కన చూస్తే 1.05 వేల గజాల భూమిని 1,750 మంది లబ్ధిదారులకు ఇవ్వొచ్చు. పారిశ్రామిక వాడలో ఒక్కో ప్లాట్‌ను రూ.1 లక్ష నుండి 2 లక్షల వరకు డిమాండ్ పలుకుతోంది. దీంతో కొంతమంది నాయకులు ముఠాగా ఏర్పడి ప్లాట్లను కబ్జాచేసి అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో ప్లాట్‌కు సగటున రూ.1.50 లక్షల చొప్పున విక్రయించినా మొత్తం 1,750 ప్లాట్లకు రూ.26 కోట్లపై చిలుకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక్కో ప్లాట్‌ను రెండు, మూడుసార్లు రిజిస్ట్రేషన్ చేస్తూ ఇద్దరి ముగ్గురు పార్టీలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకసారి ఇంటి నిర్మాణంకోసం ఉచితంగా ఇచ్చిన భూమిని కనీసం పదేళ్ల వరకు అమ్ముకునే అవకాశం లేదు. కానీ ఇక్కడ మాత్రం అధికారులను ఆమ్యామ్యాలకు అలవాటుచేసిన నేతలు తమ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగించారనే ఆరోపణలున్నాయి. అక్రమ దందాకు అందరి అండదండలు ఈ అక్రమ దందాకు నాయకుల నుంచి మొదలు కొని అధికారుల వరకు అందరి అండదండలున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ అక్రమ భూ బాగోతంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నామమాత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి భూ దందాను అడ్డుకొని నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆకర్ష్‌తో బలపడుతున్న టీఆర్ఎస్
►అన్ని రాజకీయ పార్టీల్లో గుబులు ►పార్టీల ఉనికి ప్రశ్నార్థకమే..! ►నేడు ఎస్వీఆర్ గార్డెన్స్‌లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ►ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమక్షంలో మరికొన్ని చేరికలు ►నియోజకవర్గంలో మారుతున్న సమీకరణలు పటాన్చెరు : సిద్దిపేట టీఆర్ఎస్కు కంచుకోట లాంటిదంటాం. తాజా రాజకీయ పరిణామాలను చూస్తే పటాన్చెరు నియోజకవర్గం టీఆర్ఎస్ కంచుకోటగా మారనుంది. టీఆర్ఎస్ రోజురోజుకు బలోపేతమవుతోంది. టీఆర్ఎస్ ఆకర్ష్ పథకం కారణమో... మరేదోగానీ ఇక్కడ కాంగ్రెస్ కోటకు బీటలుపడ్డాయి. టీడీపీ ఏనాడో ఖాళీ అయ్యింది. బీజేపీ పరిస్థితి మెరుగుపడే పరిస్థితి కానరావడం లేదు. ప్రారంభం నుంచే పటాన్చెరులో తెలంగాణ ఉద్యమం గొప్పగానే సాగింది. అప్పట్లో టీఆర్ఎస్కు బలమైన క్యాడర్ లేదు. అన్ని రాజకీయ పార్టీల జిల్లా కమిటీ పెద్దలు పటాన్‌చెరులోనే ఉన్నారు. చాలా కాలంగా ఓటర్లు తెలంగాణ నినాదానికి మద్దతు ఇస్తున్నా... నేతలు మాత్రం ప్రజలను తమ వైపు ఆకర్షిస్తూ.. పార్టీల ఉనికికి ఇబ్బంది లేకుండానే చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు మండలాల్లో బలంగా ఉండేది. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి చేరడంతో పటాన్చెరులో టీఆర్ఎస్ పార్టీ బలోపేతమవుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి లేనివిధంగా వివిధ పార్టీల నేతలు ఆ పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి పటాన్చెరు మండలంలో ఉన్న పరిచయాలు, ఇతర కారణాలతో చాలా మంది రాజకీయాలకతీతంగా ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉంటూ ఎమ్మెల్యే వెంట తిరిగే కంటే టీఆర్ఎస్లో చేరడంలో తప్పు లేదన్న భావన నేతల్లో ఉంది. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరడం, అధికారంలో టీఆర్ఎస్ ఉండటం కారణంగా పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని ప్రధాన పార్టీల నుంచి నేతలు ‘క్యూ’కట్టి మరీ టీఆర్ఎస్లో చేరుతున్నారు. కాంగ్రెస్‌లో కొన్ని దశాబ్దాల కాలం పని చేసిన వారందరూ ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. రెండు రోజుల క్రితం పటాన్చెరు మండలం పరిధిలో 15 ఎంపీటీసీలు తమ పార్టీలకు రాజీనామా చేశారు. ఆదివారం పటాన్చెరు ఎస్వీఆర్ గార్డెన్స్‌లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారంతా టీఆర్ఎస్లో చేరనున్నారు. రామచంద్రాపురంలో కూడా.. టీఆర్ఎస్ ఆకర్ష్ పథకం రామచంద్రాపురంలో కూడా కొనసాగనుంది. భూపాల్‌రెడ్డి సూచన మేరకు కరడుగట్టిన కాంగ్రెస్‌వాదులు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. డీసీసీ కార్యదర్శులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌ను విడిచి పెట్టాలని యోచిస్తున్నారు. వారంతా ఈ నెల 26న టీఆర్ఎస్లో చేరడానికి ముహూర్తం పెట్టుకున్నారు. జిన్నారంలో కూడా బలమైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడాలని యోచిస్తున్నాయి. చంద్రారెడ్డి రాకతోనే టీడీపీ అక్కడ బలహీన పడింది. కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ బాల్రెడ్డికి ఉన్న కొన్ని ఇబ్బందుల కారణంగా ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశం లేకుండా పోయింది. ఆయన అనుచరవర్గం టీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపుతోందని సమాచారం.