బొల్లారంలో రూ.26 కోట్ల భూ కుంభ కోణం
సాక్షి ప్రతినిధి సంగారెడ్డి: బొల్లారం పారిశ్రామిక వాడలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల పేరిట జరిగిన భూ దందాలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంతో సంబంధమున్న కొంత మంది నేతలు రూ.26 కోట్లకు పైగా సొమ్ములు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల నుంచి నిరాటంకంగా కొనసాగుతున్న ఈ అవినీతి భూ భాగోతం... నారాయణరావు భూ కుంభకోణాన్ని గుర్తుకు తెస్తోంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే నేతలకు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మూడు దశాబ్దాల క్రితం పటాన్‌చెరు నియోజకవర్గంలో వందలు, వేల ఎకరాలు కబ్జా చేసి సుమారు 20 ఏళ్ల పాటు నారాయణరావు నడిపిన అవినీతి భూ భాగోతం మరోసారి పునరావృతమవుతోంది. అప్పట్లో ఆ కుంభకోణంపై సభా సంఘం నియమించిన సంఘటన మరువక ముందే కాసులు కురిపించే బొల్లారం పారిశ్రామిక వాడలో మరో భూ మాయాజాలం వెలుగులోకి వచ్చింది. జిన్నారం మండలం బొల్లారంలో పదేళ్ల క్రితం 284 సర్వే నంబర్‌లో సుమారు 35 ఎకరాల భూమిని నిరుపేదల ఇళ్లకోసం ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం 1,075 మంది లబ్ధిదారులను గుర్తించింది. అయితే కొంతమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు ఒక గ్రూప్‌గా ఏర్పడి భూ దందాకు తెరలేపారు. 308 మందిలబ్ధిదారులకు పట్టాలిచ్చి, మిగతావాటిని తమ వద్దనే పెట్టుకొని డిమాండ్ కనుగుణంగా రూ.1 లక్ష నుంచి 2 లక్షల వరకు అమ్ముకున్నారు.
రిజిస్ట్రేషన్ల మాయజాలం... కోట్ల రూపాయల కుంభకోణం
సర్వేనంబర్ 284లో ఉన్న 35 ఎకరాల భూమి ఉండగా, ఇందులో కాలనీ డెవలప్‌మెంట్, రోడ్లు, పార్కుల కోసం స్థలాన్ని తీసివేయగా ఒక్కో ఎకరానికి ఎంతలేదన్న 3 వేల గజాల భూమి మిగులుతుంది. ఈ లెక్కన 35 ఎకరాల్లో 1.05 వేల గజాల భూమిని ప్లాట్లుగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒక్కో వ్యక్తికి 60 గజాల భూమి ఇవ్వాలి. ఈ లెక్కన చూస్తే 1.05 వేల గజాల భూమిని 1,750 మంది లబ్ధిదారులకు ఇవ్వొచ్చు. పారిశ్రామిక వాడలో ఒక్కో ప్లాట్‌ను రూ.1 లక్ష నుండి 2 లక్షల వరకు డిమాండ్ పలుకుతోంది.
దీంతో కొంతమంది నాయకులు ముఠాగా ఏర్పడి ప్లాట్లను కబ్జాచేసి అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో ప్లాట్‌కు సగటున రూ.1.50 లక్షల చొప్పున విక్రయించినా మొత్తం 1,750 ప్లాట్లకు రూ.26 కోట్లపై చిలుకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక్కో ప్లాట్‌ను రెండు, మూడుసార్లు రిజిస్ట్రేషన్ చేస్తూ ఇద్దరి ముగ్గురు పార్టీలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకసారి ఇంటి నిర్మాణంకోసం ఉచితంగా ఇచ్చిన భూమిని కనీసం పదేళ్ల వరకు అమ్ముకునే అవకాశం లేదు. కానీ ఇక్కడ మాత్రం అధికారులను ఆమ్యామ్యాలకు అలవాటుచేసిన నేతలు తమ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగించారనే ఆరోపణలున్నాయి.
అక్రమ దందాకు అందరి అండదండలు
ఈ అక్రమ దందాకు నాయకుల నుంచి మొదలు కొని అధికారుల వరకు అందరి అండదండలున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ అక్రమ భూ బాగోతంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నామమాత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి భూ దందాను అడ్డుకొని నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
భూదందాకు దన్ను
Published Sat, Oct 18 2014 12:21 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement