ఆకర్ష్‌తో బలపడుతున్న టీఆర్‌ఎస్
►అన్ని రాజకీయ పార్టీల్లో గుబులు
►పార్టీల ఉనికి ప్రశ్నార్థకమే..!
►నేడు ఎస్‌వీఆర్ గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
►ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమక్షంలో మరికొన్ని చేరికలు
►నియోజకవర్గంలో మారుతున్న సమీకరణలు
పటాన్‌చెరు : సిద్దిపేట టీఆర్‌ఎస్‌కు కంచుకోట లాంటిదంటాం. తాజా రాజకీయ పరిణామాలను చూస్తే పటాన్‌చెరు నియోజకవర్గం టీఆర్‌ఎస్ కంచుకోటగా మారనుంది. టీఆర్‌ఎస్ రోజురోజుకు బలోపేతమవుతోంది. టీఆర్‌ఎస్ ఆకర్ష్ పథకం కారణమో... మరేదోగానీ ఇక్కడ కాంగ్రెస్ కోటకు బీటలుపడ్డాయి. టీడీపీ ఏనాడో ఖాళీ అయ్యింది. బీజేపీ పరిస్థితి మెరుగుపడే పరిస్థితి కానరావడం లేదు. ప్రారంభం నుంచే పటాన్‌చెరులో తెలంగాణ ఉద్యమం గొప్పగానే సాగింది. అప్పట్లో టీఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్ లేదు. అన్ని రాజకీయ పార్టీల జిల్లా కమిటీ పెద్దలు పటాన్‌చెరులోనే ఉన్నారు. చాలా కాలంగా ఓటర్లు తెలంగాణ నినాదానికి మద్దతు ఇస్తున్నా... నేతలు మాత్రం ప్రజలను తమ వైపు ఆకర్షిస్తూ.. పార్టీల ఉనికికి ఇబ్బంది లేకుండానే చూసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ మూడు మండలాల్లో బలంగా ఉండేది. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి చేరడంతో పటాన్‌చెరులో టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతమవుతోంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి లేనివిధంగా వివిధ పార్టీల నేతలు ఆ పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి పటాన్‌చెరు మండలంలో ఉన్న పరిచయాలు, ఇతర కారణాలతో చాలా మంది రాజకీయాలకతీతంగా ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉంటూ ఎమ్మెల్యే వెంట తిరిగే కంటే టీఆర్‌ఎస్‌లో చేరడంలో తప్పు లేదన్న భావన నేతల్లో ఉంది.
ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం, అధికారంలో టీఆర్‌ఎస్ ఉండటం కారణంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో అన్ని ప్రధాన పార్టీల నుంచి నేతలు ‘క్యూ’కట్టి మరీ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. కాంగ్రెస్‌లో కొన్ని దశాబ్దాల కాలం పని చేసిన వారందరూ ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. రెండు రోజుల క్రితం పటాన్‌చెరు మండలం పరిధిలో 15 ఎంపీటీసీలు తమ పార్టీలకు రాజీనామా చేశారు. ఆదివారం పటాన్‌చెరు ఎస్‌వీఆర్ గార్డెన్స్‌లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారంతా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
రామచంద్రాపురంలో కూడా..
టీఆర్‌ఎస్ ఆకర్ష్ పథకం రామచంద్రాపురంలో కూడా కొనసాగనుంది. భూపాల్‌రెడ్డి సూచన మేరకు కరడుగట్టిన కాంగ్రెస్‌వాదులు ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. డీసీసీ కార్యదర్శులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌ను విడిచి పెట్టాలని యోచిస్తున్నారు. వారంతా ఈ నెల 26న టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముహూర్తం పెట్టుకున్నారు. జిన్నారంలో కూడా బలమైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడాలని యోచిస్తున్నాయి. చంద్రారెడ్డి రాకతోనే టీడీపీ అక్కడ బలహీన పడింది. కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ బాల్‌రెడ్డికి ఉన్న కొన్ని ఇబ్బందుల కారణంగా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం లేకుండా పోయింది. ఆయన అనుచరవర్గం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతోందని సమాచారం.