అక్రమ వెంచర్లకు పెద్దల అండ
దళారులుగా సర్పంచ్‌లు!
పట్టించుకోని అధికారులు
పటాన్చెరు: మండలంలో అక్రమ వెంచర్ల దందా జోరుగా సాగుతోంది. పలువురు సర్పంచ్‌లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోండడంతో పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. వెంచర్లకు అనుమతులున్నాయని పాత తేదీల్లో దస్తావేజులు సృష్టిస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తోండడంతో అక్రమ వెంచర్ల జోరు పెరిగింది.
పటాన్చెరు మండలానికి రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో రియల్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. నందిగామ పరిధిలో వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఓ రెవెన్యూ అధికారికి రూ.14 లక్షలు ముట్టజెప్పి భూమి చదును చేసే పనులకు శ్రీకారం చుట్టారని సమాచారం. అనుమతులు లేకుండానే భూమి చదును చేసే పనులు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.
నందిగామ పరిధిలో అదే వెంచర్ నిర్వాహకులు గతంలో హెచ్ఎండీఏ అనుమతులున్నాయని బోర్డులు పెట్టి ప్రచారం చేశారు. తాజాగా ఆ బోర్డులను తొలగించి భూమిని చదును చేస్తున్నారు. రోడ్లు వేసేందుకు మట్టిని తవ్వి తెస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం ప్రైవేటు పట్టాదారు భూమిలో మట్టి తవ్వినా రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది.
ఈ నిబంధనలు రెవెన్యూ అధికారుల సొంత జేబు రాబడికి అనువుగా ఉందే తప్ప ప్రజలకు ఉపయోగపడటం లేదు. భవిష్యత్‌లో పర్యావరణానికి జరిగే నష్టంపై ఎవరూ ఆలోచించడం లేదు. పచ్చని చెట్లను నరికేస్తూ వెంచర్లు వేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఆ సంగతి పక్కన పెడితే ప్రజలను మోసం చేస్తూ కొత్తగా వస్తున్న వెంచర్లను ఆపాల్సిన సర్పంచ్‌లు దళారులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
పటాన్చెరు మండలంలో జరుగుతున్న అక్రమ వెంచర్లను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. అక్రమ వెంచర్లతో కొత్తగా వచ్చే ఆవాసాల్లో కనీస మౌలిక వసతులు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. పాటి, ముత్తంగి, ఇస్నాపూర్, భానూర్, నందిగామ గ్రామాల్లో లెక్కాపత్రం లేకుండా అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో అక్రమ వెంచర్లు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
ఇస్నాపూర్ సర్పంచ్ తీరుపై ఆ గ్రామ నాయకులు నేరుగా డీపీఓకు, ఇతర అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. హెచ్ఎండీఏ అనుమతి లేకుండానే నందిగామలో సాగుతున్న రియల్ డ్రామాలను అధికారులు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.