నవ్యక్రాంతి.. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి
సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాము. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాము. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాము కనుకే ప్రతి సంవత్సరం తిథులతో సంబంధం లేకుండా పుష్యమాసంలో జనవరి నెలలో 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ వస్తుంది. తెలుగువారి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాము. కనుమ మర్నాడు ముక్కనుమగా కూడా పండుగ చేస్తాము.
మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధి పరిచే ఎన్నో అంశాలతో కూడిన పండుగ సంక్రాంతి. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ ఇది.
సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్ళతో బంధుమిత్రులతో ఇల్లు, మనసు ఆనందంతో కళకళలాడుతుంది. కనుమ నాడు ఇంతటి పాడి పంట ఇంటికి రావటానికి కారణమైన గోవులను, వృషభాలను అలంకరించి, పూజించి, చక్కటి దాణా వేసి, ఆనందింప జేస్తారు.
ప్రతి సంక్రమణం పవిత్రమైనదే. ప్రతి సంక్రమణంలోనూ పితృ తర్పణాలివ్వాలి. విశేషంగా మకర సంక్రమణ కాలంలో మకర సంక్రమణ స్నానం చెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున తప్పక పితృ తర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తుతించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు గడలు, గుమ్మడి పండు మొదలైనవి దానమివ్వాలి. ఈ కాలంలో చేసే గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని చెప్తారు.
సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ధనుర్మాసమంతా ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇళ్ళ ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బెమ్మలు పెడతారు. సంక్రాంతినాడు ఇంటి ముందు కళ్ళాపి చల్లి, అందమైన పెద్ద రంగవల్లులను తీర్చిదిద్దుతారు. వాటిమీద గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మిడి పూలతో, బంతి పూలతో అలంకరించి, చుట్టూరా రేగుపళ్ళు, చెరుకు ముక్కలు వేసి, మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా, చుట్టూరా ఉన్న గొబ్బెమ్మలను ఆమె చెలికత్తెలుగా భావన చేసి, పసుపు కుంకుమలతో పూజించి, హారతిస్తారు.
సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. డోలు, సన్నాయి వాయిస్తూ ఉంటే, వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నర్తిస్తాయి. ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు‘, అంటుంటే గంగిరెద్దులు మోకాళ్ళ మీద కూర్చుని లేవటం, ‘డూడూ డూడూ బసవన్నా‘ అంటుంటే, తలలూపుతూ విన్యాసాలు చెయ్యటం కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ గంగిరెద్దును సాక్షాత్తుగా బసవన్నగా భావించి నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు డబ్బులిస్తారు, ధాన్యాన్నిస్తారు. వృషభం ధర్మ దేవతకు ప్రతీక.
ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయపాత్రను కదలకుండా పెట్టుకుని, రెండు చేతులతో చిరుతలు పట్టుకుని వాయిస్తూ, నుదుటిన తిరునామం పెట్టుకుని, కాళ్ళకు కంచు గజ్జెలు కట్టుకుని, అవి ఘల్లు ఘల్లుమంటుండగా ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ, చిందులు వేస్తూ వస్తాడు. అలాగే చిందులేస్తూ, హరినామం గానం చేస్తూ, తంబూరా మీటుతూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సంతోషంగా సాక్షాత్తుగా శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. వారిరువురికీ సంభావనలిచ్చి సత్కరిస్తారు.
‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి ఇంటింటి ముందుకు బుడబుక్కలవాళ్లు వస్తారు.
ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ‘హర హర మహాదేవ‘ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమ దేవర వస్తాడు.
వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిచ్చి సంభావిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీను.
సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ప్రార్ధిస్తారు. బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వులుండలు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ పందాలు, కొన్ని ప్రాంతాల్లో జల్లెకట్టు వంటివి ఆడి ఆనందిస్తారు.
పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేసి ఆనందిస్తారు.
సాధారణంగా అందరూ సంక్రాంతి పండుగకు ముందు రోజు అరిశలు, చక్కిలాలు, నువ్వులుండలు, పాలకాయలు, జంతికలు వంటివి చేస్తారు. పండుగ రోజున పరమాన్నం, బొబ్బట్లు, పులిహోర లాంటివి చేస్తారు. అన్నింటినీ దైవానికి నివేదించి, బంధువులకు, ఇంటి చుట్టుపక్కల వారికి, ఇంట్లో పనిచేసే వారికి పంచిపెడతారు.
మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను కనుమనాడు పూజిస్తారు. పుడమి తల్లిని పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది’ అంటారు కనుక కనుమ నాడు గారెలు, ఆవడలు తప్పకుండా భుజిస్తారు.
ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మన మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా అత్యధిక శాతం మంది జరుపుకునే గొప్ప పండుగ ‘నవ్య సంక్రాంతి పండుగ‘.
పెద్ద పండగ ఎలా అయింది?
సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి మారటం వలన ప్రకృతిలో కూడా ప్రతి నెల స్పష్టమైన మార్పును సంతరించుకుంటుంది. ఈ మార్పు మానవ జీవితంపైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగ గా జరుపుకుంటున్నాము అంటే, దానికి అనేక కారణాలున్నాయి. అప్పటి వరకు ఉన్న చలి మకర సంక్రమణంతో తగ్గుముఖం పడుతుంది. వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, సుందరమైన, ఆహ్లాదకరమైన వసంత కాల ఆగమనానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభ మవుతుంది. దక్షిణాయనంలో పగళ్ళు తక్కువ, రాత్రిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాయణంలో పగళ్ళు ఎక్కువ, రాత్రిళ్ళు తక్కువ ఉంటాయి.
ప్రకృతిలో ఇది గొప్ప మార్పు. ఆనందకరమైన, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలిగించే మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. దక్షిణాయనం సాధనా కాలం, ఉపాసనా కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యుని రథ గమనంలో మార్పు వల్ల ఎండ వేడిమి నెమ్మదిగా పెరగటం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం ప్రారంభమవగానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభ కార్యాలను జరిపిస్తాము. కనుకే ఉత్తరాయణం ప్రారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని ‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాము. పెద్దలకు తర్పణలు విడుచుకునే పర్వదినం ఇది.
వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ.
‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి.
‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే శ్రీ సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి.
– డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత సంస్కృత ఆచార్యులు