paternity
-
ఫేస్ బుక్ ఉద్యోగులకు శుభవార్త
ఫేస్ బుక్ ఉద్యోగులకు శుభవార్త. ఫేస్ బుక్ లో ఫుల్ టైం జాబ్ చేస్తున్న ఉద్యోగులు (పురుషులు) నాలుగు నెలల పాటు పెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అమెరికా మినహా ఇతర ప్రాంతాల్లో ఇంతకు ముందు నాలుగువారాలు మాత్రమే ఉన్న పితృత్వ సెలవు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ లో పనిచేస్తున్నవారందరికీ నాలుగు నెలల పాటు మంజూరు చేసింది. ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్.. సోషల్ నెట్ వర్క్ లో పనిచేస్తున్న తండ్రులంతా తమ శిశువులతో బంధాన్ని పెంచుకునేందుకు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచీ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. 'మా పేరెంటల్ లీవ్ పాలసీస్ కు అనుగుణంగా మేమీ నిర్ణయం తీసుకున్నాం' అని ఫేస్ బుక్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి లోరీ మెట్లాఫ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ సెలవులను పిల్లలు పుట్టిన తర్వాత లేదా దత్తత తీసుకున్న సంవత్సరం లోపు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఫేస్ బుక్ ఇప్పటికే శిశువుల పెంపకానికి సహాయంగా ఇరవై లక్షల రూపాయల వరకూ బోనస్ ను కూడా అందిస్తోంది. గత నెల్లో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్.. తన భార్య ప్రిసిల్లా మొదటి సంతానానికి జన్మనివ్వడంతో రెండు నెలల పెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులైతే... పిల్లలు పుట్టిన సమయంలో వారితో ఎక్కువ సమయం గడిపేలా చూడాలని అధ్యయనాలు కూడ చెబుతున్నాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ఉద్యోగులు వారికిచ్చే నాలుగు నెలల పెటర్నిటీ, లేదా మెటర్నిటీ సెలవును సంవత్సరం లోపు వారికి అవసరమైన విధంగా విడదీసి వాడుకునే వీలు కల్పిస్తోంది. -
గృహనిర్బంధంలో ఎన్డీ తివారీ?
కాంగ్రెస్ కురువృద్ధుడు నారాయణ దత్త తివారీ గృహనిర్బంధంలో ఉన్నారా? అవుననే అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత అలనాటి ప్రేయసి, కాంగ్రెస్ నేత ఉజ్వల శర్మ, ఆమె కుమారుడు రోహిత్ శేఖర్. వారు 88 ఏళ్ల నేతను కలిసేందుకు వెళ్తే అధికారులు వారిని ఆపేశారు. దాంతో ఆమె ఇనుప గేటు బద్దలు గొట్టి మరీ అనుచరులతో సహా లోపలికి వెళ్లారు. లక్నోలో శుక్రవారం ప్రజలకు ఈ వివాదం పెద్ద వినోదంగా మారింది. 'తివారీ అనారోగ్యంగా ఉన్నారు. ఆయనకు సహాయం అవసరం. కాబట్టి నేను లోపలికి వెళ్లాల్సిందే. అసలు ఇదంతా ఒక కుట్ర. ఆయనని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా ఉంది.' అని 70 ఏళ్ల ఉజ్వల వాదించారు. ఉజ్వలతో తివారీకి వివాహేతర సంబంధం ద్వారా రోహిత్ శేఖర్ జన్మించారు. అయితే చాలా కాలం తివారీ ఈ విషయాన్ని అంగీకరించలేదు. చివరికి కోర్టు బలవంతంగానైనా డీఎన్ ఏ పరీక్ష చేయించాలని ఆదేశించడంతో తివారీ రోహిత్ తన పుత్రుడేనని అంగీకరించారు. ఈ సంఘటన జరిగిన ఇరవై రోజుల తరువాత నుంచీ తనను తివారీని కలవనీయకుండా నిర్బంధాలు పెరుగుతున్నాయని ఉజ్వల ఆరోపిస్తున్నారు. 'నాకు తివారీ ఆస్తిపాస్తులు వద్దు. ఆయన జీవన సంధ్యా కాలంలో కాసింత సేవచేసుకునే అవకాశం కల్పించండి' అని ఆమె అన్నారు. అయితే తివారీ ఆదేశాల మేరకే తాము ఆమెను నిరోధించామని పోలీసులు చెబుతున్నారు.