ప్రత్తికోళ్లలంకలో మళ్లీ చిచ్చు
పెద్దలపై గ్రామస్తుల ఆగ్రహం
వివస్త్రలను చేసి కొడుతున్నారు
గ్రామ మహిళల ఆవేదన
రక్షిణ కల్పించాలని డిమాండ్
రూ.మూడు కోట్లు కాజేశారని విమర్శ
కోర్టు ఉత్తర్వులకు అడ్డుతగులుతున్నారంటూ గగ్గోలు
ఏలూరు (మెట్రో) : ప్రత్తికోళ్లలంకలో మళ్లీ చిచ్చు రాజుకుంది. నమ్మిన పెద్దలే తమను నట్టేట ముంచుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ లేకుండా పోయిందని, వివస్త్రలను చేసి కొడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్‌ను కలుద్దామని ఏలూరు వచ్చిన ప్రత్తికోళ్లలంక గ్రామస్తులు ఆయన అందుబాటులో లేకపోవడంతో జిల్లా పరిషత్ అతిథి గహం వద్ద విలేకరులతో మాట్లాడారు.
అసలు వివాదమేంటంటే..
ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంకలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న చేపల చెరువులు తమవంటే తమవని గ్రామస్తులు, కొందరు పెద్దలు ఐదేళ్లుగా ఘర్షణ పడుతున్నారు. దీనిని కొందరు పెద్దలుగా తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇటు గ్రామస్తులకు నమ్మకంగా ఉంటూనే, అటు పెద్దలకు సహకరిస్తున్నారు. మానుతున్న గాయాన్ని పెద్దది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. దీంతో అధికారులు, పోలీసులు గ్రామంలో అల్లర్లు జరగకుండా పోలీస్పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
కోర్టు తీర్పుతో పెద్దల్లో ఆగ్రహం
ఏడాదిగా ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. ఇటీవల గ్రామస్తులకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులివ్వడంతో రాజకీయాలు చేస్తున్న పెద్దల్లో ఆగ్రహం పెల్లుబికింది. వారు గ్రామస్తులపై విరుచుకుపడుతున్నారు. తమను కాదని న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు ఎందుకు తెచ్చారంటూ దాడులకు తెగబడుతున్నారు. దీంతో గ్రామస్తులు శుక్రవారం కలెక్టర్ కలిసేందుకు ఏలూరు వచ్చారు. ఆయన రాకపోవడంతో విలేకరులకు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
వివస్త్రలను చేసి కొడుతున్నారయ్యా..?
గ్రామంలో తమ మాట వినకుంటే ఆడవాళ్లని అని కూడా చూడకుండా తమను, తమ కుమార్తెలను వివస్త్రలను చేసి కొడుతున్నారంటూ పలువురు మహిళలు మీడియా ముందు కన్నీటిపర్యంత మవుయ్యారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ వేడుకున్నారు. దాచుకున్న సొమ్ముతోపాటు పుస్తెలు తాకట్టు పెట్టి తెచ్చిన రూ.మూడుకోట్లు గ్రామపెద్దలకు ఇచ్చామని ఆ సొమ్మును కోర్టు ఖర్చులకు వెచ్చించి, అనుకూలంగా ఉత్తర్వులు తెస్తామని వారు తమను నమ్మబలికారని, ఇప్పుడు ఆ డబ్బుపై ఎవరు నోరు మెదిపినా కొడుతున్నారని మహిళలు ఆవేదన చెందారు. పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని, తమ వద్ద పెద్దలు కాజేసిన సొమ్మును ఇప్పించాలని
వారు కోరారు.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే ఘర్షణే
గ్రామస్తులకు అనుకూలంగా తీర్పు రావడం వల్ల గ్రామంలో చేపల చెరువుల విషయంలో మరోమారు ఘర్షణ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఈనేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇప్పటికే పోలీసులను ఆశ్రయించేందుకు గ్రామస్తులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.