భారీగా పట్టుపురుగుల వ్యర్థాలు పట్టివేత
కైకలూరు : కృష్ణా జిల్లా కైకలూరు మండలం చెటాకాయి గ్రామంలో చేపల చెరువులో వేసేందుకు తెచ్చిన వ్యర్థాలను భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఘంటసాల వెంకటేశ్వరరావుకు 20 ఎకరాల చేపల చెరువు ఉంది. చేపలకు ఆహారంగా ఆయన కర్ణాటక నుంచి రూ.3.70 లక్షల విలువైన 20 టన్నుల చనిపోయిన పట్టుపురుగులను తెప్పించాడు. గ్రామ సమీపంలో బుధవారం ఆగి ఉన్న లారీని పోలీసులు తనిఖీ చేసి సీజ్ చేశారు. దీనిపై వారు రెవెన్యూ, అటవీ, ఫిషరీస్ విభాగాల అధికారులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి లారీ డ్రైవర్‌తో పాటు రైతుపై కేసులు నమోదు చేశారు. లారీలోని వ్యర్థాలను ధ్వంసం చేయనున్నట్లు రూరల్ ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. రైతు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. చేపలకు ఆహారంగా వ్యర్థాలను వాడటంపై నిషేధం ఉన్న విషయం తనకు తెలియదని చెప్పారు.