గెజిటెడ్ అధికారులకు ఒకే వేతన స్కేలు
సాక్షి, హైదరాబాద్: గెజిటెడ్ అధికారులందరికీ ఒకే విధమైన వేతన స్కేలు ఇవ్వాలని పీఆర్సీకి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) విజ్ఞప్తి చేసింది. కొన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రారంభ స్థాయి గెజిటెడ్ అధికారులకు నాన్ గెజిటెడ్ అధికారులతో సమానమైన వేతనాలు ఇస్తున్నారని, దీన్ని మార్చాలని కోరింది. సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో పీఆర్సీ చైర్మన్ పి.కె.అగర్వాల్ మంగళవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టీజీవో బృందం పీఆర్సీ చైర్మన్ ముందు పలు డిమాండ్లను వినిపించింది. గెజిటెడ్ అధికారుల కనీస మూల వేతనాన్ని రూ. 16,150 నుంచి రూ. 36,720కు పెంచాలని కోరారు. అలాగే, పదో పీఆర్సీని ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయాలని.. 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రతిపాదించారు.
వెంటనే 47 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వాలని కోరారు. ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ) పరిమితిని తొలగించి, జిల్లా కేంద్రాల్లో మూల వేతనంపై 25 శాతం, మిగతా ప్రాంతాల్లో 20 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. సీసీఏకు ప్రస్తుతం ఉన్న శ్లాబుల విధానాన్ని రద్దు చేసి మూలవేతనంపై 5 శాతం ఇవ్వాలని, యాంత్రిక పదోన్నతుల కాలాన్ని 6-12-18-24 నుంచి 5-10-15-20-25గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంలా 2 సంవత్సరాలపాటు పిల్లల సంరక్షణ సెలవు కోసం డిమాండ్ చేశారు. అంగవైకల్యం ఉన్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా పిల్లల సంరక్షణ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. మహిళల సమస్యల పరిష్కారానికి హెచ్వోడీల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు.