అన్నా, మేం కారెక్కుతాం.. మీరూ రండి
జోగిపేట, న్యూస్‌లైన్: ‘మన పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు.. మేం టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నాం.. మీరు కూడా వస్తే బాగుంటుంది.. వస్తే ఎమ్మెల్యే అయిపోవచ్చు’ అని అందోల్ నియోజకవర్గ తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి పి.బాబూమోహన్‌ను కోరుతున్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ముఖ్య నాయకులు ఆయనతో గత రెండు, మూడు రోజులుగా ఈ విషయమై చర్చిస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్లో చేరాలని లేకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని వారు బాబూమోహన్ ఎదుట తమ గోడు వినిపిస్తున్నారు.
‘ఒకానొక దశలో మీరు రాకపోయినా మేం వెళ్లిపోతాం’ అని కరాఖండిగా చెబుతున్నట్టు తెలుస్తోంది. అందోల్ మండల టీడీపీ అధ్యక్షుడు లింగాగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు సోమవారం తాలెల్మ గ్రామంలో సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న వారంతా టీఆర్ఎస్లో చేరాలని తీర్మానించారు. పుల్కల్ మండలంలోనూ ముఖ్య నాయకులు సోమవారం సమావేశమయ్యారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్దామని నిర్ణయించినట్టు సమాచారం. మాజీ మంత్రి పి.బాబూమోహన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నాయకుడు టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాలని భావించి ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి మండలాలకు చెందిన నాయకులు సైతం ఇదే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో బాబూమోహన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.