పచ్చ ‘సేన’
సాక్షి, అమరావతి: పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అరకొర సీట్లకూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎసరు పెట్టారు! పచ్చ ముఖాలకే జనసేన ముసుగు వేసి ఆ పార్టీకి కేటాయించే సీట్లలో పోటీకి దించే ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. వారంతా పైకి మాత్రం జనసేనలో కొనసాగుతూ తాను చెప్పినట్లు నడుచుకునేలా వ్యూహం సిద్ధం చేశారు. పథకం ప్రకారం ఒక్కో నేతను జనసేనలో చేర్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలు పెట్టారు.
బాబు ఆదేశాలతో బూరగడ్డ..!
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ గురువారం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. వేదవ్యాస్‌తోపాటు మరో టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్ కూడా పెడన టిక్కెట్ ఆశిస్తుండగా, పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాలంటూ జనసేన ఇప్పటికే ప్రతిపాదించడం గమనార్హం.
వేదవ్యాస్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన పవన్‌ను కలసినట్లు జనసేనలో చర్చ సాగుతోంది. టీడీపీకే చెందిన మాగంటి బాబు, జలీల్‌ఖాన్ తదితరులు కూడా పవన్ కళ్యాణ్‌తో సమావేశం కావడం వెనుక
చంద్రబాబు పాత్ర ఉన్నట్లు జనసైనికులు భావిస్తున్నారు.
ఎమ్మెల్సీ వంశీకృష్ణ చేరిక కూడా..
వైఎస్సార్సీపీ అసెంబ్లీ టికెట్ నిరాకరించడంతో ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇటీవల జనసేనలో చేరారు. ఆయన తొలుత చంద్రబాబును సంప్రదించారని, టీడీపీ అధినేత ఆదేశాల మేరకే జనసేనలో చేరారనే చర్చ సాగుతోంది. జనసేనకు కేటాయించే సీట్ల సంఖ్య ఇంకా ఖరారు కాకున్నా, అతి తక్కువగా కేటాయించడంతోపాటు అందులోనూ ఇన్నాళ్లూ జనసేనను నమ్ముకున్న నాయకులకు కాకుండా తన మనుషులను చంద్రబాబు ప్రవేశపెడుతున్నట్లు రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల అనంతరం తమ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు.
2014 పొత్తులే నిదర్శనం..
2014 ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు ఇదే ఎత్తుగడ అమలు చేసినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి తొలుత 15 అసెంబ్లీ సీట్లను కేటాయించి నామినేషన్ల సమయానికి 11కి పరిమితం చేశారు. తీరా అందులోనూ మూడు చోట్ల స్నేహపూర్వక పోటీ పేరుతో టీడీపీ అభ్యర్ధులను కూడా బరిలోకి దించినట్లు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ఆ ఎన్నికల ముందు కొత్తగా బీజేపీలో చేరిన చంద్రబాబు మనుషులకే టిక్కెట్లు దక్కాయని పేర్కొంటున్నారు.