బ్యాంకుల బాదుడు..మరో కొత్తరకం ఛార్జీలు
న్యూఢిల్లీ : బ్యాంకులు మరో కొత్తరకం ఛార్జీలకు తెరలేపబోతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా చేసే పీర్-టూ-పీర్ పేమెంట్లకు( మొబైల్ ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులు) ఛార్జీల మోత మోగించనున్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ జూలై 10 నుంచి వీటిని అమల్లోకి తేవడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి తమ కస్టమర్లకు ఈ-మెయిల్స్ కూడా పంపుతోంది.
యూపీఐ లావాదేవీలపై కొత్త ఫీజుల విధింపు, అలాగే ఫండ్స్ ట్రాన్సఫర్ చేసేటప్పుడు పొందే ప్రయోజనాలు వంటి వాటిపై సవిరంగా కస్టమర్లకు ఈ బ్యాంకు వివరిస్తోంది. హెచ్డీఎఫ్సీ మాత్రమే కాక ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా వచ్చే రెండు మూడు నెలల్లో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వేయనున్నట్టు సంకేతాలచ్చింది.
ఈ-మెయిల్ ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఈ లావాదేవీలపై వేసే ఛార్జీలు 25వేల రూపాయలకు మూడు రూపాయలు దాంతో పాటు పన్నులు ఉంటాయి. 25వేలకు పైనుంచి లక్ష మద్యలో మొత్తానికి ఐదు రూపాయల ఛార్జీ, ప్లస్ పన్నులు ఉంటాయని తెలిసింది. మొబైల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా రెండు బ్యాంకు అకౌంట్లు తక్షణమే ఫండ్స్ ట్రాన్సఫర్ చేసుకోవడానికి యూపీఐ పేమెంట్ సిస్టమ్ ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తీసుకొచ్చింది. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ట్రాన్సఫర్లకు దీన్ని వాడుతున్నారు. అయితే యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు వేయొద్దని ఎన్పీసీఐ బ్యాంకులను కోరుతోంది.
డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి, నగదు చెల్లింపులను తగ్గించడానికి ఈ ఛార్జీలు వేయకుండా ఉండాలని పేర్కొంటోంది. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు అనంతరం అవినీతి నిర్మూలనకు కేంద్రప్రభుత్వం నగదురహిత లావాదేవీలను ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. ఈ దశలో పీర్ టూ పీర్ యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు వేయకుండా ఉంటేనే మంచిదని ఎన్పీసీఐ అడుగుతోందని ఓ సీనియర్ బ్యాంకర్ చెప్పారు. యస్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకులు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వేసే ఉద్దేశ్యం లేదని తేల్చిచెప్పాయి.