మన సినిమాలకు కొత్త చూపు
చిత్రం: ‘పెళ్ళిచూపులు’,
నిర్మాతలు: రాజ్ కందుకూరి, యశ్ రంగినేని,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తరుణ్ భాస్కర్
జీవితం సినిమాలా ఉండదు. కానీ, సినిమా గనక జీవితంలా ఉండగలిగితే? కచ్చితంగా రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ నుంచి రిలీఫ్‌గా ఉంటుంది. ‘పెళ్ళి చూపులు’ అలాంటిదే! ఇంజనీరింగ్ పూర్తి చేయలేని ప్రశాంత్ (విజయ్ దేవరకొండ) వంటల్లో దిట్ట కావాలనుకుంటాడు. పెళ్ళయితే జీవితం కుదుటపడుతుందన్న జోస్యుడి మాటలతో, హీరోని పెళ్ళిచూపులకు తీసుకువెళతాడు తండ్రి (కేదార్ శంకర్). అక్కడ పెళ్ళిచూపుల్లో విచిత్ర పరిస్థితుల్లో చిత్ర (రీతూ వర్మ)ను కలుస్తాడు. ఎం.బి.ఏ చదివిన చిత్ర ఆస్ట్రేలియా వెళ్ళి, పై చదువులు చదవాలనుకుంటుంది.
అందుకు డబ్బు సంపాదించడానికి వీలుగా సంచార ఆహారశాలగా ‘ఫుడ్ ట్రక్’ను పెట్టడానికి సిద్ధపడుతుంది. ఆమె తండ్రి (గురురాజ్ మానేపల్లి) మాత్రం పెళ్ళి చేయాలనుకుంటూ ఉంటాడు. వచ్చిన సంబంధాల్ని హీరోయిన్ తిప్పికొడుతుంటుంది. ఆ టైమ్‌లో పొరపాటు అడ్రస్‌కు హీరో వెళ్ళడంతో, హీరో హీరోయిన్ల పెళ్ళిచూపుల వుతాయి. ‘ఫుడ్ ట్రక్’ ఐడియాకూ, ‘షెఫ్’ కావాలన్న హీరో కలకూ ముడి కుదురుతుందని హీరోయిన్, హీరోని అడుగుతుంది. మరి, ఫుడ్ ట్రక్ ఐడియా, హీరోయిన్ ఆస్ట్రేలియా కల ఏమయ్యాయన్నది మిగతా ఫిల్మ్.
ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌లో ఫస్టాఫ్ అంతా ఈ కాలపు కాలేజీ కుర్రాళ్ళ ప్రవర్తన, పిల్లల్ని స్థిరపడేలా చేయడంపై తల్లితండ్రుల ఆందోళనతో వినోదాత్మకంగా నడుస్తుంది. స్ట్రెయిట్ నేరేషన్లో సెకండాఫ్ అంతా సినిమాలో అసలు కథ, పాత్రల మధ్య సిసలైన అంతః సంఘర్షణ, కెరీర్ తొలి దశలో కుర్రకారుకుండే శంకలు, స్వతహాగా మంచివాళ్ళయినా స్నేహితుల మధ్య వచ్చే సగటు ఇగో సమస్యలు, ప్రేమను వ్యక్తీకరించడానికి అహం అడ్డొచ్చే సందర్భాలు - ఇలా మరింత బలమైన భావోద్వేగాలతో నడుస్తుంది. పాత్రల ప్రవర్తనలో, స్క్రిప్టులో ఎన్నో పొరలున్నట్లు, తెలివిగా అల్లుకున్నట్లు అర్థమవుతుంది. వీడియో కుకింగ్ పాఠాలు, వైరల్ వీడియో, వెర్రివేషాల ప్రాంక్ వీడియోల లాంటి నేటి ట్రెండ్స్ చాలా ఫిల్మ్‌లో ఉన్నాయి.
గతంలో ‘అనుకోకుండా’, ‘సైన్మా’ లాంటి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన యువకుడు తరుణ్ భాస్కర్‌కు ఇది తొలి సినిమా. దాదాపు పూర్తిగా స్థానిక హైదరాబాద్ టాలెంట్ నటించిన చిత్రమిది. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, హీరో ఫ్రెండ్స్‌గా తెలంగాణ మాండలికంలో మాట్లాడే ప్రియదర్శి, అభయ్ - ఇలా ప్రతి ఒక్కరూ చాలా సహజమైన పాత్రలుగా అనిపిస్తారే తప్ప, నటించారన్న ఫీలింగ్ రాదు.
యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్కీ ఇదే తొలి చిత్రం. పరిమిత బడ్జెట్లో తీసినప్పటికీ తెరపై సినిమా రిచ్‌గా కనిపించడం (కెమేరా నాగేశ్), అనుభూతి పెంచే నేపథ్య సంగీతం, గానం ఈ సినిమాకున్న పెద్ద బలం. మనసుకు పట్టే సీన్లూ చాలా ఉన్నాయి. సినిమాలో చాలా పాత్రలు నిత్యం మనకు తారసపడేవే! అందుకే, తెరపై మనల్ని మనం చూసుకుంటాం. సహజమైన డైలాగులు, జోక్‌లు నవ్విస్తాయి. ఒక్కముక్కలో నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ ట్రెండ్‌కి కొనసాగింపు... తెలుగు సిన్మా ఆలస్యంగానైనా అసలంటూ మారుతోందనడానికి నిదర్శనం... సకుటుంబ సత్కాలక్షేపం - ఈ ‘పెళ్ళిచూపులు’.
- రెంటాల జయదేవ