తమిళులకూ పెళ్లి చూపులు
ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చూపులు మన తెలుగు సినిమా ‘పెళ్లి చూపులు’పై పడ్డాయి. కొత్త దర్శకుడు తరుణ్‌భాస్కర్ రాసిన కథ, తీసిన విధానం ఆయనకు బాగా నచ్చడంతో తమిళ ప్రేక్షకులకూ ‘పెళ్లి చూపులు’ చూపించాలని డిసైడ్ అయ్యారు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారాయన. ‘‘గౌతమ్ మీనన్ మా సినిమా చూసి ప్రశంసించడంతో పాటు తమిళంలో రీమేక్ చేస్తానని రైట్స్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. తమిళ రీమేక్‌కు ఆయన దర్శకత్వం వహించడం లేదు.
దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించి, నిర్మాతగా వ్యవహరించనున్నారు’’ అని ‘పెళ్లి చూపులు’ నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరి ‘సాక్షి’తో చెప్పారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.