మా బ్యానర్‌లో తరుణ్ ఓ చిత్రం చేయాలి!
‘‘ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత బావుంటుందో తెలుస్తోంది. యంగ్ టీం అంతా కష్టపడి మంచి సినిమా తీశారు. తప్పకుండా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. పాటలు వింటుంటే వివేక్ సాగర్ ఈ చిత్రం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టాడో తెలుస్తోంది. నాగేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. డెరైక్టర్ తరుణ్ భాస్కర్ మా బ్యానర్‌లో ఓ చిత్రం చేయాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యస్. రాగినేని నిర్మించిన చిత్రం ‘పెళ్లిచూపులు’. వివేక్ సాగర్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సురేశ్‌బాబు విడుదల చేసి దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. ట్రైలర్‌ను హీరో సందీప్ కిషన్, దర్శకుడు క్రాంతిమాధవ్ విడుదల చేశారు. చిత్రదర్శకుడు మాట్లాడుతూ- ‘‘రియల్ లైఫ్ స్టోరీతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టై నర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నా తల్లితండ్రుల్లా ఈ చిత్ర నిర్మాతలు సపోర్ట్ చేశా రు. మాకు బాగా సహకరించిన సురేశ్‌బాబుగారికి కృతజ్ఞతలు’’ అన్నారు.
‘‘నేనీ చిత్రం చేయడానికి కారణం సురేశ్‌బాబుగారు. తరుణ్ భాస్కర్‌ను ఆయన నా వద్దకు పంపి స్టోరీ వినమన్నారు. భవిష్యత్‌లో నేను నిర్మించే చిత్రాల్లో ‘పెళ్లి చూపులు’ గర్వపడే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరి చెప్పారు. నిర్మాతలు యస్. రాగినేని, అశోక్‌కుమార్, కేఎల్ దామోదర ప్రసాద్, దర్శకులు అల్లాణి శ్రీధర్, దశరథ్, హీరోయిన్ లావణ్యాత్రిపాఠి, సంగీత దర్శకులు వివేక్ సాగర్, రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.