అనుమతులు ఆలస్యం చేస్తే.. జీతంలో కోత
నిర్ణీత సమయంలో పరిశ్రమలకు అనుమతులివ్వాల్సిందే
‘రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్’ విధానం పేరుతో అమలు
హైదరాబాద్: వివిధ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు నిర్ణీత సమయంలోగా అనుమతులు మంజూరు చేయకపోతే.. ఇకపై అధికారుల నుంచి అపరాధ రుసుము వసూలు చేయనున్నారు. వారి జీతాల్లోంచి ఈ సొమ్ముకు కోత వేసి.. ఆ పరిశ్రమలకే అందజేయనున్నారు. ఇలాంటి పలు సరికొత్త అంశాలకు తమ పారిశ్రామిక విధానంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే మెగా పరిశ్రమలకు కంపెనీ వద్దకే వెళ్లి అన్ని అనుమతులు ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం... ఇప్పుడు ‘రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్’ పేరుతో కొత్త విధానాన్ని అమలు చేయనుంది.
దీని ప్రకారం.. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను పొందడం ఇకపై పారిశ్రామికవేత్తల హక్కు కానుంది. ఈ హక్కు దక్కకపోతే పైస్థాయిలో అప్పీలు చేసుకునే వెసులుబాటుతో పాటు, నిర్ణీత సమయంలోగా అనుమతులు ఇవ్వని అధికారులపై అపరాధ రుసుం విధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ మొత్తాన్ని సదరు అధికారి జీతం నుంచి వసూలు చేసి.. సదరు పరిశ్రమలకు అందజేయనున్నారు. ఈ ‘రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్’ విధానాన్ని త్వరలో ప్రకటించబోయే నూతన పారిశ్రామిక విధానంలో చేర్చనున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.