మళ్లీ పాత బాబును చూస్తారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో అధికారులంతా పాతరోజులు మర్చిపోయి కొత్త రోజుల్లోకి రావాలని.. చెప్పినట్లు నడుచుకోకపోతే మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఇది సీబీఎన్ 4.0 అని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందించారు. లబ్ధిదారుడు బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి మొదటగా పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. నాయక్ కుమార్తె ఇస్లావతి బాయికి వితంతు పెన్షన్, పాములు నాయక్‌కు వృద్ధాప్య పెన్షన్, భార్య సీతాబాయికి రాజధాని పరిధిలో భూమిలేని వారికి ఇచ్చే వ్యవసాయ కూలీ పెన్షన్‌ను అందించారు. అనంతరం నాయక్ కుటుంబ సభ్యులతో ఆయన ముచ్చటించారు. తనకు ఇల్లులేదని సీఎంతో నాయక్ చెప్పగా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపి.. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం.. నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఏమన్నారంటే.. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఐదేళ్లు వారు అణచివేతకు గురయ్యారు. ఇప్పుడు నాకు సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. ప్రజలకు మాపై చాలా ఆశలున్నాయి. కానీ, అవన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవు. రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో అర్థంకావడంలేదు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు.గత ఐదేళ్లలో ఇలా సంతోషంగా కూర్చూని మాట్లాడుకుంది ఒక్కరోజు కూడా లేదు. పోలీసులు ఎప్పుడు గోడ దూకి వస్తారో తెలీని పరిస్థితి. భయంకర వాతావరణంలో ప్రజలు, నాయకులు బతికారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ పెన్షన్ ఇవ్వాలని మేం పోరాడినా వినలేదు. అందుకే ఇప్పుడు 1.20 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పెన్షన్లు అందిస్తున్నాం. నెలనెలా పెన్షన్లకు అదనంగా రూ.819 కోట్లు రాష్ట్రంలో 28 వర్గాలకు చెందిన 65.31 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. ఇందుకు గతంలో నెలకు రూ.1,938 కోట్లు ఖర్చుచేస్తే ఇప్పుడు దానికి అదనంగా రూ.819 కోట్లు ఖర్చుపెడుతున్నాం. ఇకపై ఏడాదికి రూ.33,100 కోట్లు పెన్షన్లకు ఖర్చుచేయబోతున్నాం. రాబోయే ఐదేళ్లలో రూ.1,65,500 కోట్లు వెచి్చస్తాం. ఈ నెలలో రూ.4,408 కోట్లు ఖర్చు చేశాం. ఎన్నికల సమయంలో ఇచి్చన హామీ మేరకు ఒకేరోజు ఐదు హామీలపై సంతకాలు చేశాను. ఇక రాజధాని తరలిపోతుందని గతంలో ఇక్కడివారు బాధపడితే.. రాజధాని వస్తుందేమోనని విశాఖ వాసులు భయపడ్డారు.పోలవరంలో వాటికి మళ్లీ రూ.990 కోట్లు ఖర్చు ఇక పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రం వాల్‌ను నాడు జర్మన్ కంపెనీ టెక్నాలజీతో రెండు సీజన్లలోనే నిరి్మంచాం. కానీ, గత ప్రభుత్వం రెండేళ్లపాటు పట్టించుకోకపోవడంతో వరదలవల్ల డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. మళ్లీ ఇప్పుడు నిర్మించాలంటే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గోదావరిలో పోలవరాన్ని ముంచి మళ్లీ ఇప్పుడు అడ్డగోలు వాదనలకు దిగుతున్నారు. ఇక రాజధాని నిమిత్తం అమరావతి రైతులు భూములిచ్చారు. దానికి ప్రతిఫలంగా కేవలం కౌలు మాత్రమే ఇచ్చాం. అయినా అక్రమాలు జరిగాయని కేసులు పెట్టారు. రోడ్లు వేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బందులుంటే మాతో చెప్పండి. కోర్టులకెళ్తే పనులు ఆలస్యమవుతాయి. అలాగే, నేను వెళ్లేదారుల్లో పరదాలు కట్టినట్లు కనబడితే సస్పెండ్ చేస్తా.