పెనమలూరుపై నందమూరి కన్ను?
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఇప్పుడు హాట్ సీటుగా మారింది. ఇప్పటికే చాలామంది నాయకులు అక్కడినుంచి పోటీ చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు మరో వ్యక్తి ఆ జాబితాలో చేరాడు. అయితే.. ఈసారి వచ్చింది అలాంటి, ఇలాంటి మనిషి కాదు. సాక్షాత్తు నందమూరి ట్యాగ్ ఉన్నవాడు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని గానీ, కనీసం నియోజకవర్గ ఇన్ ఛార్జిని గానీ ప్రకటించకపోవడం చూస్తుంటే, ఈ సీటును తస్మదీయులకే కట్టబెట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నరన్న అనుమానాలు స్థానిక నాయకుల్లో తలెత్తుతున్నాయి.
నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ పెనమలూరు అసెంబ్లీ స్థానం మీద కన్నేసినట్లు తెలుస్తోంది. వల్లభనేని నాగభూషణరావు అనే పారిశ్రామికవేత్త, టీడీపీనేత ఇటీవల ఉయ్యూరులో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి నందమూరి జానకిరామ్ హాజరయ్యారు. ఆయనను ఇక్కడినుంచి బరిలోకి దింపాలని టీడీపీలోని ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే జానకి మాత్రం కార్యాలయాన్ని సందర్శించి, ఏమీ మాట్లాడకుండా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో ఈ సీటు ఎవరికి వెళ్తుందోనని ఈ ప్రాంత నాయకులు గుండెలు అరచేతిలో పట్టుకుని చూస్తున్నారు.