చేతుల్లేని పాప.. చేతిరాత పోటీలో విజేత
వాషింగ్ టన్: పుట్టుకతో వచ్చిన అంగవైకల్యాన్ని తన అరుదైన ప్రతిభతో జయించిందో పాప. చేతుల్లో లోపంతో వెక్కిరించిన విధిని తన అందమైన చేతిరాతతో తోసి రాజంది. అవును.. వర్జీనియాకు చెందిన బాలిక అనయ ఎల్లిక్ (7) జాతీయ చేతిరాత పోటీలో విజేతగా నిలిచింది. ఎక్సలెన్స్ పెన్ మాన్ షిప్ పోటీల్లో భాగంగా అద్భుతమైన నైపుణ్యం కలిగిన చేతిరాతతో 2016 నికోలస్ మాగ్జిమ్ స్పెషల్ అవార్డును గెల్చుకుంది. తద్వారా తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే అనయ ఎల్లిక్ కు మణికట్టు దగ్గరినుంచి కిందికి చేతుల్లేకుండా పోయాయి. పుట్టుకతోనే వచ్చిన ఈ లోపంతో అనయ ఏనాడూ చింతించలేదు. తనదైన ప్రతిభతో రాణించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరిగిన నేషనల్ పెన్ మాన్ షిప్ అవార్డును గెల్చుకుంది. అయితే రాయడానికి ఆ పాప ఎలాంటి ప్రోస్తటిక్స్ (కృత్రిమ అవయవాలు) వాడదు. రెండు భుజాల మధ్య పెన్ పెట్టుకుని, లేచి నిలబడి రాస్తుందట. అదీ అందంగా...
అభిజ్ఞా జాప్యాలు, మేధో, భౌతిక అభివృధ్ధికి సంబంధించిన వైకల్యం ఉన్న విద్యార్థుల పార్టిసిపేషన్ను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
అనయ సాధించిన ఘనతకు గాను క్రిస్టయన్ అకాడమీకి చెందిన ఆమె ప్రిన్సిపల్ ట్రాక్సీ కాక్స్ అభినందనలు తెలిపారు. అనయ గుర్తించదగిన గొప్ప బాలిక అనీ, తాను చేయాలనుకున్నది సాధించి తీరుతుందని కొనియాడారు.అటు అనయ తల్లి బియాంకా తన కుమార్తె ప్రతిభ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అందరూ తన చిన్నారి టాలెంట్ పట్ల ముగ్ధులవడం తనకు ఆనందాన్ని స్తుందన్నారు.
కాగా 2012 లో చేతుల్లేకుండా జన్మించిన పిట్స్ బర్గ్ కు చెందిన అన్నే క్లార్క్ మొట్టమొదటిసారిగా ఈ అవార్డును గెల్చుకుంది.