అబద్ధం చెప్పను
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పథకం ప్రారంభానికి పాలమూరు జిల్లాను ఎంపిక చేశా. ప్రతిష్టాత్మక పథకాన్ని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రారంభం కావడం సంతోషంగా ఉంది’ అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కొత్తూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో సామాజిక భద్రతా పింఛన్ల పథకం ‘ఆసరా’ను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘పాలమూరు ఎత్తిపోతల పథకం తెల్లారే సరికి కావాలే. జల్ది నీళ్లు రావాలే అని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కోరిండు. తెల్లారే సరికే అంత సులభంగా రాదు. ప్రజలకు అబద్దాలు చెప్పే అక్కర మనకు లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వే రిపోర్టును వారం రోజుల్లో ఇస్తాం’ అని చెప్పారు. ‘రాబోయే పది, పదిహేను రోజుల్లో నేను వచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్తాపన చేస్తా. ఈ పథకం మహబూబ్‌నగర్ జిల్లాకే కాకుండా రంగారెడ్డితో పాటు హైదరాబాద్ నగరానికి కాలువల ద్వారా నీళ్లు ఇస్తుంది.
ఈ పథకాన్ని ప్రతిష్టాత్మక పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది’ అని స్పష్టం చేశారు. ‘మహబూబ్‌నగర్ చాలా వెనుకబడిన జిల్లా. ఎంపీగా, ఉద్యమ నేతగా జిల్లాలో మూల మూలలూ తిరిగా. ఆర్డీఎస్ వరకు పాదయాత్ర చేశా. గత ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదు. జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్‌తో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరలో చేపట్టబోతున్నాం. వీటితో పాటు జిల్లాలో ఉన్న 7480 చెరువుల్లో పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొదటి విడత కింద సంవత్సరం 1496 చెరువులను మరమ్మతు చేస్తామని’ సీఎం ప్రకటించారు.
గ్రామీణ రోడ్లకు ప్రాధాన్యత
‘గ్రామాల ఆర్దిక పరిస్థితి మెరుగు పరిచేందుకు గ్రామీణ రోడ్లు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపడుతున్నాం. జిల్లాలో ఆర్అండ్బీ కింద 3110 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ పరిధిలో 10,381 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. పంచాయతీరాజ్ పరిధిలో ఐదు వేలు, ఆర్అండ్బీ కింద 1800 కిలోమీటర్ల మేర రోడ్లను గుంతలు లేకుండా అద్దంలా తయారు చేస్తాం.
వందల కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను బీటీ రోడ్లుగా మార్చుతాం’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. కొత్తూరు ప్రాంతంలో స్థానిక యువతకు ఉపాధి కావాలని జిల్లా ప్రజా ప్రతినిధులు కోరారు. అందుకే త్వరలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలకు భూములు, నీళ్లు, కరెంటు ఇచ్చేది మనం కాబట్టి అర్హత ఉన్న వారికి లోకల్ కోటా ఫిక్స్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలనే కండీషన్ పెడతాం.
త్వరలో ఆ ఫలితాలు మీకు అందుబాటులోకి వస్తాయని’ సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్, వైస్ ఛైర్మన్ నవీన్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, బాలరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నేతలు ఎల్లారెడ్డి, శివకుమార్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.