పెనుమళ్లలో యువకుడి హత్య
పెనుమళ్ల(కాజులూరు) : కాజులూరు మండలం పెనుమళ్లలో బుధవారం రా త్రి జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు కథనం ప్రకారం. గ్రామానికి చెందిన పంతగడ విజయ్‌కుమార్(26) యానాం రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. అప్పటికే స్థల వివాదంపై అతని తల్లి నాగరత్నం, ఎదురింటిలో ఉండే గీత కార్మికుడు పోతు వీరాస్వామి మధ్య వివాదం జరుగుతోంది. విజయ్‌కుమార్ కలుగజేసుకుని ఇద్దరినీ మందలించాడు.
దీంతో మనస్థాపం చెందిన వీరాస్వామి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటి అరుగుపై భార్యాపిల్లలతో కలిసి నిద్రిస్తున్న విజయ్‌కుమార్‌పై పైశాచికంగా దాడిచేసి కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. వెంటనే విజయ్‌కుమార్ భార్య కుమారి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతనిని రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పటంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో విజయ్‌కుమార్ ప్రాణాలొదిలాడు.
గొల్లపాలెం ఎస్సై సిహెచ్.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కాకినాడ రూరల్ సీఐ పి.పవన్ కిషోర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. దాడి అనంతరం నిందితుడు పోతు వీరాస్వామి భార్యతో కలిసి గ్రామం నుంచి పరారయ్యాడని, త్వరలో అతనిని అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు. మృతుడు విజయ్‌కుమార్‌కు ఆరేళ్ల క్రితం వివాహం కాగా భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. గ్రామ ప్రజలందరితో ఎంతో సఖ్యతతో ఉంటూ వివాదరహితుడిగా మంచి పేరున్న విజయ్‌కుమార్ ఇలా మృతిచెందడం స్థానికులను కలచివేసింది.