People concerns
-
అమెరికాలో జనగణనపై జగడం
వాషింగ్టన్: అమెరికాలో 2020లో చేపట్టనున్న తదుపరి జనాభా లెక్కలపై అప్పుడే వివాదం రేగింది. జనాభా లెక్కల సందర్భంగా అధికారులు.. పౌరసత్వానికి సంబంధించి ప్రశ్నించవచ్చని వస్తున్న వార్తలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ ప్రశ్న వల్ల మైనారిటీలు సెన్సస్‌లో పాలుపంచుకోకపోవచ్చని, దీని వల్ల జనాభా గణాంకాల ప్రామాణికత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన తాజా సర్వేల్లో పాల్గొన్న ప్రజలు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు వ్యక్తమైందని ఎన్ఏఎల్ఈఓ ఎడ్యుకేషనల్ ఫండ్ హెడ్ ఆర్టురో వర్గాస్ పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని చేపట్టిన తర్వాత వలసలను, విదేశీయులను.. ఉగ్రవాదం, నేరాలు, ఉద్యోగాలు కోల్పోవడానికి సంబంధం కల్పిస్తూ యాంటీ ఇమిగ్రేషన్ ఎజెండాను చేపట్టారు. గత నెలలో ట్రంప్ స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో కూడా లీగల్ ఇమిగ్రేషన్‌ను తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వలసదారులను, వారి కుటుంబాల నుంచి వేరు చేసి స్వదేశం పంపేస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో సెన్సస్ సమాచారాన్ని తమకు వ్యతిరేకంగా అధికారులు వినియోగించే అవకాశం ఉందనే ఆందోళనతో జనాభాలో ఎక్కువ శాతం మంది జన గణనలో పాల్గొనేందుకు అసక్తి చూపకపోవచ్చని నిçపుణులు పేర్కొం టున్నారు. డిసెంబర్లో జాతీయతకు సంబంధించిన ప్రశ్నను కూడా సర్వేలో చేర్చాలని న్యాయ శాఖ సెన్సస్ బ్యూరోకు సూచించడం వివాదం రేపింది. అయితే ఓటింగ్ హక్కుల చట్టాన్ని పరిరక్షించేందుకు పౌరుల సమాచారం ఉపయోగపడుతుందని న్యాయ శాఖ వాదించింది. కాగా, ప్రశ్నావళిపై తాము కసరత్తు చేస్తున్నామని, ప్రశ్నావళి తుది జాబితాను మార్చి 31 నాటికి కాంగ్రెస్‌కు సమర్పిస్తామని సెన్సస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అల్ ఫాంటెనాట్ స్పష్టం చేశారు. 32.7 కోట్లకు..! అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ప్రతినిధుల సభలో ప్రతి రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది సెన్సస్ లెక్కలపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే స్కూళ్లు, ఆస్పత్రులు, ప్రజాసేవకు సంబంధించి నిధుల పంపకానికి కూడా జనాభా లెక్కలే కీలకం. సెన్సస్‌కు కొన్ని వర్గాలు దూరంగా ఉండటం పాత సమస్యే. 2010 జనాభా లెక్కల్లో లాటినోస్ సంఖ్యను 7,75,000 తక్కువగా లెక్కించినట్టు అంచనా. అయితే ఈసారి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 2010 గణనలో 30.88 కోట్ల అమెరికన్లు ఉన్నట్టు తేలగా, ప్రస్తుతం ఈ సంఖ్య 5.8% పెరుగుదలతో 32.7 కోట్లకు చేరుతుందని అంచనా. -
టెన్షన్...టెన్షన్
- భయం గుప్పెట్లో మారేడుపల్లి - దాడులపై తీవ్రంగా స్పందించిన పోలీసులు - నిందితుల వివరాలు సేకరణ - హడలిపోతున్న స్థానికులు మారేడుపల్లి: నిన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ సికింద్రాబాద్ మారేడుపల్లిలోని దృశ్యం. బన్నప్ప అనే యువకుడి మృతి... పోలీస్ స్టేషన్లో బస్తీవాసుల విధ్వంసంతోస్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ఆ ప్రాంతం నిండిపోయింది. వచ్చే ఆదివారం బోనాలకు మారేడుపల్లి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇటు పోలీసులనూ...అటు స్థానికులనూ కలవరానికి గురి చేస్తోంది. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో ధ్వంసం కావడాన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు, కంట్రోల్ బాక్స్‌లను ధ్వంసం చేసినప్పటికీ ఒక సీసీ కెమెరా పుటేజ్‌లు పోలీసుల చేతికి చిక్కాయి. దాడులకు పాల్పడిన సమయంలో స్టేషన్లో ఎస్ఐలు రవికుమార్, మధుతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. పెద్ద సంఖ్యలో జనం దూసుకు రావడంతో వారు నిస్సహాయంగా నిలవాల్సి వచ్చింది. సిబ్బంది తమను తాము రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. దాడికి పాల్పడిన వారి వివరాలను ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. బన్నప్ప అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు ఆచితూచి వ్యవహరించారు. వివరాల సేకరణ... పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తుండడంతో మహాత్మాగాంధీ నగర్ వాసులు హడలిపోతున్నారు. ఇంటి వద్ద ఉండకుండా ఇతర ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఏ క్షణాన పోలీసులు తమ ఇళ్లపైకి వస్తారోననే భయంతో కొన్ని కుటుంబాల వారు భయం భయంగా గడుపుతున్నారు. మంత్రి పద్మారావుతో చర్చలు జరిపిన బస్తీవాసులు బన్నప్ప కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు తమపై కేసులు లేకుండా చూడాలని కోరారు. ఈ విషయంపై మంత్రి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బస్తీవాసుల్లో మరింత టెన్షన్ నెలకొంది. ఈ దాడిలో స్థానికులతో పాటు కొందరు పాత నేరస్థుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసుల మోహరింపుతో మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.