టెన్షన్...టెన్షన్
- భయం గుప్పెట్లో మారేడుపల్లి
- దాడులపై తీవ్రంగా స్పందించిన పోలీసులు
- నిందితుల వివరాలు సేకరణ
- హడలిపోతున్న స్థానికులు
మారేడుపల్లి: నిన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ సికింద్రాబాద్ మారేడుపల్లిలోని దృశ్యం. బన్నప్ప అనే యువకుడి మృతి... పోలీస్ స్టేషన్‌లో బస్తీవాసుల విధ్వంసంతోస్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ఆ ప్రాంతం నిండిపోయింది.
వచ్చే ఆదివారం బోనాలకు మారేడుపల్లి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇటు పోలీసులనూ...అటు స్థానికులనూ కలవరానికి గురి చేస్తోంది. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో ధ్వంసం కావడాన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు, కంట్రోల్ బాక్స్‌లను ధ్వంసం చేసినప్పటికీ ఒక సీసీ కెమెరా పుటేజ్‌లు పోలీసుల చేతికి చిక్కాయి. దాడులకు పాల్పడిన సమయంలో స్టేషన్‌లో ఎస్‌ఐలు రవికుమార్, మధుతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. పెద్ద సంఖ్యలో జనం దూసుకు రావడంతో వారు నిస్సహాయంగా నిలవాల్సి వచ్చింది. సిబ్బంది తమను తాము రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. దాడికి పాల్పడిన వారి వివరాలను ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. బన్నప్ప అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు ఆచితూచి వ్యవహరించారు.
వివరాల సేకరణ...
పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తుండడంతో మహాత్మాగాంధీ నగర్ వాసులు హడలిపోతున్నారు. ఇంటి వద్ద ఉండకుండా ఇతర ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఏ క్షణాన పోలీసులు తమ ఇళ్లపైకి వస్తారోననే భయంతో కొన్ని కుటుంబాల వారు భయం భయంగా గడుపుతున్నారు. మంత్రి పద్మారావుతో చర్చలు జరిపిన బస్తీవాసులు బన్నప్ప కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు తమపై కేసులు లేకుండా చూడాలని కోరారు.
ఈ విషయంపై మంత్రి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బస్తీవాసుల్లో మరింత టెన్షన్ నెలకొంది. ఈ దాడిలో స్థానికులతో పాటు కొందరు పాత నేరస్థుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసుల మోహరింపుతో మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.