వలస పక్షుల వేదన!
అమ్మలా ఆదరించాల్సిన ఉన్న ఊరు సవతి తల్లి ప్రేమనే చూపుతున్నదన్న బాధ ఒకపక్క... అయినవాళ్లకు ఆసరాగా నిలబడలేకపోతున్నామన్న ఆవేదన మరోపక్క పీడిస్తుండగా ఎక్కడెక్కడికో వలసపోతున్న సామాన్యులకు బతుకుపోరాటంలో ఎప్పుడూ ఓటమే ఎదురవుతున్నది. ఈ దేశంలోనే పుట్టి పెరిగి, ఇక్కడి గాలే పీలుస్తున్నా, ఇక్కడే రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా, తమ శ్రమతో సంపద సృష్టిస్తున్నా వారికి అడుగడుగునా వివక్ష తప్పడంలేదు. స్థానికులందరికీ వారు కంట్లో నలుసులా కనిపిస్తారు. తమ ఉపాధిని కొల్లగొట్టడానికి వచ్చినవారిగా దర్శనమిస్తారు. స్థానికులు సరే... వలస వచ్చినవారి శ్రమను గుర్తించి, వారిని అన్నివిధాలా ఆదుకోవాల్సిన, రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వాలు కూడా అదే దృక్పథంతో వ్యవహరిస్తున్నాయి. వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యునెస్కో సంస్థ వెలువరించిన నివేదిక చూస్తే వలస జనం ఎంతటి దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారో అర్ధమవుతుంది. చేస్తున్నది గొడ్డు చాకిరీ అయినా... ప్రమాదకరమైన పనులకే సిద్ధపడుతున్నా... స్థానికులు తమ స్థాయికి తగనిదని కొట్టిపారేసే పనులే చేస్తున్నా వలస జనానికి నిరాదరణే మిగులుతున్నది.
మహానగరాల్లో ఆకాశాన్నంటే భవంతుల నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలుగా, మురికి కాల్వలను శుభ్రంచేసేవారిగా, ఇళ్లల్లో పనివారిగా, సెక్యూరిటీ గార్డులుగా వీరంతా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. నిత్యం దోపిడీకి గురవుతున్నారు. ఎండనక, వాననక పనిచేసినా వీరెవరికీ తలదాచుకోవడానికి గూడుండదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 40 కోట్లమంది ఒకచోటి నుంచి మరోచోటుకు వలసపోతున్నారు. అంటే దేశ జనాభాలో మూడింట రెండొంతులమంది వలస జీవితాలే గడుపుతున్నారన్నమాట. మరోరకంగా చెప్పాలంటే దేశంలోని ప్రతి ముగ్గురు ఓటర్లలోనూ ఒకరు తన స్వస్థలానికి దూరంగా జీవనపోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి జీవితాలవల్ల వారు అయినవాళ్ల సామీప్యాన్ని కోల్పోవడమే కాదు... తమ గుర్తింపునే పోగొట్టుకుంటున్నారు. వారికి రేషన్ కార్డుండదు. కనుక దానిద్వారా లభించాల్సిన అరకొర సదుపాయాలైనా వారికి దక్కవు.
గుర్తింపు లేదు కాబట్టి సామాజిక రక్షణ పథకాలేవీ వారికి వర్తించవు. ఓటు హక్కుండదు గనుక, స్థానికులు కారు గనుక వారి కోసం పోరాడే పార్టీలుండవు. చదువు ఉండదు గనుక తమ హక్కులేమిటో, తమకు లభించగల సౌకర్యాలేమిటో తెలుసుకునే పరిజ్ఞానం ఉండదు. జ్వరమొచ్చినా, మరే ఇతర ప్రాణాంతక వ్యాధి బారినపడినా వారిని ఆదుకునే నాథుడుండడు. వారు చేస్తున్న చాకిరీ ఎంతో సంపదను సృష్టిస్తోంది. కానీ, ఆ సంపదనుంచి వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ఒక్క పైసా అయినా ఖర్చుచేయడం లేదు. అసలు అలాంటివారు న్నారన్న స్పృహే పాలకుల్లో లోపిస్తున్నది. అమెరికానో, యూరప్ దేశమో, గల్ఫ్ దేశమో వలసపోతున్నవారికి ఉండే కనీస రక్షణలు కూడా ఈ అంతర్గత వలసజీవులకు లేవు. సరిహద్దులు దాటితే లభించే భద్రత సరిహద్దుల లోపల లేదన్నమాట! రెక్కలు తెగిన పక్షుల్లా మిగులుతున్న ఇలాంటి వారి జీవితాలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని యునెస్కో తాజా నివేదిక గుర్తుచేస్తోంది.
యునెస్కో నివేదిక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడించింది. ప్రపంచంలో 74 కోట్ల మంది వలస జీవులుండగా అందులో దాదాపు సగంమంది భారత్లోనే ఉన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో వీరి వాటా 10 శాతం. వలసదారుల్లో 30 శాతం మంది 15-29 మధ్య వయసువారు. సంపాదనలో ఏటా రూ.70,000 కోట్లనుంచి రూ.1,20,000 కోట్ల వరకూ వీరంతా తమ ఇళ్లకు పంపుతున్నారు. ఇలా పంపే ఆదాయం బీహార్ జీడీపీలో 10 శాతం, ఉత్తరప్రదేశ్ జీడీపీలో 4 శాతం ఆక్రమిస్తున్నది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్నుంచే ఎక్కువమంది వలసపోతున్నారు. అటు తర్వాత స్థానం బీహార్ది. ముంబై, సూరత్, నాసిక్, లూథియానా, ఫరీదాబాద్, పూణే వంటి నగరాలు వలసదారులకు ప్రధాన ఆశ్రయాలుగా కనిపిస్తున్నాయి. ఆ మహానగర నిర్మాణాల్లో వలసజీవులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయినా భాష పేరిటో, ప్రాంతం పేరిటో, ఉపాధి పేరిటో స్థానికులను వలసవచ్చినవారిపై ఉసిగొల్పే పార్టీలున్నాయి. స్థానికులు పడుతున్న బాధలకు వలస జనాన్నే కారకులుగా చూపే నేతలున్నారు. ముంబై మహా నగరంలో అనేకసార్లు వలస జనంపై దాడులు జరిగాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అయితే ఒకటికి రెండుసార్లు వలసవచ్చిన వారివల్లే ఆ మహానగరానికి తలనొప్పులు వస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ, ముంబై నగర జనాభాలో దాదాపు సగం మంది వలసదారులే. యునెస్కో నివేదిక ప్రకారం వలసజీవుల్ని ఎక్కువగా ఆదరిస్తున్నది ఫరీదాబాద్ నగరం. అక్కడ నగర జనాభాతో సమానంగా మాత్రమే కాదు... అంతకంటే 12 శాతం అదనంగా వలసదారులున్నారని ఆ నివేదిక అంటున్నది.
ఇలాంటి స్థితికి నిజానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే కారణం. పల్లె జనానికి ప్రధానంగా ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయరంగం నానాటికీ దెబ్బతింటున్నది.
ఇన్పుట్ వ్యయం పెరిగిపోయి, ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర రాక రైతులు కూలీలుగా మారిపోతున్నారు. నగరాలకూ, పట్టణాలకూ వలసపోతున్నారు. ఇక ఆ రంగాన్ని ఆశ్రయించుకుని బతికే సాధారణ కూలీల గురించి చెప్పేదేముంటుంది? పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెంచితే పట్టణీకరణ ఇంతగా పెరగదు. తమ విధానాలు ఇలాంటి స్థితికి కారణమవుతున్నా వలసవచ్చే వారిని సమస్యగా చూడటం తప్ప... తమవల్ల వారికెదురవుతున్న సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. యునెస్కో నివేదికైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. వలసజీవుల భద్రతకూ, వారి సంక్షేమానికి తోడ్పడే విధానాలను పాలకులు రూపొందించాలి.