people problem
-
మెడలో నోట్ల దండ వేసుకుని నిరసన
-
అంతన్నారింతన్నారే ..గంగరాజు
- బాధ్యతలు పట్టించుకోని వైనం - పుష్కరాల్లోనూ అతిథి దర్శనమేనా - హామీలు గాలిలో..ఎంపీ వ్యాపారాల్లో..ప్రజలు సమస్యల్లో సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు.. లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరిట రియల్ ఎస్టేట్, హోటళ్ల వ్యాపారాలు, చెరకు ఫ్యాక్టరీలు.. ఇతరత్రా కంపెనీలు.. విశ్వహిందూ పరిషత్‌లో జాతీయ హోదా బాధ్యతలు.. ఇన్ని వ్యాపకాల్లో తలమునకలై ఎప్పుడో తీరిక దొరికిన తర్వాత గానీ నరసాపురం ఎంపీ పదవి గుర్తురావడం లేదు గోకరాజు గంగరాజుకు. పార్లమెంటు సభ్యునిగా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏడాదికాలంగా అతిథి దర్శన భాగ్యమే కలిగిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాల సందర్భంలోనూ అడపాదడపానే కనిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా వ్యాపార, సినీ ప్రముఖుడే అయినప్పటికీ పుష్కరాలకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ మన జిల్లాలో గోదావరి తీరం ఉన్న డెల్టా ప్రాంతానికి ఎంపీగా ఉన్న గంగరాజు మాత్రం ఇప్పటి వరకు పుష్కరాలపై సీరియస్‌గా దృష్టి సారించలేదు. పుష్కరాల సమీక్షలకు హాజరవడం గానీ.. పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీసి వేగవంతం చేయాలన్న బాధ్యత గానీ ఇంతవరకు ఆయన తీసుకోలేదు. కేంద్రం పుష్కరాల నిర్వహణకు రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టడంలో కూడా ఆయన కనీస ప్రయత్నం చేయలేదన్న వాదనలున్నాయి. ఇక పుష్కరాల్లో కొవ్వూరు, నరసాపురం పట్టణాలతో పాటు జిల్లాలో పుష్కరాలు జరిగే అన్ని రైల్వేస్టేషన్లల్లో కనీస వసతులు లేవు. మిగిలిన అన్ని శాఖలు పుష్కరాలకు సమాయత్తమవుతుండగా రైల్వే శాఖ ఇంకా నిర్లిప్తంగానే ఉంది. ఎంపీగా రైల్వే శాఖ అధికారులతో మాట్లాడటం కాని, పుష్కరాల నేపథ్యంలో రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసే ప్రయత్నం కాని నామమాత్రంగా కూడా ఎంపీ చేయలేదన్న విమర్శలున్నాయి. సీఎం, కేంద్రమంత్రులు వస్తేనే దర్శనం ఎంపీగా గెలిచిన తర్వాత ఈ 13 నెలల కాలంలో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు పాల్గొనే సభలకు హాజరవడం.. స్థానికంగా ఆహ్వానాల ప్రాధాన్యతను బట్టి నియోజకవరాల్లో ప్రత్యక్షం కావడం తప్పించి, సమస్యలు చెప్పుకుందామంటే ఎంపీ కానరావడం లేదని నియోజకవర్గ ప్రజలే కాదు రాజకీయ నాయకులూ అంటున్నారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికీ ఆయన పర్యటించని మండలాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏడాదికాలంలో మొత్తంగా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలకు 15 సార్లు, తణుకుకు 4 సార్లు, తాడేపల్లిగూడెంకు 3 సార్లు మాత్రమే వచ్చారు. ఆచంటకు అడపాదడపా వచ్చే ఆయన కొద్దోగొప్పో భీమవరానికి ఎక్కువసార్లు వస్తుంటారు. అక్కడే ఎంపీ కార్యాలయం ఉంది. ఎన్నికల సమయంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు ఆఫీస్‌లు పెడతానని హామీలు గుప్పించారు. అయితే ఇప్పటి వరకు క్యాంపు కార్యాలయాలకు అతీగతీ లేదు. ఏడాదిలో కానరాని ఎంపీ ముద్ర రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం లాంటి పట్టణాల ప్రాధాన్యం పెరిగింది. అభివృద్ధి పరంగా ప్రోత్సహిస్తే కార్పొరేషన్ల స్థాయికి ఈ పట్టణాలు చేరే అవకాశం ఉంది. అయితే ఎంపీగా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. ఆక్వా ఉత్పత్తులకు ముఖ్య కేంద్రంగా ఉన్న భీమవరాన్ని ఆక్వారంగానికి సంబంధించి దేశంలోనే ముఖ్య పట్టణంగా తీర్చుదిద్దుతామని ఎన్నికల వేళ హామీనిచ్చారు. తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో పారిశ్రామికీకరణను పరుగులు పెట్టిస్తానని చెప్పారు. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న నరసాపురంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇక రైల్వేల అభివృద్ధి, గతం నుంచీ హామీలుగా మిగిలిపోయిన పైప్లైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా వంటి విషయాల్లో చాలా వాగ్దానాలు చేశారు. గంగరాజు ఎంపీగా గెలవడం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో హామీల్లో కొన్నయినా నెరవేరతాయని ప్రజలు ఆశించారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఏడాది దాటినా నరసాపురం లోక్‌సభ నియోజక అభివృద్ధి విషయంలో గంగరాజు మార్కు ఎక్కడా కనిపించడంలేదు. ఇప్పటివరకు ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఒక్క పని కూడా ఎంపీ ఖాతాలో లేదని స్వయంగా సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
చక్రబంధం
రెండో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె ఇబ్బందులకు లోనవుతున్న ప్రయాణికులు ప్రభుత్వ వైఖరిపై మండిపాటు ప్రైవేట్ వాహన యజమానుల దోపిడీ ఆర్టీసీకి రూ.80 లక్షల నష్టం కర్నూలు(రాజ్‌విహార్/అర్బన్) : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బస్సులు డిపోలకు పరిమితం కాగా.. రవాణా వ్యవస్థ స్తంభించింది. ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజలకు భారంగా పరిణమిస్తోంది. వేసవి సెలవులు కావడం.. పెళ్లిళ్లు, శుభకార్యాలతో పాటు పోటీ పరీక్షల సమయం కావడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. సమ్మె కారణంగా జిల్లాలోని 11 డిపోల్లో 658 బస్సులు నిలిచిపోయాయి. 312 బస్సులు తిప్పగా.. ఇందులో ఆర్టీసీ బస్సులు 145, అద్దెబ బస్సులు 167 ఉన్నాయి. మొత్తంగా సంస్థకు రూ.80 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టి.వి.రామం తెలిపారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఆర్టీసీ అధికారులు తిప్పుతున్న బస్సుల్లో ప్రైవేట్ ఉద్యోగులు చార్జీలను ఎడాపెడా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. రాయితీ పాసులు, క్యాట్ కార్డులు, ఇతరత్రాలను అనుమతించకపోవడంతో కండక్టర్ అభ్యర్థులు, ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ప్రైవేట్‌లో రెండింతల డోపిడీ కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే... సందట్లో సడేమియాగా ప్రైవేట్ వాహన యజమానులు దోపిడీకి తెరతీశారు. కండీషన్ లేని వాహనాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇక చార్జీలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. సాధారణంగా కర్నూలు నుంచి కోడుమూరుకు ఆర్టీసీకి సంబంధించి ఆర్డినరీ సర్వీసుకు రూ.21, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌కు రూ.28 చార్జీ ఉంది. అయితే సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి ప్రైవేట్ వాహనాలు రూ.30 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ఆర్టీసీ అద్దె బస్సులు కూడా తామేమీతక్కువ కాదంటూ రూ.30 వసూలు చేస్తుండటం పట్ల ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. రెండో రోజూ కొనసాగిన సమ్మె ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ)లతో పాటు వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఇతర కార్మిక సంఘాల నాయకులు బస్‌స్టేషన్‌లో ఆందోళన నిర్వహించారు. ఈయూ రాష్ట్ర కార్యదర్శులు ఎ.వి.రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి.కుమార్, జిల్లా నాయకులు ఎంబీఎన్ శాస్త్రీ పాల్గొన్నారు. సమ్మెకు ఏపీ ఎన్జీవో సంఘం నేతలు వెంగళ్‌రెడ్డి, శ్రీరాములుతో పాటు ఇతర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.