రెండో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
ఇబ్బందులకు లోనవుతున్న ప్రయాణికులు
ప్రభుత్వ వైఖరిపై మండిపాటు
ప్రైవేట్ వాహన యజమానుల దోపిడీ
ఆర్టీసీకి రూ.80 లక్షల నష్టం
కర్నూలు(రాజ్‌విహార్/అర్బన్) : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బస్సులు డిపోలకు పరిమితం కాగా.. రవాణా వ్యవస్థ స్తంభించింది. ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజలకు భారంగా పరిణమిస్తోంది. వేసవి సెలవులు కావడం.. పెళ్లిళ్లు, శుభకార్యాలతో పాటు పోటీ పరీక్షల సమయం కావడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.
సమ్మె కారణంగా జిల్లాలోని 11 డిపోల్లో 658 బస్సులు నిలిచిపోయాయి. 312 బస్సులు తిప్పగా.. ఇందులో ఆర్టీసీ బస్సులు 145, అద్దెబ బస్సులు 167 ఉన్నాయి. మొత్తంగా సంస్థకు రూ.80 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టి.వి.రామం తెలిపారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఆర్టీసీ అధికారులు తిప్పుతున్న బస్సుల్లో ప్రైవేట్ ఉద్యోగులు చార్జీలను ఎడాపెడా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. రాయితీ పాసులు, క్యాట్ కార్డులు, ఇతరత్రాలను అనుమతించకపోవడంతో కండక్టర్ అభ్యర్థులు, ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది.
ప్రైవేట్‌లో రెండింతల డోపిడీ
కడుపు మండిన ఆర్‌టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే... సందట్లో సడేమియాగా ప్రైవేట్ వాహన యజమానులు దోపిడీకి తెరతీశారు. కండీషన్ లేని వాహనాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇక చార్జీలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. సాధారణంగా కర్నూలు నుంచి కోడుమూరుకు ఆర్‌టీసీకి సంబంధించి ఆర్డినరీ సర్వీసుకు రూ.21, ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌కు రూ.28 చార్జీ ఉంది. అయితే సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి ప్రైవేట్ వాహనాలు రూ.30 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ఆర్‌టీసీ అద్దె బస్సులు కూడా తామేమీతక్కువ కాదంటూ రూ.30 వసూలు చేస్తుండటం పట్ల ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
రెండో రోజూ కొనసాగిన సమ్మె
ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ)లతో పాటు వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఇతర కార్మిక సంఘాల నాయకులు బస్‌స్టేషన్‌లో ఆందోళన నిర్వహించారు.
ఈయూ రాష్ట్ర కార్యదర్శులు ఎ.వి.రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, ఎన్‌ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి.కుమార్, జిల్లా నాయకులు ఎంబీఎన్ శాస్త్రీ పాల్గొన్నారు. సమ్మెకు ఏపీ ఎన్‌జీవో సంఘం నేతలు వెంగళ్‌రెడ్డి, శ్రీరాములుతో పాటు ఇతర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
చక్రబంధం
Published Fri, May 8 2015 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement