సతి వెనకే పతి..
ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: ప్లీజ్ మా ఆవిడకు ఓటేయండి..మీ రుణం తప్పక తీర్చుకుంటాం అంటూ సతుల కోసం పతులు ఆరాటపడుతున్నారు.మండల పరిధిలో ఈ పాట్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మండలంలోని 21 పంచాయతీల్లో మొత్తం 46 మండల ప్రాదేశిక నియోజకవర్గాల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మండలంలోని ఎన్‌ఎఫ్‌సీనగర్ ఎంపీటీసీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయిస్తే అక్కడి నుంచి ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ పెర్సీబాయి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేస్తోంది.
దీంతో మండలంలో 24 మంది మహిళలు ఎంపీటీసీ స్థానాల బరిలో ఉన్నారు. 24 మహిళా మండల ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి 89 మంది మహిళా ఎంపీటీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మహిళా అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో వారి భర్తలు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తూ సతీమణులకు తోడుగా ఉంటూ ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తూ దీటుగా ప్రచారం చేస్తున్నారు.
రాత్రింబవళ్లు గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఘట్కేసర్ పట్టణంలోని 2లో దేవరకొంద పద్మ భర్త రవి, రాజబోయిన మంగమ్మ భర్త యాదగిరియాదవ్, వేల్పుల అనురాధ భర్త రవి, మామిండ్ల సరిత భర్త ముత్యాలుయాదవ్, పోచారం 1లో ఇండిపెండెంట్ అభ్యర్థి బద్దం మమతరాణి కోసం ఆమె భర్త బద్దం జగన్మోహన్రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గడపగడపకూ తిరుగుతూ తన సతీమణి గుర్తు చూపిస్తూ ఓటేసి గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు.