personal law
-
కుష్టు ఉందని విడాకులు కుదరదు
న్యూఢిల్లీ: విడాకులు తీసుకోవాలనుకునే భార్య/భర్త తమ జీవిత భాగస్వామికి కుష్టు వ్యాధి ఉందనే కారణం చూపడం కుదరదు. ఈ మేరకు చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ‘జీవిత భాగస్వామికి కుష్టు వ్యాధి ఉందనే కారణం చూపి ఇకపై విడాకులు పొందేందుకు వీలుండదు. కుష్టు నయం కాదని ఇదివరకు అందరూ భావించేవారు. కానీ, ఈ వ్యాధికి చికిత్స ఉంది’ అని వ్యక్తిగత చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌధరి అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులపై వివక్షను చూపుతున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వివాహ చట్టాల్లో ఈ మేరకు ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ చర్చలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. దేశంలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించలేదు. ప్రభుత్వం ముస్లిం వ్యక్తిగత చట్టాల్లో జోక్యం చేసుకోవద్దు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కుష్టు వ్యాధిని కారణంగా చూపి విడాకులు తీసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది’ అని చెప్పారు. -
ఆ చట్టం ముస్లింలకూ వర్తిస్తుంది
అహ్మదాబాద్: గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాల్యవివాహ నిరోధక చట్టం అన్ని మతాలవారికీ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. గుజరాత్‌కు చెందిన యూనుస్ షేక్ అనే ముస్లిం దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. బాల్యవివాహ నిరోధక చట్టం ప్రత్యేక చట్టమని, కనుక ముస్లింలకు కూడా ఇది సమానంగా వర్తిస్తుందని తీర్పు వెలువరించింది. ముస్లిం, హిందూ లేదా ఇతర మతాల వ్యక్తిగత చట్టాల్లోని కొన్ని అంశాలను సైతం తోసిపుచ్చుతుందని జస్టిస్ జెబి పర్దివాలా స్పష్టం చేశారు. ఆయా పర్సనల్ లా లోని అంశాలకు అతీతంగా బాల్య వివాహ నిరోధక చట్టం పని చేస్తుందన్నారు. దీంతోపాటు మార్పులు, చేర్పులకు అనుమతించని ముస్లిం పర్సనల్ లా చట్టం వల్ల ముస్లింలకు తీరని నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. గుజరాత్లో యూనుస్ షేర్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. తాను ముస్లింననీ, ముస్లిం పర్సనల్ లా ప్రకారం బాల్య వివాహ నిరోధక చట్టం తనకు వర్తించదని వాదిస్తూ పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే యూనుస్ వాదనలను హైకోర్టు తిరస్కరించింది. చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.