petlaburj hospital
-
కు.ని. ఆపరేషన్‌తో మహిళ మృతి.. క్లారిటీ ఇచ్చిన డీఎంఈ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించింది. పాతబస్తీ పెట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్లో వైద్యులు ఓ మహిళకు ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన మర్నాడు నుంచి మహిళకు ఫీవర్, వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు మహిళ మహిళ మృతి చెందింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై డీఎమ్ఈ రమేష్ రెడ్డి విచారణ చేపట్టారు. పాతబస్తీ పేట్ల బురుజు ఆస్పత్రి ఘటనపై డీఎంఈ క్లారిటీ ఇచ్చారు. ఆ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల చనిపోలేదని తెలిపారు. వైరల్ జ్వరం వల్లే మహిళ చనిపోయిందన్నారు. మహిళకు ట్యూబెక్టమీ చేయలేదని, సీ సెక్షన్ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. మహిళకు ఆపరేషన్ జరిగిన రోజే మరో 9 మందికి సర్జరీ జరిగిందన్నారు. 9 మందిలో మరో ఇద్దరికి వైరల్ ఫీవర్ ఉందని, వారి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. కాగా ఇటీవలనే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే. -
పాప పుడితే రూ.1500, బాబు అయితే 2వేలు
చేవెళ్లకు చెందిన ఆదినారాయణ భార్య రజిత నిండుగర్భిణి. ఆమెకు నెలలు నిండటంతో ప్రసవం కోసం ఈ నెల 12న పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె పురిటి నొప్పులతో బాధపడుతోంది. నడవలేని పరిస్థితిలో ఉంది. కాన్పు చేసేందుకు స్టెచర్‌పై లేబర్‌రూమ్‌కు తీసుకెళ్లేందుకు రూ.100, ప్రసవం తర్వాత తిరిగి వార్డుకు చేర్చేందుకు రూ.100, పుట్టిన బిడ్డను శుభ్రం చేసేందుకు రూ.200, బిడ్డను అప్పగించేందుకు రూ.2 వేలు చె ల్లించుకోవాల్సి వచ్చింది. ఇలా ఒక్క రజిత భర్త మాత్రమే కాదు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చినవారి నుంచి కొంతమంది సిబ్బంది రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో :ఇక్కడ ఆడ, మగ బిడ్డల జననంపై ధరలు నిర్ణయిస్తారు. పురిటి బిడ్డను కళ్లారా చూసుకునేందుకు సైతం రేట్లు నిర్ణయించారు. లేదంటే చీత్కారాలు.. చీదరింపులు ఎదుర్కొవాల్సిందే. ‘తమ వద్ద డబ్బుల్లేవ్.. మమ్మల్ని వదిలే యండి’ అంటూ కాళ్లావేళ్లా పడినా కనికరించే వారే ఉండరంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్ కిట్‌లో భాగంగా పలు రకాల ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రతిష్టాత్మక సుల్తాన్ బజార్, పేట్లబురుజు, నిలోఫర్, గాంధీ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో గతంతో పోలిస్తే ప్రస్తుతం రోగుల సంఖ్య 40 శాతం పెరిగింది. అయితే ఆయా ఆస్పత్రుల్లోని లేబర్రూముల్లో పని చేస్తున్న సిబ్బంది ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆస్పత్రిలో చేరి.. ప్రసవం తర్వాత డిశ్చార్జి అయ్యేంతవరకూ సిబ్బందికి రూ.4 వేలకుపైగా సమర్పించుకోవాల్సి వస్తోంది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన రోగులను పట్టించుకోకపోవడమే కాకుండా సూటిపోటి మాటలతో తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. పేట్లబురుజులో వసూళ్ల దందా.. ప్రతిష్టాత్మక పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ప్రతి రోజూ సగటున 60కిపైగా ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ పుట్టిన బిడ్డను చూసేందుకే కాదు, నొప్పులతో బాధపడుతున్న గర్భిణులను లేబర్‌వార్డుకు తరలించాలన్నా.. ప్రసవం తర్వాత థియేటర్ నుంచి బాలింతను లేబర్‌రూమ్ నుంచి స్టెచర్‌పై వార్డుకు తరలించేందుకు రూ.100, పుట్టిన శిశువును శుభ్రం చేసినందుకు రూ.100, శిశువును అప్పగించేందుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. బాలింతను పరామర్శించేందుకు వచ్చే బంధువులు ప్రధానగేటు వద్ద రూ.20, ఆ తర్వాత రెండో గేటు వద్ద రూ.20, మూడో గేటు వద్ద రూ.20 చొప్పున చెల్లించుకోవాల్సివస్తోంది. వార్డులను శుభ్రం చేసే శానిటేషన్ సిబ్బందికి రోజుకు రూ.20 చెల్లించాల్సిందే. ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చని భావించి ఆస్పత్రికి వచ్చిన వారిని నిలువునా దోచుకుంటుండటంతో రోగులు, వారివెంట వచ్చిన బంధువులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా వార్డుల్లో తనిఖీలు చేపట్టి, అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన ఆర్‌ఎంఓలు, సూపరింటెండెంట్లు తమ గదులు దాటి బయటికి రావడం లేదు. సిబ్బంది వసూలు చేసిన అక్రమ సొమ్ములో ఆర్ఎంఓలకు కూడా వాటాలు అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వసూల్ రాజాలకే వంత.. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ప్రతి రోజూ సగటున 25 కాన్పులు జరుగుతాయి. కీలకమైన విభాగాల్లో సైతం రెగ్యులర్ ఉద్యోగులను పక్కనపెట్టి, కాంట్రాక్టు కార్మికులతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా కాంట్రాక్టు సిబ్బంది వసూలు చేసిన మొత్తం నుంచి ఆయా విభాగాల ఇన్చార్జిలకు వాటాలు అందుతున్నట్లు సమాచారం. ఎంతోకొంత ఇష్టంతో ఇస్తే తీసుకొని, అంతటితో సంతృప్తి చెందాలి కానీ ఇంతే ఇవ్వాలని డిమాండ్ చేయడమేంటని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇక నిలోఫర్ ప్రభుత్వ చిన్నపిల్లల ఆస్పత్రిలోనూ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రసవం తర్వాత బంధువులెవరైనా బాలింతలను పరామర్శించాలన్నా.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలన్నా.. అడిగినంతా ఇచ్చుకోవాల్సిందే. ఎవరైనా ఇందుకు నిరాకరించి, అవుట్ పోస్టింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే.. నీవేమైనా లక్షలిస్తున్నావా.. ఇచ్చి పోరాదు..! అంటూ వారూ వసూల్ రాజాలకే వంత పాడుతుండటం కొసమెరుపు. -
బిడ్డకు ప్రేమతో కేసీఆర్..
-
బిడ్డకు ప్రేమతో కేసీఆర్..
- ‘కెసిఆర్ కిట్’ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి - మాతా, శిశు సంరక్షణలో వినూత్నమైన అడుగు హైదరాబాద్: ‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో..’ ట్యాగ్‌లైన్‌తో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కెసిఆర్ కిట్’ పథకం శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను బాలింతకు అందజేశారు. ఈ పథకంలోనే అంతర్భాగమైన ‘గర్భిణులకు నగదు’ పోర్టల్ ను కూడా సీఎం ఆవిష్కరించారు. నిరాడంబరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, హోం మంత్రి నాయిని, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు, వైద్యాధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు. కెసిఆర్ కిట్: ఈ పథకం ద్వారా తల్లీపిల్లలకు అవసరమైన 15 రకాల వస్తువులను అందిస్తారు. తల్లికి రెండు చీరలు, చిన్నపిల్లలకు రెండు డ్రెస్‌లు, డైపర్లు, బేబీ ఆయిల్, బేబీ షాంపూ, తల్లీపిల్లకు వేరువేరుగా సబ్బులు, చిన్న పరుపు, దోమతెర తదితర వస్తువులను కిట్‌లో పొందుపర్చారు. వేటికవే అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైన వస్తువులతో కూడిన కెసిఆర్ కిట్ విలువ విలువా రూ.2వేలు. గర్భిణులకు నగదు: ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణిగా పేరు నమోదు చేసుకుని, వైద్య పరీక్షలను చేయించుకుని ప్రసవించిన తల్లికి వాయిదా పద్దతిలో నగదును అందజేస్తారు. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మహిళలకు ఈ పథకం కింద రూ.13వేలు, మగబిడ్డకు జన్మనిచ్చిన వారికి రూ.12 వేలను అందిస్తారు. మొదటి విడత నగదు: ప్రభుత్వాసుపత్రిలో గర్భిణిగా పేరు నమోదు చేయించుకుని కనీసం రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత రూ. 3వేలు అందజేస్తారు. రెండో విడత నగదు: ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన తరువాత ఆడబిడ్డ పుడితే రూ.5వేలు, మగ బిడ్డ పుడితే రూ. 4వేలు అందజేస్తారు. మూడో విడత నగదు: బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలల కాలంలో ఇవ్వవలసిన టీకాలు తీసుకున్న తరువాత రూ. రెండు వేలు నాలుగో విడత నగదు: బిడ్డ పుట్టినప్పటి నుంచి 9 నెలల కాలంలో ఇవ్వ వలసిన టీకాలు తీసుకున్న తరువాత రూ. మూడు వేలు ఇస్తారు. ఈ నాలుగు విడతలుగా ఇచ్చే మొత్తం నగదు బిడ్డ తల్లి పేరుపై ఉన్న బ్యాంకు అకౌంట్లో జమ అవుతాయి. వాహనంలో ఇంటికి: దీనితో పాటు రెండువేల విలువ చేసే 15రకాల వస్తువులతో కూడిన కిట్స్‌ను అందచేస్తారు. దీంతో పాటు దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యే మాతా, శిశువులను అమ్మ ఒడి వాహనంలో ఇంటికి తీసుకెళ్తారు.