
బిడ్డకు ప్రేమతో కేసీఆర్..
- ‘కెసిఆర్ కిట్’ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
- మాతా, శిశు సంరక్షణలో వినూత్నమైన అడుగు
హైదరాబాద్: ‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో..’ ట్యాగ్‌లైన్‌తో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కెసిఆర్ కిట్’ పథకం శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను బాలింతకు అందజేశారు.
ఈ పథకంలోనే అంతర్భాగమైన ‘గర్భిణులకు నగదు’ పోర్టల్ ను కూడా సీఎం ఆవిష్కరించారు. నిరాడంబరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, హోం మంత్రి నాయిని, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు, వైద్యాధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు.
కెసిఆర్ కిట్: ఈ పథకం ద్వారా తల్లీపిల్లలకు అవసరమైన 15 రకాల వస్తువులను అందిస్తారు. తల్లికి రెండు చీరలు, చిన్నపిల్లలకు రెండు డ్రెస్‌లు, డైపర్లు, బేబీ ఆయిల్, బేబీ షాంపూ, తల్లీపిల్లకు వేరువేరుగా సబ్బులు, చిన్న పరుపు, దోమతెర తదితర వస్తువులను కిట్‌లో పొందుపర్చారు. వేటికవే అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైన వస్తువులతో కూడిన కెసిఆర్ కిట్ విలువ విలువా రూ.2వేలు.
గర్భిణులకు నగదు: ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణిగా పేరు నమోదు చేసుకుని, వైద్య పరీక్షలను చేయించుకుని ప్రసవించిన తల్లికి వాయిదా పద్దతిలో నగదును అందజేస్తారు. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మహిళలకు ఈ పథకం కింద రూ.13వేలు, మగబిడ్డకు జన్మనిచ్చిన వారికి రూ.12 వేలను అందిస్తారు.
మొదటి విడత నగదు: ప‌్రభుత్వాసుపత్రిలో గర్భిణిగా పేరు నమోదు చేయించుకుని కనీసం రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత రూ. 3వేలు అందజేస్తారు.
రెండో విడత నగదు: ప‌్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన తరువాత ఆడబిడ్డ పుడితే రూ.5వేలు, మగ బిడ్డ పుడితే రూ. 4వేలు అందజేస్తారు.
మూడో విడత నగదు: బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలల కాలంలో ఇవ్వవలసిన టీకాలు తీసుకున్న తరువాత రూ. రెండు వేలు
నాలుగో విడత నగదు: బిడ్డ పుట్టినప్పటి నుంచి 9 నెలల కాలంలో ఇవ్వ వలసిన టీకాలు తీసుకున్న తరువాత రూ. మూడు వేలు ఇస్తారు. ఈ నాలుగు విడతలుగా ఇచ్చే మొత్తం నగదు బిడ్డ తల్లి పేరుపై ఉన్న బ్యాంకు అకౌంట్లో జమ అవుతాయి.
వాహనంలో ఇంటికి: దీనితో పాటు రెండువేల విలువ చేసే 15రకాల వస్తువులతో కూడిన కిట్స్‌ను అందచేస్తారు. దీంతో పాటు దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యే మాతా, శిశువులను అమ్మ ఒడి వాహనంలో ఇంటికి తీసుకెళ్తారు.