‘అమ్మ’కు చేయూత | CM KCR start the Scheme KCR kit | Sakshi
Sakshi News home page

‘అమ్మ’కు చేయూత

Published Sun, Jun 4 2017 3:23 AM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM

‘అమ్మ’కు చేయూత - Sakshi

‘అమ్మ’కు చేయూత

► ‘కేసీఆర్‌ కిట్‌’ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే గర్భిణులు, బాలింతలకు ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కేసీఆర్‌ కిట్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. శనివారం హైదరాబాద్‌లోని ప్లేట్లబురుజు మోడర్న్‌ మెటర్నిటీ ఆస్పత్రిలో ఆరుగురు బాలింతలకు కిట్‌ను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంపొందించేందుకు, ఇతర మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

వసతులు పెంచాం..
పేట్లబురుజు ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన రషీదాబేగం, మగబిడ్డకు జన్మనిచ్చిన టి.సరితమ్మ, మెహజెమీన్, మేకల సబిత తదితరులకు కేసీఆర్‌ కిట్‌ను ముఖ్యమంత్రి అందజేశారు. అనంతరం కేసీఆర్‌ కిట్స్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించి.. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆస్పత్రిలోని అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ సెంటర్, ఎమర్జెన్సీ వార్డు, జనరల్‌ వార్డు, స్టెబిలైజేషన్‌ విభాగాలను పరిశీలించి.. ఆస్పత్రి సిబ్బంది, రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవత్వంతో కూడిన వైద్యసేవలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు కూడా పెంచామని.. ఫలితంగా వాటికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. పేట్లబురుజు ఆస్పత్రిలో 462 పడకలుంటే 700 మంది వచ్చారని, దానివల్ల పడకల కొరత ఏర్పడిందని పేర్కొన్నారు.

అయినా సరే పడకలు లేవంటూ ఆస్పత్రికి వచ్చిన వారిని తిప్పిపంపడం లేదని.. ఎక్కువ మందికి సేవలు అందిస్తున్నందుకు ప్రభుత్వ వైద్యులను అభినందించాలని చెప్పారు. రోగుల సంఖ్య పెరుగుతున్నందున పేట్లబురు జు ఆస్పత్రిలో మరోబ్లాక్‌ నిర్మిస్తామని ప్రకటిం  చారు. ఇదే ఆస్పత్రిలో గతంలో మహాలక్ష్మి అనే డాక్టర్‌ గొప్పగా పనిచేశారని, ధనవంతులు కూడా వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకునే వారని గుర్తు చేశారు. మళ్లీ ఈ ఆస్పత్రి ఆ స్థాయిలో సేవలందించాలని ఆకాంక్షించారు. గతంలో రోగుల బంధువులు ఉండడానికి వీలుగా ప్రభుత్వాస్పత్రులకు అనుసంధానంగా ధర్మశాలలు ఉండేవని.. మళ్లీ అలాంటి ధర్మశాలలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. నర్సింగ్‌ సిబ్బందికి స్టైఫండ్, మెస్‌ నిర్వహణ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మైకు పట్టని సీఎం..
పేట్లబురుజు ఆస్పత్రిలో ఈ పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్‌.. ఎక్కడా మైకు పట్టుకుని మాట్లాడలేదు. ప్రసవాలు జరిగే ఆస్పత్రికి వచ్చి ఉపన్యసించడం సబబు కాదని ఆయన అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో కేసీఆర్‌ కార్యక్రమమంతా పరిశీలన, అక్కడి అధికారులు, వైద్యులతో మాట్లాడడానికే పరిమితమైంది. ఇక సీఎం కార్యక్రమం కావడంతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మీడియా వారిని కూడా ఆస్పత్రిలోనికి అనుమతించలేదు. వందలాది మంది రోగుల బంధువులు కూడా ఆరు బయట వేచి ఉండాల్సి వచ్చింది. అత్యవసర కేసులు వచ్చినా ఆస్పత్రిలోకి వెళ్లనీయలేదు. ఒక మహిళ అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి రాగా పోలీసులు అడ్డుకున్నారు.

వీల్‌చైర్‌పై ఉన్న ఆమెను కొందరు సిబ్బంది వివిధ గేట్ల వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం కలగలేదు. దాంతో ఆస్పత్రి వెనుకభాగం నుంచి ఆమెను లోపలికి తీసుకెళ్లారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ఖాద్రి, ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌పీ సింగ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ శనివారం కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రారంభమైంది. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ఈ పథకాన్ని ప్రారంభించారు.

‘కేసీఆర్‌ కిట్‌’లో అందించే వస్తువులివీ..
శిశువు కోసం.. దోమతెర, బేబీ బెడ్, దుస్తులు, రెండు టవల్స్‌, బేబీ న్యాప్కిన్స్‌, బేబీ పౌడర్‌, బేబీ షాంపూ, బేబీ ఆయిల్‌, బేబీ సబ్బు, బేబీ సోప్‌బాక్స్‌, ఆట వస్తువులు   
తల్లి కోసం.. రెండు చీరలురెండు, సబ్బులుకిట్‌ బ్యాగ్‌, ప్లాస్టిక్‌ బకెట్‌
(ఈ కిట్‌తోపాటు ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఖర్చుల కోసం తల్లి పేరిట బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు)

ఒక కిట్‌... కవలల్లో ఎవరికి వాడాలి?
అశ్వారావుపేట: కేసీఆర్‌ కిట్‌ ఒకటే ఇస్తారన్న నిబంధన కవలలకు జన్మనిచ్చిన తల్లికి ఒకింత ఇబ్బందిగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన పఠాన్‌ షమీనాకు ఒకే కాన్పులో కవలలుగా బాబు, పాప పుట్టారు. అయితే, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ట్రైకార్‌ చైర్మన్‌ తాటి వెంకటేశ్వర్లుకు అమ్మఒడి పథకం కింద ఆమెకు ఒకే కిట్‌ అందజేశారు. దీంతో ఇద్దరు పిల్లలను ఒకే పరుపుపై పడుకోబెట్టలేక.. ఒకరిని పరుపుపైన.. ఒకరిని నేలపైన పడుకోబెట్టలేక షమీనాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కేసీఆర్‌ కిట్‌ ఖరీదయింది కావడంతో అలాంటి వస్తువులనే బయట మార్కెట్లో కొనుగోలు చేయడం తమలాంటి పేదవారికి కష్టమని, మరో కిట్‌ ఇవ్వాలని ఎంపీ, ఎమ్మెల్యేకు విన్నవించింది. అయితే ఒక బాలింతకు ఒకే కిట్‌ అని వైద్యులు చెప్పడంతో అదే ఫైనల్‌ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement