కేసీఆర్ కిట్టు అందజేస్తున్న డిప్యూటీ స్పీకర్, కలెక్టర్(ఫైల్)
తెలంగాణ ప్రభుత్వం గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్టు పథకం సూపర్ హిట్టైంది. ఈ పథకం అమలు తర్వాత ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి గర్భిణులు క్యూ కడుతున్నారు. దీంతో పాటు ప్రసవానంతరం పిల్లలను సంరక్షించేందుకు సైతం ఆర్థికసాయం అందజేస్తున్నారు. దీంతో పీహెచ్‌సీల్లోనూ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాటు వివిధ వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానాలకు వచ్చే రోగులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్ల పంపిణీ, మౌలిక సదుపాయాల తీరుతెన్నులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్..
సాక్షి, మెదక్: కేసీఆర్ కిట్ల పంపిణీ జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. ఈ పథకంతో మాతాశిశు మరణాలకు అడ్డుకట్ట పడింది. సర్కారీ దవాఖానాలపైనా ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. ఈ పథకంతో జిల్లాలో గతంలో కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన గర్భిణులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నారు. ప్రసవ అనంతరం ఆడపిల్ల పుడితే రూ.15 వేలు, మగపిల్లాడు పుడితే రూ.14వేల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతోంది. పిల్లలు పుట్టిన వెంటనే కేసీఆర్ కిట్లను అందజేస్తున్నారు. రూ.2వేలు విలువ చేసే ఈ కిట్‌లో నవజాత శిశువుకు అవసరమైన వస్తువులుంటాయి. జిల్లాలో ఈ పథకాన్ని జూన్ 2, 2017న ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 22 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఏరియా ఆస్పత్రితో పాటు రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లున్నాయి. అలాగే మండలాల్లో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
పెరిగిన ప్రసవాలు
ఈ పథకం అమలులోకి రాకముందు ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించేందుకు ఆసక్తి చూపించేవారు. జిల్లా వ్యాప్తంగా 2017 జనవరి నుంచి జూన్ వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 1,662 ప్రసవాలు మాత్రమే జరిగాయి. ఈ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 4,296 ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వాస్పత్రుల్లో 90 శాతం ప్రసవాలు జరుగుతుంటే కేవలం 10 శాతం మాత్రమే ప్రైవేట్‌లో జరుగుతున్నాయి. ప్రైవేట్‌లో ఒక్కో ప్రసవానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు రెండు సార్లు ఉచితంగా భోజనం పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీ కేంద్రాలకు వైద్య పరీక్షలకు వచ్చే రోగులకు సైతం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ భోజనం వడ్డించే బాధ్యతను అంగన్‌వాడీ సిబ్బందికి అప్పగించారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత..
ఈ పథకం సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ ఆస్పత్రులను సిబ్బంది కొరత వేదిస్తోంది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర ఆస్పత్రుల్లో 90 ఖాళీలున్నాయి. ఇందులో 40 స్టాఫ్ నర్సులు, 12 వైద్యుల పోస్టులు, 5 ల్యాబ్ టెక్నిషియన్లతో పాటు సెకాలజిస్టులు, ప్రోగ్రాం ఆఫీసర్లు, కౌన్సిల్ మెంబర్లు, జనరల్ ఫిజియోథెరపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులను త్వరగా భర్తీ చేసి మెరుగైన సేవలందించాలని ప్రజలు కోరుతున్నారు.
17 ప్రసవాలు మాత్రమే..
చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఆస్పత్రిలో 9 నెలల్లో కేవలం ఏడుగురికి మాత్రమే కేసీఆర్ కిట్స్‌ను అందించారు. ఇక్కడ ఇప్పటి వరకు 17 మందికి మాత్రమే ప్రసవాలు చేశారు. అస్పత్రిలో అన్ని వసతులు ఉన్నప్పటికీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో కాన్పు కోసం వచ్చేవారిని మెదక్ ఏరియా అస్పత్రికి పంపించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఇక్కడ ప్రసవాల సంఖ్య ఏమాత్రం పెరగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment