‘కిట్టు’ హిట్టే కానీ.. | News about kcr kit | Sakshi
Sakshi News home page

‘కిట్టు’ హిట్టే కానీ..

Published Sat, Mar 10 2018 2:06 AM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM

News about kcr kit - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌ :  కేసీఆర్‌ కిట్‌ హిట్టయింది. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెండింతలు పెరిగింది. కానీ అదే సమయంలో సౌకర్యాల లేమి, వైద్య సిబ్బంది కొరతపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లో వైద్య సేవలు దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులపైనే ఆధారపడే గిరిజనుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు. బలవంతంగా పంపినా ఎక్కువ రోజులు పనిచేయడం లేదు.

ఏరియా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది స్థానికంగా ఉండటం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకే వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. అత్యవసరమైతే ప్రైవే టు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిందే. వాళ్లు నార్మల్‌ డెలివరీకి అవకాశం ఇవ్వకుండా సిజేరియన్‌ చేసేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రైవేటు ఆస్పతుల్లో డెలివరీకి రూ.30 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేస్తున్నారు. బిడ్డ పుట్టిన వెంటనే అవసరం ఉన్నా లేకపోయినా వెంటిలేటర్‌ గదిలో ఉంచుతూ మరికొంత పిండుకుంటున్నారు. స్పెషలిస్టు వైద్యులకు చూపించుకోవాలంటే జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

బెడ్స్‌ కరువు.. మందులకు తిప్పలు..
ప్రసవాల సంఖ్య పెరుగుతున్నా ఆస్పత్రుల్లో సరిపడ పడకలు ఉండడం లేదు. చాలా ఆస్పత్రుల్లో గదులు సరిపోక చాలా మందిని ఒకే గదిలో ఉంచుతున్నారు. ప్రసవానికి ముందు, తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సరైన ల్యాబ్స్‌ లేకపోవడంతో రోగులు ప్రైవేటు డయగ్నస్టిక్‌ సెంటర్లకు వెళ్తున్నారు. వైద్యులు రాసిన మందులు కూడా ఆస్పత్రుల్లో లభించడం లేదు. ఇక ఆస్పత్రి పరిసరాలు చాలాచోట్ల అపరిశుభ్రంగా ఉన్నాయి. ప్రహరీలు లేకపోవడంతో పందులు, పశువులు ఆసుపత్రి ప్రాంగణంలోకి వస్తున్నాయి. టాయిలెట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.


ప్రసవాల సంఖ్య డబుల్‌!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో 72 పీహెచ్‌సీలు, తొమ్మిది కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులున్నాయి. 12 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దీంతోపాటు ఆదిలాబాద్‌లో రిమ్స్‌ వైద్య కళాశాల ఉంది. కేసీఆర్‌ కిట్‌ కంటే ముందు ఆదిలాబాద్‌ రిమ్స్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, ఉట్నూర్‌తోపాటు కొన్ని పీహెచ్‌సీల్లో మాత్రమే ప్రసవాలు జరిగేవి. డిసెంబర్‌ 2016 నుంచి మే 2017 వరకు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,837 జరిగాయి. కేసీఆర్‌ కిట్‌ ప్రారంభమైన తర్వాత జూన్‌ నుంచి 2018 జనవరి వరకు 18,663 ప్రసవాలు జరిగాయి.
 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్‌ కిట్ల పథకం ప్రవేశపెట్టక ముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరు నెలల కాలంలో 5,432 ప్రసవాలు జరిగాయి. కిట్ల పథకం ప్రవేశపెట్టిన ఆరు నెలల కాలంలో 10,572 ప్రసవాలు జరిగాయి. 10,278 మందికి కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేశారు.
 కరీంనగర్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రారంభానికి ముందు ఆరు నెలల్లో 6,915 ప్రసవాలు జరిగాయి. కేసీఆర్‌ కిట్‌ ప్రారంభం తర్వాత 15,353 ప్రసవాలు జరిగాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ అమలుకు ఆరు నెలల ముందు 16,108 ప్రసవాలు జరగ్గా.. తర్వాత ఆరు నెలల్లోనే 31,012కు చేరాయి.
నిజామాబాద్‌ జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ ప్రారంభం కాకముందు ఆరు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8,668 ప్రసవాలు జరిగాయి. కేసీఆర్‌ కిట్‌ ప్రారంభమైన 2017 జూన్‌ నుంచి వాటి సంఖ్య 10,409కి పెరిగింది.
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 108 ప్రసవాలు జరిగాయి. కేసీఆర్‌ కిట్‌ తర్వాత ఈ సంఖ్య 257కు పెరిగింది. భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కిట్‌ అమలుకు ముందు 2,400 కాన్పులు జరగ్గా.. కిట్‌ తర్వాత ఆ సంఖ్య 4,850కు చేరింది.
ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో ప్రభుత్వాసుపత్రుల్లో డిసెంబర్‌ 2016 నుంచి మే 2017 వరకు 15,648 ప్రసవాలు జరిగాయి. కేసీఆర్‌ కిట్‌ ప్రారంభమైన తర్వాత జూన్‌ 2017 నుంచి 2018 జనవరి వరకు 24,817 ప్రసవాలు జరిగాయి.
 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్‌ కిట్ల పథకం అమలుకు ఆర్నెల్ల ముందు ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం 7,377 ప్రసవాలు మాత్రమే జరిగాయి. ఈ పథకం తర్వాత ఆ  సంఖ్య 14,883కు చేరింది.


వైద్య సిబ్బంది ఏరీ?
 ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 182 వరకు వైద్య పోస్టులు ఉండగా.. అందులో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గర్భిణిలు, రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు.
 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,760 వైద్యులు, పారా మెడికల్, ఇతర సిబ్బంది పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం 2,098 మంది పనిచేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. అన్ని కలిపి 206 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది.
 కరీంనగర్‌ జిల్లాలో నర్సింగ్‌ సిబ్బందితోపాటు సపోర్టింగ్‌ పారా మెడికల్‌ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే 28 మంది స్టాఫ్, నర్సులు అవసరం ఉంది. ప్రసవాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఇద్దరు చేయాల్సిన డ్యూటీని ఒక్కరే చేయాల్సి వస్తోంది.
 ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వివిధ విభాగాల్లో మొత్తం 186 సిబ్బందికిగాను 144 మందే ఉన్నారు. వీరిలో 46 మంది కాంట్రాక్టు ఉద్యోగులు. 84 ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీ. స్టాఫ్‌ నర్సులు 80 మందికి 58 మంది, హెడ్‌స్టాఫ్‌ నర్సులు 8 మందికి నలుగురు, 16 మంది ఫార్మసిస్టులకు 9 మంది పనిచేస్తున్నారు.
 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రి, ఆరు కమ్యూనిటీ హెల్త్‌ ఆరోగ్య కేంద్రాల్లో 12 మంది స్త్రీ వైద్యనిపుణులు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరే పనిచేస్తున్నారు. 36 మంది స్టాఫ్‌ నర్సుల కొరత ఉంది.  
 ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 8 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి


ప్రైవేటులో 40 వేలు అయితుండే..
మాది తాబూరు మండలం యాదిరెడ్డి పల్లి. ప్రైవేటుగా అయితే రూ.40 వేల పైనే అయితుండే. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేసి డబ్బులు కూడా ఇస్తున్నరు. కేసీఆర్‌ కిట్‌ల వస్తువులు బాగున్నయి. 102 వాహనంలో ఉచితంగా ఇంటికి పంపించారు. – జయమ్మ, లబ్ధిదారు తల్లి, యాదిరెడ్డిపల్లి, నాగర్‌కర్నూల్‌ జిల్లా

బెడ్‌షీట్స్‌ మార్చడం లేదు!
ప్రతి రోజు ఆస్పత్రుల్లో బెడ్‌షీట్స్‌ మార్చాలని, రోజూ ఓ రంగు బెడ్‌షీట్స్‌ వేయాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. కానీ చాలా ఆస్పత్రుల్లో ఈ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. దీంతో ప్రసవానికి వచ్చేటప్పుడే గర్భిణులు వెంట సరిపోను బెడ్‌షీట్స్‌ తెచ్చుకుంటున్నారు.

గతంలో ఒక్కటీ  జరగలేదు..
ఇది నల్లగొండ జిల్లా వేములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. గతంలో ఇక్కడ ఒక్క డెలివరీ కూడా నమోదు కాలేదు. కేసీఆర్‌ కిట్‌ వచ్చాక ఇప్పటివరకు 28 ప్రసవాలు జరిగాయి. కానీ ఈ ఆస్పత్రిలో ఒకే ఒక్క వైద్యుడు ఉండడం గమనార్హం.

ఆనందంగా ఉంది
కేసీఆర్‌ కిట్‌ను ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. దీంతోపాటు కానుక అందజేశారు. కానీ ఆస్పత్రిలో సౌకర్యాలు లేవు. డాక్టర్లు, నర్సులు తక్కువ ఉన్నరు. దవాఖానాలో పాత మంచాలు, మెత్తలు మారిస్తే బాగుంటది.     – మడావి సూర్యకళ, కేసీఆర్‌ కిట్‌ లబ్దిదారు, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement