ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,400 పోస్టుల భర్తీ | KCR review meeting on government hospitals posts | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,400 పోస్టుల భర్తీ

Published Thu, Apr 7 2016 2:19 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,400 పోస్టుల భర్తీ - Sakshi

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,400 పోస్టుల భర్తీ

 వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న 2,400 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ చక్రపాణిని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజావైద్యాన్ని మెరుగుపరచడానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడంతోపాటు ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు అధికారాలు, నిధులు బదలాయించినందున ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరులో గణనీయమైన మార్పు రావాలని సూచించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల మెడికల్ ఆఫీసర్లతో సమావేశమై ప్రజావైద్యాన్ని మెరుగుపరిచే అంశంపై కూలంకషంగా చర్చించాలని సీఎం ఆదేశించారు.

వివిధ విభాగాధిపతుల(హెచ్‌వోడీ)కు ఏడాదికి రూ. 2 కోట్లు, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు రూ. కోటి ఖర్చు పెట్టే అధికారం ఇచ్చినందున వారు జిల్లా పర్యటనలకు వెళ్లే సందర్భంలో అత్యవసరం అనుకున్న పనులను వెంటనే చేయించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు వెంటనే అధికారాలు బదిలీ చేయాలని, పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అందరు సూపరింటెండెంట్లకు ఆస్పత్రి నిర్వహణ నిధు లు ఖర్చు చేసే విషయంలో విచక్షణాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని ఆస్పత్రుల్లో కొత్త బెడ్స్, కొత్త బెడ్ షీట్స్, కొత్త పరుపులు వెంటనే కొనుగోలు చేయాలన్నారు.

ఆస్పత్రుల్లోనే మందులన్నీ ఇవ్వాలి..
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారు పేదలే కాబట్టి వారు మందులు బయట కొనకుండా ఆస్పత్రుల్లోనే అన్ని మందులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మందుల కొనుగోలు అధికారం కూడా సూపరింటెండెంట్లు, మెడికల్ ఆఫీసర్లకే ఇవ్వాలన్నారు. ఇందుకోసం రాష్ట్రస్థాయిలోనే రేట్ కాంట్రాక్టు నిర్ణయించాలన్నారు. తక్కువ ధరకు వస్తున్నాయనే కారణంతో నాసిరకం మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని సీఎం సూచించారు. మందుల సరఫరాకు జిల్లాకు రెండు కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు సమీప పట్టణంలో నివాసం ఉండే వెసులుబాటు కల్పించాలన్నారు. ఆస్పత్రి నిర్వహణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నెలకు రూ. లక్ష ఇస్తుందన్నారు.

వాటితో పీహెచ్‌సీల నిర్వహణ బాధ్యతను మెడికల్ ఆఫీసర్లు చేపట్టాలన్నారు. పీహెచ్‌సీల్లో కచ్చితంగా కుక్కకాటు, పాముకాటు, తేలు కాటుకు మందు ఉండాలని, ప్రతి పీహెచ్‌సీలో కచ్చితంగా రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులు బాగా మెరుగుపడాలని, మందులు ఉచితంగా ఇవ్వాలని సూచించారు. రోగ నిర్థారణ పరీక్షలు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నిర్వహించాలన్నారు. అవసరాలకు తగినట్లుగా సిబ్బందిని సర్దుబాటు చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అందే సేవల స్థిరీకరణ, బలోపేతం, ఏకీకరణపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఎంతమంది ఎంబీబీఎస్ చదివి బయటకు వస్తున్నారో.. అసలెంత మంది అవసరముందో శాస్త్రీయంగా అధ్యయనం చేయాలన్నారు.
 
మరోసారి తమిళనాడుకు వెళ్లండి
వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ మరోసారి తమిళనాడు వెళ్లి అక్కడి చట్టాలను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. వాటిలో ఉత్తమంగా ఉన్న వాటిని తెలంగాణలో అమలు చేయాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం బహుళ అంతస్తుల భవనం నిర్మించాలన్నారు. బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లను మాటిమాటికి బదిలీ చేయకుండా కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసేలా నిర్ణీత సమయం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఎంఈ రమణి, కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు, రోనాల్డ్‌రాస్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్, గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement