ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాం
రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు
- డయాలసిస్ కేంద్రాలు దేశానికి ఆదర్శం
- కేసీఆర్ కిట్లతో ప్రసవాలు పెరిగాయి
- ఇతర రాష్ట్రాలవారు అధ్యయనం చేస్తున్నారు
- సిరిసిల్లలో ఐసీయూ, బ్లడ్‌బ్యాంకు,ప్రసూతి విభాగం ప్రారంభం
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచామని, 70 ఏళ్లలో గత పాలకులు సాధించలేనిది మూడేళ్లలో సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఐసీయూ, బ్లడ్ బ్యాంకు, ప్రసూతి విభాగం, డయాలసిస్ కేంద్రాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డితో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఒక్కరోజే రూ.50 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టామ న్నారు. సిరిసిల్లలో నర్సింగ్ కాలేజీ, మాతా శిశు సంరక్షణ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశామని, ఏడాదిలోగా వీటిని పూర్తిచేసి మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభో త్సవం చేస్తామన్నారు.
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’అని పాట ఉందని, ఆ పాటను ఇప్పుడు ‘నేనూ వస్తా తల్లో.. సర్కారు దవాఖానాకు’.. అన్నట్లుగా మార్చా మని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్లతో సర్కారు ఆస్పత్రిల్లో ప్రసవాల సంఖ్య పెరిగిం దన్నారు. అమ్మఒడి పథకం ద్వారా బాలింత లకు రూ.13 వేల సాయం చేస్తున్నామని తెలిపారు. సర్కారు ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో మరింత మెరుగైన వైద్యసేవలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 40 కేంద్రాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇది దేశానికే ఆదర్శమన్నారు. ఇతర రాష్ట్రాల వారు దీనిపై అధ్యయనం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ దొరకడం సిరిసిల్ల ప్రజల అదృష్టం
వైద్య, ఆరోగ్యశాఖలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ ఐసీయూ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజారోగ్యంపై బుక్‌లెట్, కరపత్రాలు ముద్రించి ప్రజల్లో అవగాహన పెంచుతామని వివరించారు. అనవసర ఆపరేషన్లపై డీఎం అండ్ హెచ్‌వోల ద్వారా ప్రతినెలా నివేదికలు తెప్పిస్తున్నామని వివరించారు. ఎవరైనా డబ్బుల కోసం ఆపరేషన్లు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిరిసిల్లకు పీజీ డిప్లొమా కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ తక్కువ ధరలకే మందులు లభించే జనఔషధ కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక ల్యాబ్‌లను మహబూబ్‌నగర్‌లో ప్రారంభిస్తామని, తర్వాత సిరిసిల్ల జిల్లాలోనూ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేటీఆర్ సిరిసిల్లకు దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు.