బంక్‌లో తప్పిన పెను ప్రమాదం
► బైక్‌లో పెట్రోల్ నింపుతుండగా మంటలు
► రెండు మోటార్ సైకిళ్ల దగ్ధం
తుని రూరల్ : తుని మండలం తేటగుంట శివారు ఎర్రకోనేరు సమీపంలోని బంకులో ఆదివారం ఉదయం ఓ బైక్‌లో పెట్రోల్ నింపుతుండగా ట్యాంక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ షాక్ నుంచి తేరుకునే లోగానే మరో బైక్‌కు కూడా నిప్పంటుకుంది. రెండు బైక్‌లూ పూర్తిగా దగ్ధమయ్యాయి. బంకు సిబ్బంది, వాహనదారులు ధైర్యంచేసి కాలుతున్న రెండు బైక్‌లను దూరంగా లాక్కెళ్లడంతో పెను ప్రమాదం, ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని మంటలు విస్తరించకుండా అదుపు చేశారు. ఈ ఘటనలో రూ.మూడు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది.
ప్రమాదం జరిగింది ఇలా..
తుని మండలం ఎన్.చామవరానికి చెందిన నాగం భాస్కర్ ఈ నెల 18న జరిగే తన చెల్లెలి వివాహ శుభలేఖలు పంపిణీ చేసేందుకు ఎన్ఫీల్డ్ బైక్‌పై పయనమై ఎర్రకోనేరు వద్ద బంకులో పెట్రోల్ నింపుకునేందుకు ఆగాడు. ఆయన ఆదేశం మేరకు బంక్ ఉద్యోగి పుల్ ట్యాంక్ చేసేందుకు పెట్రోల్ గన్ను బైక్ ట్యాంకులోకి స్థిరంగా ఉంచేశాడు. అప్పటికే వాహనంలో కొంత పెట్రోల్ ఉండడంతో వేగంగా ట్యాంకు నిండి కిందికి కొంత ఒలికిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన భాస్కర్ వాహనాన్ని పక్కకు నెట్టివేసి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
అప్పటికే తన బైక్‌లో పెట్రోల్ నింపుకుని చిల్లర కోసం వేచి ఉన్న టి.తిమ్మాపురానికి చెందిన కట్టా శ్రీనిసరావు ఫ్యాషన్ ప్రొ వాహనంపై కాలుతున్న ఇన్ఫీల్డ్ పడింది. దీంతో రెండు వాహనాలూ దగ్ధమవసాగాయి. పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన బంకు సిబ్బంది, వాహనదారులు తెగించి రెండు వాహనాలను బంక్ బయటకు లాగేశారు. ఇదే సమయంలో అగ్నిమాపక వాహనం కూడా అక్కడకు చేరుకుంది. ఫైర్ ఆఫీసర్ కేవీ రమణ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాలుతున్న రెండు వాహనాలను చాకచక్యంగా బయటకు లాగకపోతే బంకులో మంటలు చెలరేగి పెను ప్రమాదం సంభవించేదని బంక్ నిర్వాహకుడు రాయపురాజు పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశామని రూరల్ హెడ్ కానిస్టేబుల్ బాబూరావు తెలిపారు.