PG medical Seat Replacement
-
కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది కొత్తగా 56 పీజీ వైద్యసీట్లు మంజూరయ్యాయి. 2020–21 విద్యా సంవత్సరం నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో ఒక్కో సీటు కోట్లు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ వైద్య కాలేజీల్లో పీజీ వైద్య సీట్లు పెంచడంపై వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పీజీ వైద్య సీట్లు పెరగాలంటే వసతులు కల్పిస్తేగానీ భారతీయ వైద్య మండలి మంజూరు చేసే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం మెడికల్ కాలేజీకి 41 సీట్లు మంజూరయ్యాయి. మరో 13 సీట్లు ఎస్వీ మెడికల్ కాలేజీ (తిరుపతికి)కి, మరో 2 సీట్లు గుంటూరు మెడికల్ కాలేజీకి మంజూరయ్యాయి. వీటిలో ఎక్కువ సీట్లు జనరల్ మెడిసిన్ కేటగిరీలో వచ్చాయి. వచ్చే ఏడాది మరో 120 సీట్లు 2021–22కి మరో 120 సీట్లకు దరఖాస్తు చేస్తున్నట్లు వైద్య విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ సీట్ల పెంపునకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వ్యయం చేస్తాయన్నారు. వివిధ కాలేజీల్లో స్పెషాలిటీ కోర్సుల కొరతను బట్టి సీట్లకు దరఖాస్తు చేస్తున్నామన్నారు. పీజీ వైద్య సీట్లు పెరగడంవల్ల వసతులతో పాటు, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. -
పీజీ వైద్య సీట్ల భర్తీపై కొత్త వివాదం!
⇒ ఇంకా మొదలుకాని కౌన్సెలింగ్ ప్రక్రియ ⇒ పర్సంటైల్ విధానంపై ప్రైవేటు కాలేజీల అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్ల భర్తీపై కొత్త వివాదం నెలకొంది. దీంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన సీట్ల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. పీజీ సీట్ల భర్తీకి అమల్లో ఉన్న పర్సంటైల్ విధానంపై ప్రైవేటు కాలేజీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతమున్న నిబంధనలను సడలించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టే పరిస్థితి కన్పించట్లేదు. రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఇప్పటికే నీట్ ప్రవేశపరీక్ష నిర్వహించి ఫలితాలు కూడా వెల్లడించారు. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లతో పాటు ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను ప్రభుత్వమే కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనుంది. కౌన్సెలింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. పీజీ సీట్ల భర్తీకి గతేడాది వరకు రాష్ట్రస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. ఇందులో జనరల్ కేటగిరీకి చెందినవారు కనీసం 50 శాతం, ఇతర వర్గాలు 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హత సాధించేవారు. వారికి వచ్చిన ర్యాంకుల వారీగా సీట్లను కేటాయించేవారు. అయితే ఈ ఏడాది నుంచి నీట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా జనరల్ కేటగిరీ వారు నీట్లో కనీసం పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. ఈ విధానంలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చినా ఒక్కోసారి అర్హత సాధించడం కష్టమవుతుంది. పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల్లో మెరుగైన మార్కులు సాధించిన మొదటి 50 శాతం మందే అర్హత సాధించిన వారవుతారు. మిగిలిన 50 శాతం అభ్యర్థులు అనర్హులుగా మిగిలిపోతారు. ఈ విధానాన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. పర్సంటైల్ శాతాన్ని 50 నుంచి 35 శాతానికి కుదించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.