Physicians
-
వైద్యుల కొరత లేకుండా చర్యలు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, సిబ్బంది కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 39 వేల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. వీటిలో ఇప్పటికే 27 వేల పోస్టులు భర్తీ కాగా మిగిలిన పోస్టులు ఈ నెలాఖరుకు భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుతం 11 మెడికల్, రెండు డెంటల్ కళాశాలలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 23 బోధనాస్పత్రులు ఉన్నాయి. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం నిత్యం వేల సంఖ్యలో బోధనాస్పత్రులకు వస్తుంటారు. గత టీడీపీ ప్రభుత్వం ఈ ఆస్పత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పెరిగిన జనాభా, రోగుల తాకిడికి అనుగుణంగా కొత్త పోస్టులు సృష్టించడం కాదు కదా.. ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. విధుల్లో నిర్లక్ష్యం.. 20 మంది తొలగింపు ఈ నేపథ్యంలో బోధనాస్పత్రులను పటిష్టంగా తీర్చిదిద్దుతోన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందులో మానవ వనరులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వాటిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. సుమారు 70 మంది వైద్యులు విధులకు హాజరవ్వకుండా సెలవుల్లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో 50 మంది తిరిగి విధుల్లో చేరారు. మరో 20 మందిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ పోస్టులను ఖాళీలుగా గుర్తించి పదోన్నతులు, ప్రత్యక్ష ఎంపిక ద్వారా వాటిని భర్తీ చేస్తోంది. బోధనాస్పత్రుల్లో 9 వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు 2019 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం బోధనాస్పత్రుల్లో 9 వేలకు పైగా> పోస్టుల భర్తీ చేపట్టింది. వీటిలో ఖాళీగా ఉన్న 1,952 పోస్టులతోపాటు 2,190 కొత్త పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నియామకాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నియామకాలతో ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న వైద్యుల కల నెరవేరింది. నిబంధనల ప్రకారం.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పనిచేసినవారు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు, అసోసియేట్ ప్రొఫెసర్‌గా నాలుగేళ్లు పనిచేసినవారు ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు. అయితే అర్హత ఉన్నప్పటికీ పోస్టులు లేకపోవడం, పోస్టులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వీరంతా పదోన్నతుల కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఇటీవల వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు సృష్టించడంతో వందల మంది అర్హులకు పదోన్నతులు లభిస్తున్నాయి. ఇలా పదోన్నతుల ద్వారా ప్రస్తుతం 161 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటిలో 51 పోస్టులు కొత్తగా సృష్టించినవే కావడం గమనార్హం. అదే విధంగా 421 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తుండగా వీటిలో 187 కొత్త పోస్టులే. ఇలా పదోన్నతులతో ఖాళీ అయ్యే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో భర్తీ చేస్తోంది. ప్రస్తుతం 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపడుతుండగా వీటిలో 150 కొత్తగా సృష్టించినవే. ఏకకాలంలో చేపడుతున్నాం.. పదోన్నతులు, నియామకాలను ఏకకాలంలో చేపడుతున్నాం. పదోన్నతులు పూర్తి కాగానే కొత్తగా ఎంపికైనవారికి పోస్టింగ్‌లు ఇస్తాం. ఈ నెలాఖరుకు మొత్తం ప్రక్రియ ముగిస్తాం. ఇకపై బోధనాస్పత్రుల్లో వైద్యులు, వైద్యేతర సిబ్బంది కొరత ఉండదు. – డాక్టర్ రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
డయాప్రెమాటిక్ హెర్నియా.. హైరిస్క్ సర్జరీ సక్సెస్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): అరుదుగా వచ్చే డయాప్రెమాటిక్ హెర్నియాకు విజయవాడ జీజీహెచ్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. కార్పొరేట్, ప్రైవేటు వైద్యులు సైతం హైరిస్క్ అని చెప్పిన అత్యంత అరుదైన శస్త్ర చికిత్సను నైపుణ్యం కలిగిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల బృందం సుసాధ్యం చేసి చూపించారు. విజయవాడ జీజీహెచ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్, సర్జరీలో పాల్గొన్న వైద్యులు శస్త్ర చికిత్స వివరాలను తెలియజేశారు. అత్యంత అరుదు.. ప్రతి ఒక్కరికీ పొట్టకి, ఊపిరితిత్తులకు మధ్య కండరం గోడలా ఉంటుంది. ఆ కండరానికి చిల్లు పడటాన్ని డయాప్రెమాటిక్ హెర్నియా అంటారు. గోడలా ఉన్న కండరానికి ఎడమ వైపున చిల్లు పడటం సహజం, కుడివైపున చిల్లుపడటం అత్యంత అరుదు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన వి.జోగిరాజు (48) ఈ రకమైన సమస్యతో బాధ పడుతున్నాడు. ఇతడికి కుడివైపున చిల్లు పడటంతో ఊపిరితిత్తుల్లోకి లివర్, పేగులు చొచ్చుకుని వెళ్లాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఛాలెంజ్‌గా తీసుకుని.. పలు ప్రైవేటు ఆస్పత్రులు తిరిగిన జోగిరాజు అక్కడి వైద్యులు హై రిస్క్ కేసు అని చెప్పడంతో చివరగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న ప్రభుత్వ వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకు వెళ్లిన లివర్, చిన్న పేగులను సాధారణ స్థితికి తీసుకొచ్చి, కండరానికి మెస్ వేసి రిపేరు చేసినట్లు సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్ తెలిపారు. దీంతో రోగి పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కందుల అప్పారావు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యశ్రీ అనస్థీషియన్ డాక్టర్ గీతాపద్మజ తదితరులు పాల్గొన్నారు. దేవుళ్లలా కాపాడారు.. వారికి నేను పాదాభివందనం చేస్తున్నా. అనేక ఆస్పత్రులు తిరిగాను. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రులకూ వెళ్లాను. అక్కడ ఆపరేషన్‌కు రూ.5 లక్షలు అవుతాయని, అయినా హై రిస్క్ అని చెప్పారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన నన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు దేవుళ్లలాగా కాపాడారు. ఇక్కడి వైద్యులు, సిబ్బంది సేవలు చూశాక ప్రభుత్వాస్పత్రిలో సరిగా చూడరనే భావన తప్పని తెలిసింది. – జోగిరాజు, సర్జరీ చేయించుకున్న వ్యక్తి -
విధులకు రాని వైద్యులకు నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో విధులకు రాని వైద్యుల విషయం చర్చనీయాంశంగా మారింది. వారంలో రెండు మూడు రోజులే వచ్చి మిగతా రోజులకు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నవారు ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్టు తేలింది. దీనిపై ఆరా తీస్తున్న కొద్దీ విస్మయపరిచే అంశాలు వెల్లడవుతున్నాయి. తాజాగా కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో 20 మంది వైద్యులకు నోటీసులు ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు లేకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి విధులకు వచ్చినట్టు కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరిలో బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ విభాగాల ప్రొఫెసర్లు కూడా ఉండటం గమనార్హం. విధులకు రాకుండా రిజిస్టర్లలో సంతకాలు సృష్టిస్తున్నవారు 48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కర్నూలు కలెక్టర్ మెమో జారీ చేశారు. నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరు, కడప తదితర కాలేజీల్లో బయోమెట్రిక్ వేయకుండా విధులకు వచ్చినట్టు చూపిస్తున్నవారి విషయం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల దృష్టికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్యువల్ (రిజిస్టర్) సంతకాలు కుదరవని, బయోమెట్రిక్ హాజరు ఉంటేనే వేతనం ఇవ్వాలని డీఎంఈ ఆదేశించారు. ఇప్పటికీ చాలా చోట్ల కొంతమంది వైద్యులు బయోమెట్రిక్ హాజరు కోసం నమోదు కూడా చేయించుకోలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. చాలామంది వైద్యులు ఎలాంటి సమాచారమూ లేకుండా విధులకు గైర్హాజరవుతున్నారు. -
విశాఖలో అరుదైన శస్త్రచికిత్స
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ హెల్త్‌సిటీలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు కోమాలో ఉన్న మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి ఆమెను బతికించారు. డాక్టర్ శివశంకర్ దలై ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజమహేంద్రవరం దరి సీతానగరానికి చెందిన సీహెచ్ సుబ్బలక్ష్మి (50) తీవ్ర తలనొప్పితో కోమాలోకి వెళ్లిపోయారు. ఆమెను కుటుంబ సభ్యులు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ శివశంకర్ దలై ఆమెకు పరీక్షలు నిర్వహించి.. దమనుల్లో వాపు వచ్చి రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. ఆమె అనిరుజం అనే వ్యాధికి గురైందని, దానివల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఆమెకు వెంటనే ‘న్యూ ఫ్లో డైవర్షన్ ట్రీట్మెంట్’ పేరుతో ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేసి.. మెదడులో రక్తస్రావాన్ని నియంత్రించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె మెదడులో రక్త ప్రసరణ క్రమపద్ధతిలో జరుగుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి శస్త్రచికిత్సను మొదటిసారిగా మెడికవర్ ఆస్పత్రిలో నిర్వహించినట్టు తెలిపారు. ఆపరేషన్ జరిగిన 96 గంటల్లోనే రోగి కోలుకుందన్నారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి బంధువులు ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రాణాలను పణంగా పెట్టి..
కారంపూడి (మాచర్ల): కోవిడ్ నుంచి ప్రజలను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరం విధుల్లో నిమగ్నమవుతూ వైద్యోనారాయణోహరి అన్న పదానికి నిజమైన నిర్వచనంలా నిలుస్తున్నారు అనేక మంది వైద్యులు. కోవిడ్ రోగుల సేవలో ఉండగా, తమకూ వైరస్ సోకినా..కోలుకుని తిరిగి రోగుల సేవకు పునరంకితమయ్యారు గుంటూరు జిల్లా కారంపూడి, గాదెవారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు బాలకిషోర్ నాయక్, ఆంజనేయులు నాయక్. డాక్టర్ బాలకిషోర్ నాయక్‌కు భార్య, కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇంట్లో పసివాడు, పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులు ఉన్న నేపథ్యంలో తమ వల్ల వైరస్ వారికి సోకుతుందేమోననే భయంతో ఆయన కుటుంబానికి దూరంగానే గడుపుతున్నారు. డాక్టర్ ఆంజనేయులు నాయక్‌కు భార్య, ఇద్దరు పసి పిల్లలు ఉన్నారు. అతడు కూడా కుటుంబానికి దూరంగా ఉంటూనే తన విధుల్లో నిమగ్నమవుతున్నారు. పిల్లలను చూడాలనుకుంటే దూరం నుంచే చూడటం తప్ప దగ్గరకు తీసుకోలేని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో ప్రజాసేవలో నిమగ్నమవడంలో ఉన్న ఆనందం మరొకటి లేదంటున్నారు. తమకు కరోనా సోకిన సమయంలో తమ కుటుంబాలు పడిన టెన్షన్, తాము అనుభవించిన అనారోగ్య పరిస్థితి ఎవరికీ రాకూడదనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని వారు చెబుతున్నారు. -
ప్రాణాలు పోతున్నా... ఏమీ చేయలేకపోతున్నాం
రేయింబవళ్లు నిద్రాహారాలు మానుకొని పని పని పని.. మండు వేసవిలో శరీరాన్ని పీపీఈ కిట్లతో బంధించి కోవిడ్ రోగులకు చికిత్స అందివ్వాలి. కళ్లముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. సెకండ్ వేవ్ వచ్చేసరికి భారత్‌లో వైద్యులు శారీరకంగా అలసిపోతున్నారు. మానసికంగా ఆందోళనకు లోనవుతున్నారు. కన్నీరు కారుస్తూ ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైద్యులు పెడుతున్న పోస్టులు, వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అవేంటో చూద్దాం.. సూపర్ హీరోలం అనుకోవద్దు మేము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. బాధతో హృదయం ముక్కలవుతోంది. 34 ఏళ్ల యువకుడు వెంటిలేటర్ మీద చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. పరిస్థితి మా చేతులు కూడా దాటేస్తోంది. అందుకే అందరూ మాస్కు తప్పనిసరిగా వేసుకోండి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోండి – డాక్టర్ తృప్తి గిలాడా, ముంబై నా ఫోన్ రింగ్ ఆగడం లేదు ప్రతీ అయిదు నిముషాలకు ఒకసారి నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. ఆసపత్రిలో బెడ్స్ కోసం పేషెంట్లు నిరంతరం కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు. వారు దీనంగా బెడ్ కోసం అడుగుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలీడం లేదు. ముంబైలో బెడ్స్ ఖాళీ లేవు. అందుకే ఆస్పత్రి అవసరం రాకుండా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ పింటో, ముంబై ముందు జాగ్రత్తలు లేవు కరోనా ఫస్ట్ వేవ్‌కి, సెకండ్‌వేవ్‌కి మధ్య కొంత సమయం దొరికింది. అయినా ప్రభుత్వాలు, ప్రజలు కూడా సన్నద్ధతపై దృష్టి పెట్టలేదు. ఢిల్లీ కూడా మరో మహారాష్ట్రలా మారడానికి ఎన్నో రోజులు పట్టదు. ప్రభుత్వాల అలసత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చింది. కళ్ల ముందే కోవిడ్ రోగులు ఊపిరాడక మరణిస్తూ ఉంటే తట్టుకోవడం కష్టంగా ఉంది – డాక్టర్ రేష్మా తివారి బసు, గుర్గావ్ ప్రాణాలు పోతున్నా... ఏమీ చేయలేకపోతున్నాం నా కెరీర్ మొత్తంలో ఇలాంటి దుస్థితి చూడలేదు. కళ్ల ముందే ఆక్సిజన్ లేక రోగులు ప్రాణాలొదిలేస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతున్నాం. మేమూ మనుషులమే మాకూ భావోద్వేగాలుంటాయి. శారీరకంగా, మానసికంగా అలిసిపోతున్నాం. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్.. అందరూ మాస్కులు వేసుకోండి. – డాక్టర్ దీప్శిఖ ఘోష్, ముంబై అందరం కలిసి నిరసనకు దిగుదాం దేశవ్యాప్తంగా భారీ జనసందోహం హాజరవుతున్న సమావేశాలకు వ్యతిరేకంగా మనందం నిరసనకు దిగుదాం. డాక్టర్లు, నర్సుల అసోసియన్లు అందరూ కలిసి రండి. మన దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోతోంది. కేసులు సునామీలా ముంచేస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరి చేతుల్లోనూ ఏమీ ఉండదు. – డాక్టర్ పారల్ ఎం శర్మ, ఢిల్లీ -
పగిలిన గుండె రక్తనాళానికి చికిత్స
కర్నూలు(హాస్పిటల్): రక్తనాళంలో రక్తం గడ్డకట్టి రక్తనాళం చిట్లి గుండెపోటు వచ్చిన వ్యక్తికి కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు యాంజియోప్లాస్టీ ద్వారా అరుదైన చికిత్స చేసి ప్రాణం కాపాడారు. ఆదివారం కార్డియాలజిస్టు డాక్టర్ చింతా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘గిద్దలూరుకు చెందిన నాగార్జునరెడ్డి(32)కి గతేడాది నవంబర్ 12న ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు రక్త పరీక్షల్లో గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించారు. దీంతో అతను అదే రోజు కిమ్స్ హాస్పిటల్‌కు వచ్చాడు. యాంజియోగ్రామ్ చేయగా రక్తనాళం పగిలినట్లు తేలింది. ఇది చాలా అరుదైన కేసు. ప్రపంచంలోనే 20వ కేసుగా పరిగణించవచ్చు. పైగా మిగతా 19 కేసుల కంటే భిన్నమైనది. రక్తనాళం పగలడంతో రక్తం గుండె చుట్టూ చేరుకుని ఒత్తిడికి గురిచేసింది. ఆ సమయంలో రోగి బీపీ తగ్గి వెంటనే మరణించే అవకాశం ఉంది. ఇతనిలో ప్రమాదాన్ని సాధ్యమైనంత తొందరంగా గుర్తించి పెర్క్యుటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరి యాంజియోప్లాస్టీ చేసి రక్తప్రవాహాన్ని ఆపి ప్రాణాలు కాపాడాం. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడు’ అని వివరించారు. -
ఊపిరితీస్తున్న సైటోకైన్స్ ఉప్పెన
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా తీవ్రతతో ఆసుపత్రుల్లో చేరేవారిలో కొందరు వెంటిలేటర్‌పైకి వెళ్తుంటారు. వారిలో కొందరు సాధారణస్థితికి చేరుకుంటారు. ఇక నేడో రేపో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించొచ్చని వైద్యులూ నిర్ధారణకు వస్తారు. కానీ, ఒక్కసారిగా తలెత్తే అనారోగ్య సమస్యలతో కుప్పకూలి, ప్రాణాలు కోల్పోతుంటారు’ అని వైద్య నిపుణులు చెబుతున్నా రు. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలోనూ అలాగే జరిగిందని వైద్యులు విశ్లేషిస్తున్నారు. కరోనా నుంచి కోలుకొని నెగెటివ్ వచ్చినా, ఎక్మో చికిత్స చేసినా అంతర్గత అవయవాలపై వైరస్ చేసిన దాడితో మృతిచెంది ఉంటారని వైద్యులు అంటున్నారు. కొందరిలో సైటోకైన్స్ ఉప్పెనలా ఉత్పత్తి కావడం వల్ల కిడ్నీ లేదా ఊపిరితిత్తుల్లో న్యుమో నియా లేదా గుండె వైఫల్యం వంటివి సంభవిస్తాయంటున్నారు. వెంటిలేటర్ల మీదకు వెళ్లేసరికే సెకండరీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కోవిడ్ నుంచి మొదట్లో కోలుకున్నా తర్వాత సెకండరీ సైటోకైన్స్ ఉత్పత్తి అవుతాయి. కొందరిలో బాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తాయని చెబుతున్నారు. సైటోకైన్స్ స్ట్రోమ్ అంటే.. ఏదైనా వైరస్ శరీరంలో ప్రవేశించాక దాన్ని నియంత్రించేందుకు శరీరకణాల నుంచి సైటో కైన్స్ అనేవి ఏర్పడతాయి. కరోనాపైనా ఇవే పోరాడుతాయి. అంటే కరోనా నుంచి రక్షించడంలో సైటోకైన్స్దే ప్రధాన పాత్ర. అయితే కరోనా ప్రభావానికి తీవ్రంగా గురైన వారిలో శరీరం ఒక్కోసారి అతిగా స్పందిస్తుంది. దీంతో సైటోకైన్స్ అధికంగా శరీర కణాల నుంచి ఉత్పత్తవుతాయి. వైరస్ నుంచి రక్షించాల్సిన సైటోకైన్సే ఉప్పెనలా ఉత్పత్తి అయి ఇతర అవయవాలపై దాడి చేసి వాటి పనితీరును దెబ్బతిస్తాయి. దీన్నే సెకండరీ సైటోకైన్స్ స్ట్రోమ్ అంటారు. అప్పుడు కోలుకున్నట్టే కనిపించినవారు హఠాత్తుగా కుప్పకూలుతుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో కోలుకున్నాక రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. దీంతో గుండె, ఊపిరితిత్తుల్లో ఏదో ఒకటి తీవ్ర ప్రభావానికి గురవుతుందని వెల్లడిస్తున్నారు. ఎక్మో చికిత్స అంటే.. ఎస్పీ బాలుకు ఎక్మో చికిత్స చేశారు. దీనివల్లే ఆయన ఇన్నాళ్లు ఉండగలిగారు. ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబరేన్స్ ఆక్సిజనైజన్ (ఎక్మో) అనేది అత్యాధునిక వైద్య విధానం. కీలక గడియల్లో ఊపిరితిత్తుల పని, గుండె పనిని కూడా బయటే పూర్తిచేసి శరీరాన్ని నిలబెట్టే సంక్లిష్టమైన ప్రత్యేక చికిత్సా విధానమే ఇది.. వెంటిలేటర్‌తో కూడా ఉపయోగం లేని సందర్భాల్లో రోగి ప్రాణ రక్షణ కోసం ‘ఎక్మో’చికిత్స చేస్తారు. రోగి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా బయటకు తీసుకొచ్చి, ఎక్మో అనే యంత్రంలో శుద్ధి చేసి, తిరిగి ఆ మంచి రక్తాన్ని శరీరంలోకి ఎక్కించడమే దీని ప్రత్యేకత. దీంతో గుండె, ఊపిరితిత్తులు రెండింటికీ పూర్తి విశ్రాంతి చిక్కి అవి త్వరగా కోలుకుంటాయి. అయితే ఒక్కోసారి ఈ చికిత్స వల్ల రక్తస్రావం, రక్తపు గడ్డలు ఏర్పడటం, రక్త నాళాలు చిట్లిపోవటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇన్ఫెక్షన్లూ రావచ్చు. అలాగే రక్తాన్ని బయటే శుద్ధి చేస్తుండే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ప్లేట్లెట్లు, తెల్లరక్తకణాల వంటివి దెబ్బతింటాయి. సెకండరీ సైటోకైన్స్ స్ట్రోమ్‌తో ముప్పు.. కొంతమందికి సెకండరీ సైటోకైన్స్ స్ట్రోమ్ వల్ల కిడ్నీ లేదా ఊపిరితిత్తుల్లో న్యుమోనియా, గుండెలో సమస్యలు వస్తాయి. వెంటిలేటర్ల మీదకు వెళ్లేసరికే సెకండరీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కోవిడ్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గి బహుళ సమస్యలు వచ్చే ప్రమాదముంది. బాలసుబ్రహ్మణ్యానికి చివరి రెండు, మూడ్రోజుల్లో హై ఫీవర్ వచ్చినట్లు సమాచారం. దీంతో డ్యామేజీ జరిగి ఉండొచ్చు. – డాక్టర్ శేషగిరిరావు, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం వల్లే.. ఊబకాయం, వయసు మీద పడిన వారిలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువై ఆసుపత్రిపాలైతే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. పైగా ఎస్పీ బాలు ఎక్మో నుంచి బయటకు రాలేదు. అయినా ఈ పరిస్థితి వచ్చిందంటే ఊపిరితిత్తులు తీవ్రంగా డ్యామేజీ అయి ఉండాలి. – రాకేశ్ కలపాల, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆలస్యమైతే సమస్యే.. మొదట్లోనే ఆసుపత్రికి వచ్చినవారు రికవరీ అవుతున్నారు. ఆలస్యమైతేనే సమస్యలు వస్తున్నాయి. ఎస్పీ బాలు ఆసుపత్రికి వచ్చాక ఎక్మో చికిత్స వరకు వెళ్లారు. బ్లడ్ క్లాట్, ఊపిరితిత్తుల్లో సెకండరీ ఇన్ఫెక్షన్ రావచ్చు. –డాక్టర్ రాజు, పల్మొనాలజిస్ట్, హైదరాబాద్ సైటోకైన్స్ స్ట్రోమ్ వల్లే.. సైటోకైన్స్ స్ట్రోమ్ వల్ల సమస్యలు వస్తాయి. దాంతో కిడ్నీ, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. బాలసుబ్రహ్మణ్యాన్ని ఎక్మో మెషీన్‌పై కూడా పెట్టారు. కొందరు వైరస్ నుంచి బయటపడినా ఇతర వ్యాధులకు గురవుతారు. రికవరీ అయినా కొందరిలో ఇలాంటివి అరుదుగా వస్తాయి. – కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ చనిపోయేవరకూ బాగానే ఉంటారు.. బాలు కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల ఆయనకు ఎక్మో చికిత్స చేశారు. కానీ ఎక్మోపై రికవరీ తక్కువ. సాధారణంగా చెప్పుకోవాలంటే కొందరి విషయంలో రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. దీంతో కిడ్నీ, గుండె ఫెయిల్యూర్ అవుతుంది. కరోనా బాధితులు కొందరు చనిపోయే ముందు వరకు ఫోన్ మాట్లాడినవారున్నారు. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి -
అంచనా లోపమే శాపం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా బెంబేలెత్తిస్తోంది. గత ఐదు నెలల్లో ఈ వైరస్ కారణంగా వంద మందికి పైగా వైద్యులు మరణించారు. కరోనా పట్ల అవగాహన లేక ఆ మహమ్మారిని చిన్న విషయంగా భావించడం, తగు రక్షణ చర్యలు తీసుకోకపోవడం, భౌతిక దూరం వంటి మార్గదర్శకాలను విస్మరించడం, పీపీఈ కిట్లను ఉపయోగించడంలో వైఫల్యం, నిరూపితం కాని మందులు తీసుకోవడం వంటివి ఆయా డాక్టర్ల మరణాలకు కారణమని తేలింది. అలాగే ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు కలిగి ఉండటం, ఆసుపత్రి వెలుపల తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా కారణమని నిర్ధారించారు. ‘ఏ హండ్రెడ్ లైవ్స్ లాస్ట్: డాక్టర్ డెత్స్ ఇన్ ఇండియా టైమ్స్ ఆఫ్ కోవిడ్–19’అనే అంశంపై ఓ అధ్యయనం జరిగింది. దానిపై డాక్టర్ రాజీవ్ జయదేవన్ అనే నిపుణుడు దేశంలో 108 మంది డాక్టర్ల మరణాల నుంచి నేర్చుకున్న పాఠాల పేరుతో తాజాగా ఒక అధ్యయన పత్రాన్ని విడుదల చేశారు. దాని ప్రకారం మరణించిన వారి సగటు వయసు 55గా ఉండటం గమనార్హం. ఒక 22 ఏళ్ల యువ వైద్యుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఇక చనిపోయిన నర్సుల సగటు వయస్సు 42.7 ఏళ్లు. వారిలోనూ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ డాక్టర్ల మరణాలకు కారణమేంటి? ఇక డాక్టర్ల మరణాలకు తరచుగా పీపీఈ కిట్ల వాడకంపైనే దృష్టి పెట్టి చర్చిస్తాం. కానీ అనేక కారణాలున్నాయని గుర్తించాలి. పై వాటితోపాటు ఇతర అంశాలు కూడా కారణాలుగా నిలుస్తున్నాయి. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ, ట్రయాజ్, క్రౌడ్ కంట్రోల్, టెలిమెడిసిన్, ఆడిట్స్, పీపీఈల లభ్యత, వాటి నాణ్యత, వెంటిలేషన్ సౌకర్యం లేని భవనాల్లో వైద్య సేవలు అందించడం, ఏరోసోల్ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకునే చర్యలు కూడా కారణంగా ఉంటున్నాయి. అలాగే వారిలో ఏర్పడే మానసిక ఒత్తిడిని సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం కూడా కనిపిస్తుంది. ► కరోనా రోగికి ఆపరేషన్ చేయడం వల్ల సర్జన్, అనస్థీషియన్, ఇతర సహాయకులకు కరోనా వ్యాప్తి ప్రమాదం ఉంటుంది. ► లక్షణాలు లేని కరోనా పాజిటివ్ సహోద్యోగి నుంచి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సహోద్యోగులు దగ్గరగా ఉండి మాట్లాడేటప్పుడు ఇది జరుగుతుంది. ► ఆపరేషన్ థియేటర్లలో నిర్దిష్ట ప్రొటోకాల్‌ను పాటించడం లేదు. అధిక రిస్క్ ఎక్స్పోజర్ ప్రాంతాల్లో సిబ్బంది సంఖ్యను అపరిమితంగా ఉంచడం వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది. ► రోగులకు నిర్దిష్ట సమయాలు లేవు. ఇతర వైద్య సిబ్బంది భౌతిక దూరం, చేతి పరిశుభ్రతను అమలు చేయడం లేదు. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉండటం లేదు. కన్సల్టింగ్ గదులు ఇరుకుగా, తక్కువ వెంటిలేషన్‌తో ఉంటున్నాయి. ► నర్సులు, ఫార్మసిస్ట్‌లు, సాంకేతిక నిపుణులు, ఫిజియోథెరపిస్టులు, అంబులెన్స్ డ్రైవర్లు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది, బిల్లింగ్, రిసెప్షన్ సిబ్బంది ఇతరుల నుంచి వైరస్ వ్యాప్తికి గురవుతుంటారు. ► వైద్యులు తమ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని రక్షించడానికి నాయకత్వ పాత్ర పోషించడంలో చాలా చోట్ల వైఫల్యం కనిపిస్తుంది. ఫోన్లలో మాట్లాడటం, వీడియో కాల్ ద్వారా వారికి తగిన ఆదేశాలు ఇవ్వడంలో వైఫల్యం కనిపిస్తుంది. ► కొన్ని చోట్ల సుదీర్ఘ సమావేశాలు జరుగుతున్నాయి. అత్యంత ఇరుకైన గదుల్లో నిర్వహించడం వల్ల సూక్ష్మ బిందువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలుసుకోవడం ముఖ్యం. కానీ చాలాచోట్ల వైద్యులు, ఉన్నత స్థాయి అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు. ► బాగా కనిపించే సహోద్యోగి లేదా స్నేహితుడు వైరస్‌ను మోస్తున్నారని తెలుసుకోవడంలో వైఫల్యం కనిపిస్తుంది. ► ఇక ఇతరులతో కారులో ప్రయాణించేటప్పుడు ఏసీలు వేసుకొని ప్రయాణిస్తుంటారు. గ్లాసులు దించరు. ► దేశంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 138 మంది ఆరోగ్య కార్యకర్తల మరణాలు సంభవించాయి. వాటిలో ఆత్మహత్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మానసిక ఒత్తిడి ఉంటే కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరముంది. మానసిక, శారీరక అలసట రోడ్డు ప్రమాదాలకు దోహదం చేస్తుంది. అలాంటి కారణాలతో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులు, ఒక అంబులెన్స్ డ్రైవర్ ప్రమాదాల్లో మరణించారు. ► ఆసుపత్రుల్లో సాధారణ పడకలు, ఐసీయూలు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యంతో ఉన్న పలువురు వైద్యులకు చికిత్స చేయలేని పరిస్థితి ఏర్పడింది. అనేక సందర్భాల్లో వారు పడకల కోసం ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చింది. ► కరోనాతో దేశంలో ఒక డాక్టర్, అతని భార్య చనిపోయారు. వీరు 60 ఏళ్లలోపువారే. ఏం చేయాలి? ► చాలా మంది లక్షణాలు లేకుండా వైరస్‌ను వ్యాప్తి చేస్తారు. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడంలో సిబ్బందికి సెంటినెల్ పరీక్ష అవసరం. సెంటినెల్ టెస్టింగ్ అనేది లక్షణాలు లేనప్పుడు, అధిక రోగులున్న ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అవసరం. సెంటినెల్ పరీక్ష లేకుండా వైరస్ వ్యాప్తిని అంచనా వేయడం అసాధ్యం. ► ఆపరేషన్ సమయంలో సిబ్బంది ప్రామాణిక కరోనా ప్రొటోకాల్‌ను అనుసరిస్తే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు. ► ప్రారంభ లక్షణాలు తేలికపాటివి అయినప్పటికీ, ఏదైనా తీవ్రతరం కావడానికి జాగ్రత్తగా పర్యవేక్షణ అవసరం. లేకుంటే సీరియస్ అయ్యే ప్రమాదముంది. ► ఇది కొత్త వ్యాధి కాబట్టి, ఇతర అనారోగ్యాలకు దీనికి తేడా ఉంది. గత అనుభవాల ఆధారంగా మాత్రమే చికిత్స చేయమని పట్టుబట్టకుండా, తాజా మార్గదర్శకాలను అనుసరించాలి. ► అనేక మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది మహమ్మారిని తక్కువ చేసి చూస్తున్నారు. అటువంటి వైఖరి ఉన్న వ్యక్తులు తమకు మాత్రమే కాదు, సహోద్యోగులకు, కుటుంబానికి, సమాజానికి అన్యాయం చేసినట్లే.. మహమ్మారి ఒక బూటకమని, భౌతికదూరం అనవసరం అని నమ్ముతూ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 5 నెలల్లో వంద మందికిపైగా డాక్టర్లు దేశంలో మరణించారనేది వాస్తవం. దీన్ని గుర్తుంచుకోవాలి. ► అత్యధిక జనాభా కలిగిన దేశంలో రోగుల రద్దీ అనివార్యమే. అందువల్ల టోకెన్, అపాయింట్మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. టెలిమెడిసిన్, వైద్యులకు షిఫ్ట్‌ల వారీగా పనిచేయించడం అవసరం. కానీ చాలాచోట్ల ఇవి అమలు కావడం లేదు. -
కిడ్నీ బాధిత భారతం
ఆయా సంస్థలు దేశంలో 52,273 మంది వ్యాధిగ్రస్తులను సర్వే చేశాయి. ప్రాంతం, సామాజిక ఆర్థిక స్థాయిల వారీగా అధ్యయనం చేశాయి. అందులో తూర్పు భారతం నుంచి 5,768 మంది వ్యాధికి గురికాగా, ఉత్తర భారతం నుంచి 14,588 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక ఈశాన్య భారతం నుంచి 13,362 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అయితే అత్యధికంగా దేశంలో దక్షిణ భారతం నుంచే 18,555 మంది మూత్రపిండాల వ్యాధికి గురయ్యారు. దక్షిణాది నుంచి వ్యాధికి గురైన వారిలో నెలకు రూ.5 వేలలోపు ఆదాయం ఉన్నవారు ఏకంగా 44.3% ఉండటం గమనార్హం. అలాగే రూ.20 వేలలోపు ఆదాయం గల 42.9% మందికి కిడ్నీ వ్యాధి సోకింది. మిగిలిన 12.7% మంది నెలకు రూ.20 వేలకు పైగా ఆదాయం గల వారున్నారని నివేదిక తెలిపింది. ఇక దక్షిణాదిలోనే షుగర్ కారణంగా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నవారు 32.9 శాతమున్నారు. బీపీ ద్వారా కిడ్నీ వ్యాధి బారిన పడినవారు 11.8% మంది ఉన్నారు. 2040 నాటికి నాలుగో స్థానం 2016 లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. అదే దేశంలో మొదటిస్థానంలో ఉన్న వ్యాధిగా నివేదిక తెలిపింది. ఆ తర్వాత పక్షవాతం రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఊపిరితిత్తుల వ్యాధి ఉంది. అలా 16వ స్థానంలో కిడ్నీ వ్యాధి ఉంది. కానీ 2040 నాటికి కిడ్నీ వ్యాధి నాలుగో స్థానానికి వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. గుండె, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధి తర్వాత కిడ్నీ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యే ప్రమాదముందని తెలిపింది. తెలంగాణలో తక్కువే హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, సిక్కిం, నాగాలాండ్, గోవా, కేరళ రాష్ట్రాల్లో బీపీ బారినపడిన వారు అధికంగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో 26% మందికిపైగా బీపీతో బాధపడుతున్నారు. ఉత్తరాఖండ్, అసోంలో 24 నుంచి 26% ఉన్నారు. తెలంగాణ, రాజస్తాన్, యూపీ, మిజోరం రాష్ట్రాల్లో బీపీ రోగులు తక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో 18%లోపు మాత్రమే బీపీతో బాధపడుతున్నారు. అయితే అధిక కొవ్వుతో బాధపడేవారు తెలంగాణలో ఏకంగా 22 నుంచి 25.4 %మంది ఉన్నారు. కిడ్నీ రోగులకు వైద్యుల కొరత.. కిడ్నీ వ్యాధి విస్తరిస్తున్నా ఆ మేరకు రోగులకు చికిత్స చేసే నెఫ్రాలజిస్టులు (కిడ్నీ వైద్య నిపుణులు) మాత్రం ఆ స్థాయిలో లేరు. ప్రస్తుతం దేశంలో కోటి మందికి కిడ్నీ వ్యాధి ఉండగా, వారికి చికిత్స చేయాలంటే కనీసం 30 నుంచి 40 వేల మంది నెఫ్రాలజిస్టులు కావాలి. కానీ ఇప్పుడు 5 వేల మంది రోగులకు ఒక నెఫ్రాలజిస్టు మాత్రమే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లోనైతే అసలు నెఫ్రాలజీ వైద్యులే లేరంటే మరీ దారుణం. తెలంగాణలో 200 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారని వైద్య వర్గాల అంచనా. ఫిజీషియన్ల పాత్ర కీలకం దేశంలో నెఫ్రాలజిస్టుల కొరత ఉన్నమాట నిజమే. కాబట్టి ఆ మేరకు కిడ్నీ వ్యాధిని గుర్తించడంలో, అవసరమైన మేరకు చికిత్స చేయడంలో ఫిజీషియన్లు కూడా కీలకంగా ఉండాలి. రోగుల్లో వస్తున్న మార్పులను గుర్తించాలి. కిడ్నీ వ్యాధి ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించాలి. – డాక్టర్ తాడూరి గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ కుటుంబంలో ఎవరికైనా ఉంటే అనుమానించాలి షుగర్, బీపీ వంటివి ఉంటే కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఉంటే తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలి. రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ పరీక్ష కూడా అవసరం. ముందుగా కిడ్నీ వ్యాధిని గుర్తిస్తే త్వరగా నయం చేయడానికి వీలు కలుగుతుంది.–డాక్టర్ కార్తీక్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ -
అదే పనిగా తుమ్ములు... తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కు బిగుసుకున్నట్లుగా ఉండటం, వాసనలు గ్రహించలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. నేను చాలా మంది వైద్యులను సంప్రదించాను. సమస్య తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. కాబట్టి హోమియోలో దీనికి పరిష్కారం చెప్పగలరు. - నరసింహారావు, కర్నూలు మీరు చెబుతున్న సమస్య ఈ రోజుల్లో చాలా మందిని బాధిస్తోంది. దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో వేరే సమస్యలు (దుమ్ము, పుప్పొడి, ఘాటు వాసనలు) తగిలి ముక్కుల్లోని పొరలు ఉబ్బి, ఈ సమస్య మొదలువుతుంది. ఇది అలర్జీ వల్ల జరుగుతుంద. అలర్జి సమయంలో శరీరంలో హిస్టమైన్స్ విడుదల అవుతాయి. దీనివల్ల ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయిపోయి, పొరలు కూడా ఉబ్బి ఆగకుండా తుమ్ములు, ముక్కు వెంట నీరు కారడం మొదలువుతుంది. తర్వాత ముక్కు బిగుసుకుపోవడం జరుగుతుంది. ఈ దశలోనే చికిత్స తీసుకోవడం మంచిది. కారణాలు : ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం, కొంతమందిలో ముక్కు దూలం, రంధ్రాల మధ్య గోడ కాస్త వంకరంగా ఉండటం కొన్ని కారణాలు. ఇవి మాత్రమే గాక చాలా అంశాలు ఈ సమస్యకు దారితీస్తాయి. లక్షణాలు : ఆగకుండా విపరీతంగా తుమ్ములు రావడం ముక్కుకారడం ముక్కు బిగదీసుకుపోయినట్లుగా అనిపించడం ముక్కులో మొదలైన అలర్జీ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి రావచ్చు. ముక్కులోని పొరలు ఉబ్బటం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్య మెల్లమెల్లగా అధికమై మున్ముందు సైనసైటిస్, ముక్కులో కండపెరగడం, ఘ్రాణశక్తి తగ్గిపోవడం వంటి పెద్దపెద్ద సమస్యలు రావడానికి అవకాశం ఉంది. నిర్ధారణ : వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం, ఎక్స్‌రే, సీటీ స్కాన్ నివారణ : అలర్జీలు కలిగించే అంశాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం సరైన పోషకాహారం తీసుకోవడం చల్లని వాతావరణానికి దూరంగా ఉండటం పొగతాగే అలవాటును మానేయడం. చికిత్స: రోగి స్వభావాలను బట్టి తగిన కాన్స్టిట్యూషనల్ చికిత్స అదించడం ద్వారా రోగనిరోధకశక్తిని క్రమంగా పెంచుతూ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ ఫిట్స్ అదుపులోకి వచ్చేదెలా..? నా వయసు 25 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా మూర్చ వ్యాధి (ఫిట్స్)తో బాధపడుతున్నాను. ఉదయం నిద్రలేవగానే ఎక్కువగా ఉలిక్కిపడుతున్నాను. చేతిలోని వస్తువులు కింద పడిపోతున్నాయి. కాళ్లు, చేతులు కొట్టుకుంటూ స్పృహతప్పి పడిపోతాను. మా అమ్మకు కూడా ఇలాగే ఉండేదట. తల స్కానింగ్ చేసి బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపించండి. - సుందర్, నల్లగొండ మీరు చెబుతున్న అంశాలను బట్టి జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది జన్యుపరమైన కారణాల వల్ల వంశపారంపర్యంగా వస్తుంది. మీరు ఈఈజీ అనే పరీక్ష చేయించుకోవాలి. దానితో జబ్బు తీవ్రత తెలుస్తుంది. తర్వాత వాల్ప్రొయేట్ అనే మందులు వాడటం ద్వారా ఫిట్స్‌ను కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అయితే ఈ మందులు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. నా వయసు 30 ఏళ్లు. గత రెండు నెలలో మూడు సార్లు ఫిట్స్ వచ్చాయి. కొంచెం తలనొప్పిగా ఉంటోంది. మా ఊళ్లో డాక్టర్‌ను కలిసి మందులు తీసుకున్నాను. ఆ మందులు వాడాక కూడాఫిట్స్ వచ్చాయి. అవి తగ్గడానికి ఏం చేయాలి? - సుభాష్, జడ్చర్ల మీరు ఒకసారి సీటీ స్కాన్ చేయించుకోవాలి. ఒక్కోసారి మన కడుపులో ఉండే నులిపురుగులు మెదడులోకి ప్రవేశించి ఫిట్స్ రావడానికి కారణమవుతాయి. దీనికి రెండు వారాల నుంచి నాలుగు వారాల వరకు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. మీ ఫిట్స్ మందులు కూడా మార్చాల్సి రావచ్చు. మీ స్కానింగ్ రిపోర్ట్‌ల ఆధారంగా మందులు ఎన్నాౠఉ్ల వాడాలనేది చెప్పవచ్చు. మీకు మద్యం తీసుకునే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి. నా వయసు 60 ఏళ్లు. పక్షవాతం వచ్చి నాలుగేళ్లు అయ్యింది. అయితే గత నెల రోజులుగా నాలుగుసార్లు ఫిట్స్ వచ్చాయి. డాక్టర్‌కు చూపిసుఏ్త పెద్దాసుపత్రికి వెళ్లమని చెప్పారు. నాకు సరైన సలహా ఇవ్వండి. - సుదర్శన్‌రావు, వరంగల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ఇస్కిమిక్ సీజర్స్‌తో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. పక్షవాతం వచ్చినవారిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంద. మీరు సీటీస్కాన్, ఈఈజీ ద్వారా ఫిట్స్‌ను తగ్గించవచ్చు. మీరు ఈ మందులను కనీసం మూడేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమంది జీవితాంతం కూడా మందులు వాడాల్సి రావచ్చు. నాకు ఇరవైఏళ్లు. గత పదేళ్లుగా ఫిట్స్ వస్తున్నాయి. అవి వచ్చే ముందు పిచ్చిచేష్టలు, వెకిలినవ్వులు చేస్తుంటానని చూసినవాళ్లు చెప్పారు. నాకైతే అవేమీ తెలియదు. దీనివల్ల నేను పనికి కూడా వెళ్లలేకపోతున్నాను. సరైన సలహా ఇవ్వండి. - కిశోర్, మంచిర్యాల మీరు టెంపోరల్ ఎపిలెప్సీ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జబ్బుకు ఇప్పుడు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. సరైన మోతాదులో మందులు వాడటం వల్ల జబ్బు తగ్గుతుంది. దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌కు చూపించండి. ఒకవేళ మందులతో జబ్బు తగ్గకపోతే ఆపరేషన్ ద్వారా కూడా ఫిట్స్‌ను నియంత్రించవచ్చు. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్