వైద్యుల కొరత లేకుండా చర్యలు  | Andhra Pradesh Govt special focus on medical and health sector | Sakshi
Sakshi News home page

వైద్యుల కొరత లేకుండా చర్యలు 

Published Wed, Mar 2 2022 6:06 AM | Last Updated on Wed, Mar 2 2022 6:06 AM

Andhra Pradesh Govt special focus on medical and health sector - Sakshi

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, సిబ్బంది కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 39 వేల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. వీటిలో ఇప్పటికే 27 వేల పోస్టులు భర్తీ కాగా మిగిలిన పోస్టులు ఈ నెలాఖరుకు భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుతం 11 మెడికల్, రెండు డెంటల్‌ కళాశాలలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 23 బోధనాస్పత్రులు ఉన్నాయి. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల కోసం నిత్యం వేల సంఖ్యలో బోధనాస్పత్రులకు వస్తుంటారు. గత టీడీపీ ప్రభుత్వం ఈ ఆస్పత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పెరిగిన జనాభా, రోగుల తాకిడికి అనుగుణంగా కొత్త పోస్టులు సృష్టించడం కాదు కదా.. ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది.  

విధుల్లో నిర్లక్ష్యం.. 20 మంది తొలగింపు 
ఈ నేపథ్యంలో బోధనాస్పత్రులను పటిష్టంగా తీర్చిదిద్దుతోన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందులో మానవ వనరులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వాటిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. సుమారు 70 మంది వైద్యులు విధులకు హాజరవ్వకుండా సెలవుల్లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో వీరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంతో 50 మంది తిరిగి విధుల్లో చేరారు. మరో 20 మందిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ పోస్టులను ఖాళీలుగా గుర్తించి పదోన్నతులు, ప్రత్యక్ష ఎంపిక ద్వారా వాటిని భర్తీ చేస్తోంది.  

బోధనాస్పత్రుల్లో 9 వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు  
2019 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బోధనాస్పత్రుల్లో 9 వేలకు పైగా> పోస్టుల భర్తీ చేపట్టింది. వీటిలో ఖాళీగా ఉన్న 1,952 పోస్టులతోపాటు 2,190 కొత్త పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నియామకాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నియామకాలతో ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న వైద్యుల కల నెరవేరింది.

నిబంధనల ప్రకారం.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పనిచేసినవారు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా నాలుగేళ్లు పనిచేసినవారు ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హులు. అయితే అర్హత ఉన్నప్పటికీ పోస్టులు లేకపోవడం, పోస్టులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వీరంతా పదోన్నతుల కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్తగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల పోస్టులు సృష్టించడంతో వందల మంది అర్హులకు పదోన్నతులు లభిస్తున్నాయి. ఇలా పదోన్నతుల ద్వారా ప్రస్తుతం 161 ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటిలో 51 పోస్టులు కొత్తగా సృష్టించినవే కావడం గమనార్హం. అదే విధంగా 421 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తుండగా వీటిలో 187 కొత్త పోస్టులే. ఇలా పదోన్నతులతో ఖాళీ అయ్యే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో భర్తీ చేస్తోంది. ప్రస్తుతం 326 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల నియామకం చేపడుతుండగా వీటిలో 150 కొత్తగా సృష్టించినవే.  

ఏకకాలంలో చేపడుతున్నాం.. 
పదోన్నతులు, నియామకాలను ఏకకాలంలో చేపడుతున్నాం. పదోన్నతులు పూర్తి కాగానే కొత్తగా ఎంపికైనవారికి పోస్టింగ్‌లు ఇస్తాం. ఈ నెలాఖరుకు మొత్తం ప్రక్రియ ముగిస్తాం. ఇకపై బోధనాస్పత్రుల్లో వైద్యులు, వైద్యేతర సిబ్బంది కొరత ఉండదు.      
– డాక్టర్‌ రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement