'హాలీవుడ్ నా బాయ్ ఫ్రెండ్.. బాండ్ గర్ల్‌గా వస్తా'
పిలిప్పీన్స్: తనకు బాండ్ చిత్రాల్లో నటించాలని ఉందని విశ్వసుందరి పియా అలంజో వూర్త్బాచ్ తన మనసులో మాట చెప్పింది. ఇటీవల మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న ఈ పిలిప్పీన్స్ సుందరికి ప్రస్తుతం ఆ విజయాన్ని అనుభవిస్తున్నానని తెలిపింది. తాను విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న రోజు మరువలేనిదని చెప్పింది. ప్రస్తుతం తనకు డేటింగ్, బాయ్ ఫ్రెండ్ వంటి ఆలోచనలేవీ లేవని, హాలీవుడ్ పరిశ్రమే ప్రస్తుతం తనకు బాయ్ ఫ్రెండ్ అని, అందుకే తన కలలు నెరవేర్చుకునేందుకు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని చెప్పింది.
55 ఏళ్ల అక్వినోతో పియా డేటింగ్ చేసిందన్న పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ఆమె పై వివరణ ఇచ్చింది. మున్ముందు వచ్చే జేమ్స్ బాండ్ చిత్రాల్లో బాండ్ గర్ల్ గా నటించాలన్నదే తన కోరిక అని చెప్పింది. పదకొండేళ్ల వయసులోనే ఫ్యాషన్ రంగం వైపు అడుగుపెట్టిన పియా ఇప్పటికే పలు టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో చిన్నపాత్రల్లో నటించింది. అవేవీ ఆమెకు పేరు ప్రఖ్యాతులు తీసుకురాలేదు. అదీ కాకుండా ఈ సారి ఆమెకు విశ్వసుందరి కిరీటం కూడా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనల మధ్య చోటుచేసుకుంది.
ఈ ఏడాది నిర్వహించిన విశ్వసుందరి పోటీల్లో వాస్తవానికి పియా నే విజేతగా నిలిచినా.. విజేతల ప్రకటనలో కొంత గందరగోళం జరిగి, వివాదాస్పదంగా మారింది. కార్యక్రమం నిర్వాహకుడు స్టీవ్ హార్వే తొలుత ఈ విజేతలను తారుమారుగా ప్రకటించారు. తొలిస్థానంలో కొలంబియా యువతి అరియాడ్నా, రెండో స్థానంలోఅలొంజో, మూడో స్థానంలో ఒలివియా నిలిచారని చెప్పారు. అరియాడ్నా వేదికపై క్యాట్‌వాక్ చేసి ప్రేక్షకులకు అభివాదం కూడా చేసింది. గత ఏడాది మిస్ యూనివర్స్, కొలంబియాకే చెందిన పౌలినా వెగా వేదికపైకి చేరుకుని అరియాడ్నా తలపై కిరీటం పెట్టింది.
కానీ విజేతలను ప్రకటించడంలో పొరపాటు జరిగిందంటూ నిర్వాహకుడు స్టీవ్ హార్వే ఒక్కసారిగా షాకిచ్చారు. మొదటి స్థానంలో పియా, రెండో స్థానంలో అరియాడ్నా నిలిచినట్లు ప్రకటించారు. ఈ తప్పిదానికి తాను బాధ్యత వహిస్తానని, ఎవరూ బాధపడవద్దని వ్యాఖ్యానించారు. దీంతో తిరిగి వేదికపైకి వచ్చిన మాజీ మిస్ యూనివర్స్ పౌలినా వెగా.. అరియాడ్నా నుంచి కిరీటాన్ని తీసుకుని పియా అలొంజోకు అలంకరించారు. దీంతో గతంలో లేనంత స్థాయిలో విశ్వసుందరి విజేతగా పియాకు భారీ ఎత్తున ప్రచారం లభించింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో వీక్షించారు. ఈ ప్రచారంతోనే ప్రస్తుతం ఆమె హెచ్ఐవీపై ఇటు అమెరికా ప్రజలను, తమ మాతృదేశం పిలిప్పీన్స్ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కదలడానికి సిద్ధంగాఉంది. తమ దేశంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 22శాతానికి పెరిగిందని, ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగానే ఆమె ముందుకు సాగుతానని చెప్పారు. అమెరికాతో తమకు ముందునుంచే సత్సంబంధాలు ఉన్నందున వారి సహాయం కోరేందుకు వెనుకాడబోనని పియా పేర్కొంది.