పైలట్లూ.. గాలిపటాలతో జాగ్రత్త!
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే గాలిపటాల జోరు బాగా కనిపిస్తుంది. దాదాపుగా భారతదేశంలో అన్నిచోట్లా వీటిని బాగానే ఎగరేస్తుంటారు. ఈ నేపథ్యంలో విమానాలు నడిపే పైలట్లు కాస్తంత చూసుకుని వెళ్లాలనం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. ప్రధానంగా గుజరాత్లో వీటి సందడి మరీ ఎక్కువగా ఉంటుందని, ఔత్సాహికులు చాలా పెద్దపెద్ద మాంజాలను ఉపయోగించి తమ గాలిపటాలను విమానాల కంటే కూడా ఎత్తులో ఎగరేస్తారని, అందువల్ల అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే పైలట్లు అప్రమత్తంగా ఉండాలని ఏఏఐ తెలిపింది. ముఖ్యంగా రాత్రిపూట ఈ గాలిపటాలు కనిపించే అవకాశం తక్కువని, పగటి పూట మామూలువే ఎగరేస్తున్నా, రాత్రిళ్లు మాత్రం లైట్లు అమర్చిన గాలిపటాలు ఎగరేస్తున్నారని, అందువల్ల విమానాలు టేకాఫ్ తీసుకునే సమయంలోను, ల్యాండింగ్ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఏఏఐ తెలిపింది.
కేవలం ఒక్క అహ్మదాబాద్ మాత్రమే కాదని, ఇండోర్, వడోదర, సూరత్, ఉదయ్‌పూర్, ముంబై లాంటి నగరాల్లో కూడా గాలిపటాలతో తాము ఈ సీజన్ మొత్తం కాస్త జాగ్రత్తగానే ఉండక తప్పదని పైలట్లు అంటున్నారు. గుజరాత్లో ఉత్తర్యాన్ పేరుతో సంక్రాంతిని జరుపుకొంటారు. హైదరాబాద్‌లాగే అక్కడ కూడా భారీగా గాలిపటాల ఉత్సవాలు చేస్తుంటారు. అందుకే పైలట్లను ఏఏఐ హెచ్చరించింది.