Pimpri Chinchwad
-
పుణేలో పాక్షిక ఆంక్షల సడలింపు
సాక్షి, ముంబై: పుణే, పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్ల పరిధిలో లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం పాక్షికంగా సడలించింది. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, పుణే జిల్లా ఇన్చార్జి మంత్రి అజిత్ పవార్ ఆంక్షల సడలింపు ప్రకటన చేశారు. ఆగస్టు 9వ తేదీ నుంచే ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని పవార్ వెల్లడించారు. దీంతో పుణే, పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్ల పరిధిలోని వ్యాపార వర్గాలు, సామాన్య ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఇరు కార్పొరేషన్లలో రికవరీ రేటు గణనీయంగా పెరగడంతో పాటు కరోనా వైరస్ కూడా మెల్లమెల్లగా అదుపులోకి వస్తోంది. దీంతో లాక్డౌన్ ఆంక్షలను పాక్షికంగా సడలించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పుణే జిల్లా ఇన్చార్జి మంత్రి అజిత్ పవార్ తెలిపారు. సడలించిన నిబంధనల ప్రకారం ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని రకాల షాపులు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది. హోటళ్లు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించనున్నారు. మాల్స్ రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవచ్చని అజిత్ పవార్ వెల్లడించారు. అయితే, కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని మాత్రమే మాల్స్‌లోకి అనుమతించాలని పవార్ మాల్స్ యాజమాన్యాలకు సూచించారు. ఒకవేళ ప్రజల నిర్లక్ష్యం వల్ల పాజిటివిటీ రేటు 8 శాతాన్ని దాటితే సడలించిన ఆంక్షలను రద్దు చేస్తామని, మళ్లీ కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు వెనుకాడబోమని పవార్ హెచ్చరించారు. ప్రజలు అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని పవార్ విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నియమాలను పాటించాలని ఆయన కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అజిత్ పవార్ హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించవద్దని పౌరులందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలోని ఉద్యానవనాలు ప్రస్తుతం అమలులో ఉన్న సమయానుసారంగానే తెరిచి ఉంటాయని వెల్లడించారు. పుణే, పింప్రి–చించ్వడ్ ప్రాంతాల్లో ఈత తప్ప మిగతా అన్ని క్రీడలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇక్కడి ప్రార్థనా మందిరాలు అన్నీ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, తమ వ్యాపారాలు, కార్యకలాపాల వేళలను మార్చాలని పుణేలోని రెస్టారెంట్ల ఓనర్లు, వ్యాపారులు, మాల్ సిబ్బంది అసోసియేషన్లు డిమాండ్లు చేస్తూ గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్రంలోని 25 జిల్లాల్లో కరోనా ఆంక్షలు సడలించిన ప్రభుత్వం లెవల్–3 జిల్లాలైన పుణే సహా మరో 9 జిల్లాలకు కరోనా ఆంక్షలను సడలించలేదు. కాగా, ప్రస్తుతం పుణేలో పాజిటివిటీ రేటు 3.3 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్లో కూడా çకరోనా పాజిటివిటీ రేటు 3.7 శాతానికి తగ్గిందని అక్కడి అధికారులు వెల్లడించారు. -
పింప్రి-చించ్వాడ్ పట్టణాల్లో మద్యం విక్రయాల జోరు
సాక్షి, ముంబై: పుణే, పింప్రి-చించ్వాడ్ పట్టణాల్లో మద్యం విక్రయాలు ఏయేటికాయేడు పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే ఈ నెలలో 6,53,571 లీటర్ల మద్యం అమ్ముడుపోయింది. ఒక వైపు నూతన సంవత్సరం సమీపిస్తుండడం, మరోవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉండ డం కూడా మద్యం విక్రయాలు మరింత పెరగడానికి కారణమవుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా సుమారు 7.5 లక్షల లీటర్లకు పైగా మద్యం అమ్ముడుపోయినట్టు ఓ సర్వేలో వెల్లడైంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బీర్ విక్రయాలు జోరుగా జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో విదేశీ మద్యం, వైన్ అత్యధికంగా అమ్ముడుపోతాయి. ఇదిలాఉంచితే ఈ నెల 31తోపాటు జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి ఒంటి గంటదాకా మద్యం విక్రయించేందుకు ఆయా లిక్కర్ దుకాణాలకు అనుమతి లభించింది. అదేవిధంగా క్లబ్‌లు, పర్మిట్ రూంలను రాత్రంతా తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఎక్సైజ్ శాఖ అధికారులు నవంబర్‌దాకా జరిపిన మెరుపుదాడుల్లో రూ.2.15 కోట్లకుపైగా విలువ చేసే నకిలీ మద్యం లభించింది. మొత్తం 982 మందిని ఈ సందర్భంగా అధికారులు అరెస్టు చేశారు. -
ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం
పుణే: పింప్రి-చించ్వాడ్, పుణేలలో జిల్లా అధికార యంత్రాంగం ఓటరు నమో దు ప్రక్రియ ప్రారంభమైంది. పుణే, పింప్రి-చించ్వాడ్‌లతోపాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త ఓటర్లను నమోదు చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రక్రియలో ఓటర్లుగా నమోదైన వారు త్వరలో జరగనున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. దీంతోపాటు పాత ఓటర్లు కూడా ఇందులో పాల్గొని వయసు, చిరునామా మార్పిడి తదితర వివరాలను పొందుపరుచుకునేందుకు వీలు కల్పించారు. ఈ నెల 17న ప్రారంభమై న ఓటర్ల నమోదు ప్రక్రియ వచ్చే నెల 17వ తేదీదాకా కొనసాగుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. పుణే నగర పరిధిలో మొత్తం 60 లక్షల ఓటర్లు ఉన్నారు. పుణే సిటీ, పింప్రి-చించ్వాడ్‌లతోపాటు జిల్లాలోని గ్రామీణ పరిధిలో కలిపి మొత్తం 21 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇం దులో 11 నియోజకవర్గాలు నగర పరిధిలోనే ఉన్నాయి. ఓటర్ల నమోదు ప్రక్రి య సందర్భంగా అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి ఆ తర్వాత ఓటర్ల జాబితాకు జత చేస్తారు. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీన తుది జాబితాను ప్రకటిస్తారు. సమీప కేంద్రంలో సంప్రదించండి ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ దరఖాసుల కోసం తమకు సమీపంలోని పోలింగ్ కేంద్రంలో సంప్రదించాలని తెలిపారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం రెండు వేలమంది అధికారులను సంబంధిత యంత్రాంగం నియమించిందన్నారు. తమ తమ దరఖాస్తులను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి సమర్పించాలన్నారు. ఆరో నంబర్ ఫాంను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు వయసు, నివాస ధ్రువీకరణ, గుర్తింపు కార్డు తదితర పత్రాలను జత చేయాల్సి ఉంటుందన్నారు. తప్పొప్పుల సవరణ కోసం ఎనిమిదో నంబర్ ఫాంను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జనవరి ఒకటో తేదీనాటికి దరఖాస్తుదారుల వయసు 18 సంవత్సరాలు నిండాలన్నారు.