‘పట్నం’కు నిధుల వరద
- గ్రామపంచాయతీల అభివృద్ధికి రూ.10.80 కోట్లు విడుదల
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
- మిగతా హామీలపై విడుదల కానీ జీఓలు
‘ఇబ్రహీంపట్నం వజ్రపు తునకలాంటిది. ఈ ప్రాంతాన్ని ఊహిం చని రీతిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.’ సోమవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన బహిరంగసభలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న మాటలివి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి రూ.10.80 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక నిధి (ఎస్డీఎఫ్) కింద ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా నియోజకవ ర్గంలోని 79 పంచాయతీలు, 20 అనుబంధ గ్రామాలకు ఈ నిధులను విడుదల చేశారు. గ్రామ పంచాయతీల్లో అత్యవసర పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
ఒక్కదానికే మోక్షం..!
ఇబ్రహీంపట్నంపై హామీల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి... మంగళవారం సాయంత్రం నాటికీ వాటికి సంబంధించిన జీఓలూ విడుదలవుతాయని ప్రజల హర్షాధ్వానాల మధ్య ప్రకటించారు. హైదరాబాద్-ఇబ్రహీంపట్నం వరకు సెంట్రల్ లైటింగ్, ఇబ్రహీంపట్నం చెరువులోకి వరద నీరు వచ్చే ప్రధాన వాగు (మాదాపూర్-ఎలిమినేడు) విస్తరణ, మాల్ వరకు నాలుగులేన్ల రహదారి అభివృద్ధి పనులకు రేపటిలోగా ఉత్తర్వులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీల్లో పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల మినహా.. ప్రధానమైన హామీలకు ఇంకా మోక్షం కలగకపోవడం గమనార్హం.