భారత్‌కు ఐదో స్థానం
గ్లాస్గో గేమ్స్‌కు వీడ్కోలు
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. పన్నెండు రోజులపాటు అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన క్రీడాకారుల విన్యాసాలకు తాత్కాలికంగా తెర పడింది. గత పోటీల స్థాయిలో కాకపోయినా... ఈసారి కూడా భారత క్రీడాకారులు పలు క్రీడాంశాల్లో పతకాల పంట పండించారు. జూలై 23న ప్రారంభమైన ఈ క్రీడల్లో తొలిరోజే వెయిట్‌లిఫ్టర్ సుఖేన్ డే భారత్‌కు తొలి స్వర్ణాన్నందించగా... చివరి రోజు బ్యాడ్మింటన్‌లో పారుపల్లి కశ్యప్ సాధించిన స్వర్ణం దాకా భారత్ పసిడి వేట కొనసాగింది. షూటింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లలో మనవాళ్లు అంచనాలకు అనుగుణంగానే రాణించినా... బాక్సర్లు మాత్రం ఒక్క స్వర్ణమూ సాధించకుండా రజత పతకాలతో సంతృప్తి పడ్డారు.
టేబుల్ టెన్నిస్‌లో ఒకే ఒక్క పతకంతో నిరాశపరిచారు. స్క్వాష్‌లో తొలిసారి పతకాన్ని... అదీ స్వర్ణాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టిం చారు. పసిడి పతకాల్లో కాస్త వెనకబడినా... మొత్తంగా 64 పతకాలతో భారత్ ఐదో స్థానంతో పోటీలను సంతృప్తికరంగా ముగించింది. ఇంగ్లండ్ 174 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక వచ్చే కామన్వెల్త్ గేమ్స్ 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరగనున్నాయి.